Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ ప్రియురాలి పాదయాత్ర..! ప్రేమ + భక్తి + విశ్వాసం + వ్యక్తీకరణ…

July 2, 2025 by M S R

.

[ రమణ కొంటికర్ల ] …. జూలై మాసం వచ్చిందంటే కన్వర్ యాత్రీకులతో ఉత్తరాదిలో ఒక ఆధ్యాత్మిక కోలాహలం కనిపిస్తుంటుంది. ప్రతీ ఏటా జూలై మాసంలో ప్రారంభమయ్యే ఆ తీర్థయాత్రలో కన్వారియాలుగా.. లేదా, శివభక్తులుగా పిలువబడేవారు లక్షలాదిమంది పాల్గొంటారు.

తమ మొక్కులు తీర్చుకునే క్రమంలో హరిద్వారా, గోముఖ్, గంగోత్రి వంటి పవిత్రస్థలాలకు కాలిబాటన వెళ్తుంటారు. ఆయా ప్రాంతాల్లోని నదుల నుంచి, ముఖ్యంగా గంగానది నుంచి తీసుకొచ్చే పవిత్రజలాలను తమ స్థానిక ఆలయాల్లోని శివుడిపై అభిషేకిస్తుంటారు. ఇది ప్రతీ ఏటా కనిపించే ఓ ఆచారం అక్కడ.

Ads

దాదాపు ఇలాంటి సంప్రదాయమే తెలంగాణా ప్రాంతంలోని కొన్ని టెంపుల్ టౌన్స్ లోనూ కనిపిస్తుంది. వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండి సమాజం ఆకలి తీరాలన్న ఓ సమున్నతమైన ఆకాంక్షతో.. గోపాలకాలాల పేరుతో శివుడికి అభిషేకాలు చేసి, భజనలు చేస్తూ స్థానిక నదుల్లో స్నానం చేయడం కనిపిస్తుంటుంది. అలాంటి ఈ కన్వర్ యాత్రలో అంతకంటే ఒక విశేషమైన కథను మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం.

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లా సహరాన్ పూర్ డివిజన్ నుంచి ఒక అమ్మాయి కూడా కన్వారియాగా మారి 140 కిలోమీటర్ల ప్రయాణాన్ని కాలినడకన చేసింది. తమ మొక్కులు తీర్చుకునేందుకే ఈ కన్వర్ యాత్ర చేపట్టే భక్తుల సంఖ్య అధికంగా కనిపించే క్రమంలో.. మనం చెప్పుకోబోతున్న లక్ష్మి ప్రయాణం కూడా అటువంటిదే. కానీ, ఆ మొక్కులోనే కొంత భిన్నమైన కథా మనకు కనిపిస్తుంది.

lover

భక్తిని మించిన ప్రేమ లక్ష్మిది!

మీరట్ జిల్లాలోని పార్థాపూర్ లక్ష్మి స్వగ్రామం. తన గ్రామం నుంచి హరిద్వార్ వంటి ప్రాంతానికి ఏకంగా 140 కిలోమీటర్ల ప్రయాణాన్ని లక్ష్మి చేపట్టడం వెనుక కేవలం ఆమె భక్తి మాత్రమే లేదు.. తన ప్రియుడు అనుకున్నది సాధించాలన్న ఆకాంక్ష ఉంది. అందుకే తన స్నేహితురాలు మాన్సీతో కలిసి మొక్కు కోసం నడక ప్రారంభించింది లక్ష్మి.

ఇంతకీ ఏం మొక్కంటారా..? ఆర్మీలో ఉద్యోగం సంపాదించాలన్నది లక్ష్మి ప్రియుడి తపన. ఇప్పటికే ఏడాది నుంచి ఆ సెలక్షన్స్ కోసం లక్ష్మి ప్రియుడు కష్టపడుతున్నాడు. కాబట్టి, తను విజయం సాధించాలని తన ప్రియుడి కోసం మొక్కుకున్న మొక్కది.

తన మొక్కులో భాగంగా హరిద్వారా గంగాతీరం నుంచి సేకరించిన పవిత్రమైన ఆ జలాన్ని ఆ ఝటాజూటుడిపై అభిషేకిస్తే తన ప్రియుడి కోరిక నెరవేరుతుందన్నది లక్ష్మి అచంచల విశ్వాసం.

ప్రేమకోసం ఆధ్యాత్మిక మార్గం!

లక్ష్మి తన కాలిబాటన ప్రయాణించి.. తాను సేకరించిన 81 లీటర్ల గంగాజలాన్ని తమ వెంట తెచ్చుకున్న పాత్రలతో మీరట్ లోని తన స్వగ్రామానికి తిరుగు ప్రయాణమైంది. అలాగే, తిరుగు ప్రయాణంలోనూ లక్ష్మి, తన ఫ్రెండ్ మాన్సీ ఇద్దరూ మొక్కవోని దృఢసంకల్పంతో పాటే, లక్ష్మి ప్రేమ కథ విని చలించిన సాటి పాదయాత్రీకుల ఆశీర్వాదాలతో తమ ప్రయాణాన్ని విజయవంతంగా ముగించారు.

