‘‘1996, అక్టోబరు 4… కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆదివాసీ బిల్లును వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, అతివాద ఉద్యమకారులు నలుగురు మామూలు ఫిర్యాదుదారుల్లాగే పాలక్కడ్ కలెక్టరేట్‌కు వచ్చారు… తుపాకీ, డైనమైట్లు చూపించి, సిబ్బందిని బెదిరించి, కలెక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు… 9 గంటలపాటు హైడ్రామా నడిచింది… నేరుగా కలెక్టరేట్‌కు వచ్చి, ఒక కలెక్టర్‌ను బందీగా చేసుకుని, తమ డిమాండ్లు పెట్టడం అప్పట్లో ఓ సంచలనం…
సరే, ప్రభుత్వం ఏదో హామీ ఇచ్చింది, వాళ్లు ఆయన్ని వదిలేశారు… తరువాత మీడియా ముందుకొచ్చి బొమ్మ తుపాకీని, వైర్ చుట్టిన పైప్‌ను డైనమైట్‌గా వాడామనీ, అంతేతప్ప అవి అసలైన ఆయుధాలు కావనీ వెల్లడించారు… అప్పట్లో న్యూస్ చానెళ్లు లేవు… విలేకరులు అదే రాసుకున్నారు, వెళ్లిపోయారు…’’ ఇదీ సంఘటన… దీని ఆధారంగానే మలయాళంలో పడ అనే సినిమా తీశారు… కథల అన్వేషణ, ఎంపిక, ట్రీట్‌మెంట్ విషయాల్లో మలయాళీ ఇండస్ట్రీ ధోరణి బాగుంటుంది…
ఈ సినిమాకు కూడా విమర్శకుల నుంచి మంచి అభినందనలు దక్కాయి… అదంతా వేరే కథ… నమస్తే తెలంగాణ ఓ స్టోరీ పబ్లిష్ చేసింది నిన్న… ఆనాడు అతివాద ఉద్యమకారులు బందీగా పట్టుకున్న ఆ కలెక్టర్‌తో మాట్లాడి, కొన్ని వివరాలతో ఓ స్టోరీ చేశారు… నిజానికి ఇంకాస్త డిటెయిల్డ్‌గా చేయొచ్చు… ఆ కలెక్టర్ పేరు డబ్ల్యూ ఆర్ రెడ్డి… రిటైరయ్యాక హైదరాబాదులోనే నార్సింగిలో సెటిలయ్యాడు… ఆ స్టోరీ ఇదీ…
Ads
‘‘ఆ సంఘటన రిపోర్టింగులో జర్నలిజం ఘోరంగా విఫలమైంది’’ అన్నాడు తను… కానీ అది సరైన అంచనా కాదు… ‘‘వాళ్లు డమ్మీ ఆయుధాలతో కాదు, నిజమైన ఆయుధాలతోనే వచ్చారు, వాళ్ల దగ్గర బాంబులు నిజంగానే ఉన్నాయి… ఓ బాంబ్ పేల్చారు కూడా, ఉద్యమకారుల బ్యాగులను ఎవరూ చెక్ చేయలేదు… కొందరు నాయకులు ఘటనను వక్రీకరించారు, నేను వరంగల్ నుంచి వచ్చాననీ, మావోయిస్టుననీ అన్నారు… నాదేమో కర్నూలు… ఉన్నతాధికారులకు వివరణ ఇవ్వాల్సి వచ్చింది…’’ అని వివరించాడు…
ఓ కలెక్టర్ విడుదల అనేదే అక్కడ విలేకరులకు అప్పటికప్పుడు ప్రయారిటీ వార్త… పైగా బ్యాగులు చెక్ చేయడం, అది బొమ్మ తుపాకీయో కాదో నిగ్గు తేల్చుకోవడం మీడియా పని కాదు… అవి నిజమైన బాంబులేనా అని మీడియా తనిఖీ చేయదు కదా… వాళ్లు చెప్పింది, వాళ్ల వెర్షన్‌గానే రాసుకుంటారు… అది ఓ సంఘటన రిపోర్టింగ్… ఫాలో అప్ స్టోరీ కాదు, పైగా ఇన్వెస్టిగేటివ్ స్టోరీ అసలే కాదు… స్పాట్ కవరేజీ… అప్పటికప్పుడు ఏదో టెలిగ్రాం ద్వారా ఎడిషన్ సెంటర్లకు వార్తలు పంపాలనే హడావుడీ ఉంటుంది… స్పాట్ వార్తల కవరేజీ, అందులోనూ సెన్సేషనల్ ఇష్యూల కవరేజీ అంత ఈజీ వర్కేమీ కాదు… (సదరు అతివాద ఉద్యమకారులపై కేసు వీక్ చేయడానికి కూడా డమ్మీ ఆయుధాలంటూ మీడియా ముందు చెప్పి ఉంటారు… అదొక స్ట్రాటజీ…)
ఇక వరంగల్ కాబట్టి మావోయిస్టు లింకులున్నాయని అనుమానించారు అనేది నిజమే కావచ్చు… రాజకీయ నాయకులు కూడా ఆరోపణలు చేసేసరికి ఉన్నతాధికారులు వివరణ అడిగితే అడిగే ఉంటారు… (ఐనా కలెక్టర్‌కు నక్సలైట్లతో లింకులున్నాయని ఉన్నతాధికారులు గనుక సందేహిస్తే, రహస్యంగా పోలీస్ ఎంక్వయిరీ చేయించుకోవాలి గానీ ఆ కలెక్టర్‌నే వివరణ అడిగితే, సంబంధాలున్నాయని అంగీకరిస్తూ ఆన్సర్ ఇవ్వడు కదా…) అప్పట్లో వరంగల్ పేరు చెబితేనే ఓ హడల్… ఏ వృత్తిలో ఉన్నా సరే, బయట జిల్లాలకు వెళ్లి మాది వరంగల్ అని చెబితే కాస్త భయమో, భక్తో, గౌరవమో చూపించేవాళ్లు… వరంగల్ అనే పేరులోనే ఓ జోష్ ఉండేది… ఇతర విశ్వవిద్యాలయాలకు వెళ్తే వరంగల్ విద్యార్థులంటే ఓ రేంజ్ అప్పర్ హ్యాండ్ సహజంగానే లభించేది…
టీఆర్ఎస్ వార్తలు రాసీ రాసీ… నమస్తే పత్రిక ఆఫ్-బీట్ రిపోర్టింగ్‌లో బాగా తడబడుతున్నట్టుంది… అప్పట్లో కేరళ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆదివాసీ బిల్లు ఎందుకు వివాదాస్పదమైందో, ఒక్కసారిగా ఉద్యమం ఎందుకు పెచ్చరిల్లిందో కూడా అదే ఐఏఎస్ అధికారి నుంచి వివరాలు తీసుకుని రాస్తే ఇంకా బాగుండేదేమో… బందీగా ఉన్నప్పుడు తన మెంటల్ స్టేటస్, సిబ్బంది రియాక్షన్, నాయకులు కలెక్టర్ మీద ఫిర్యాదులు చేయడానికి రీజన్స్ గట్రా ఆసక్తికరంగా ఉండేవి… బట్, ఇప్పుడు పబ్లిష్ చేసిన వార్త బాగా లేదని కాదు, బాగుంది…!!
Share this Article