లక్ష్మి పంథాకు సమాజం నుంచి ప్రశంసల జల్లు!

లక్ష్మి కథ విన్న ముజఫర్ నగర్ వాసులు పెద్దఎత్తున గుమ్మిగూడి ఆమెకు స్వాగతం పలికారు. స్థానిక శివ చౌక్ ఆమెను ప్రోత్సహించేవారితో కిక్కిరిసిపోయింది. అలిసిపోయి వస్తున్న లక్ష్మికి స్థానికులు వివిధ రకాల ఫలహారాలందించారు. ఆమెపైన పువ్వుల వర్షం కురిసింది. తన ప్రియుడి కోసం ఆమె కనబర్చిన అంకితభావం ప్రశంసలందుకుంది.

మొత్తంగా ప్రేమ, భక్తి సమ్మితమైన లక్ష్మి ఆధ్యాత్మిక ప్రయాణం తన 140 కిలోమీటర్ల నడక అలసటను మరిపించే ఓ వేడుకగా మారింది. అప్పటివరకూ తాను తన ప్రియుడి ప్రేమ కోసం భక్తితో చేపట్టిన ఆధ్యాత్మిక యాత్ర కాస్తా.. తనకు సమాజం నుంచి లభించిన మద్దతుతో ఒకింత భావోద్వేగంతో పాటు, ఏ లక్ష్యం కోసమైతే తాను పాదయాత్ర చేపట్టిందో ఆ లక్ష్యం చేరుకుంటానన్న ఒక చిన్న ఆశను కూడా రేకెత్తించింది.

శివరాత్రి రోజు గంగాజల సమర్పణకు ప్లాన్!

పాదయాత్రగా వెళ్లి తాను సేకరించిన గంగాజలాన్ని తన స్వగ్రామమైన పార్థాపూర్ లోని శివాలయంలో తన దోసిటతో ఆ శివయ్యను అభిషేకించాలని నిర్ణయించుకుంది. తన ప్రియుడు పెట్టుకున్న లక్ష్యం నెరవేరాలని.. తాను భారత సైన్యంలో చేరి సేవలందించే కల సాకారం కావాలని అభిషేకిస్తూ ఆ శివయ్యను ప్రార్థించాలనేది ఇప్పుడు లక్ష్మి మొక్కులో ఆలోచన.

అయితే, లక్ష్మి మొక్కు ఆదిలోనే చెప్పుకున్నట్టు.. కేవలం ఆ శివుడిపైనో, దేవుడిపైనో విశ్వాసం వరకు మాత్రమే పరిమితం కాలేదు… ప్రేమ, విశ్వాసం, ఆశ అనేవి క్లిష్టతరమైన మార్గాల్లో కూడా ప్రయాణించేందుకు ఎలా దోహదం చేస్తాయో చెప్పుకోవడానికి ఈ లక్ష్మి కథ ఓ నిదర్శనం.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • యాక్షన్ లేదు, ఆధార్ బ్లాకూ లేదు… ఈ వివాదం పూర్వపరాలు ఇవీ…
  • మిస్టర్ కీరవాణీ… ఈ వారణాసి లవ్ సాంగ్ వీడియో నువ్వైనా చూశావా..?
  • బాగా మగ్గిన అరటి పండు కేన్సర్‌ కణాల్ని చంపేస్తుందా..? నిజమేంటి..?
  • ఈ తెలంగాణ ద్వేషి అస్సలు మారడు… మళ్లీ అదే విద్వేష ప్రదర్శన..!!
  • బిగ్‌బాస్..! బహుశా ఫైనల్స్‌లో తనూజ, ఇమ్మూ, పడాల, భరణి, రీతూ..!!
  • వ్యక్తిపూజ- ఫ్యానిజం… ఆంధ్రా కింగ్ తాలూకా… కాదు, ఓ హీరో ఫ్యాన్ తాలూకా…
  • హనుమాన్ చాలీసా టాప్ రికార్డు… ఇవీ ఇండియాలో టాప్ 10 వీడియోలు..!
  • బురద… బూడిద..! ఆలు లేదు, చూలు లేదు… అప్పుడే వేల కోట్ల స్కాములట..!!
  • ముగ్గురు కొడుకులు… కాదు, కాదు… ఒక తండ్రి, ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ…
  • 26/11 …. మరిచిపోలేని ఒక నిజ భారత రత్నం… కొన్ని బొగ్గు కేరక్టర్లు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions