Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చిరునవ్వుతో పురస్కారం ఇస్తూ ఈమె… చిరాకుతో ఒకాయన అప్పట్లో…

April 23, 2024 by M S R

Sai Vamshi….   చిరునవ్వుతో ఆమె.. చిరాకు పెడుతూ ఆయన… అబ్బే, ఫోటో చూసి ఆయన వెంకయ్యనాయుడు అనుకునేరు సుమా… మనం చెప్పుకునే ఆయన వేరు…

నిన్న రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ పద్మ పురస్కారాలు అందించారు. జాతీయ స్థాయిలో అందించే అవార్డుల కార్యక్రమాలను చాలా ఏళ్ల నుంచి చూస్తున్నాను. అందులో మనకు తెలియని రంగాల్లోని వ్యక్తులు, వారి ప్రతిభ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది.

ద్రౌపది ముర్మూ చాలా ప్లజెంట్‌గా ఉంటారు. గతంలో రాష్ట్రపతిగా ఉన్న ప్రతిభా పాటిల్‌లో కనిపించిన దర్పం, గాంభీర్యం ఆమెలో అసలు కనిపించవు. నా వరకూ నాకు పక్కింట్లో మనిషిని చూస్తున్న భావనే ఉంటుంది. ఆమె గిరిజన నేపథ్యం నుంచి రావడం కారణం కావచ్చు. అవార్డులు ఇచ్చేటప్పుడు ద్రౌపది ముర్మూ హాయిగా చిరునవ్వు చిందిస్తారు. ఫోటోకు చక్కగా ఫోజ్ ఇస్తారు. ఎవరికైనా కొంత కంగారు ఉంటే, ఆ కంగారు పోగొట్టి ‘అదిగో అక్కడ చూడండి’ అంటూ కెమెరా వంక చూపిస్తారు. ఆమెకంటే ముందున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా అలాగే ఉండేవారు. అవార్డుల ప్రదానోత్సవంలో హుందాతనంతోపాటు నమ్రతగానూ మెలిగేవారు.

Ads

సరే! పోయిన వాళ్ల గురించి విమర్శ ఎందుకు అని అనుకోకపోతే నా అభిప్రాయం చెప్తాను. యూపీఏ ప్రభుత్వంలో రాష్ట్రపతి అయిన ప్రణబ్ ముఖర్జీ తీరు వింతగా ఉండేది. కావాలంటే మీరు పాత వీడియోలు చూడండి. అప్పటికి ఆయన వయసు 80 వరకూ ఉంటుంది. వయసు కారణమో, మరేమిటో కానీ అవార్డుల కార్యక్రమంలో బిర్రబిగుసుకుపోయి ఉండేవారు. ఒక నవ్వు లేదు, ఒక పలకరింపు లేదు. అవార్డు ఇచ్చాక ఫొటో కోసం ఒక నిమిషం పాటు దాన్ని పట్టుకుందామనే ఆలోచన కూడా ఆయనకు ఉండేది కాదు. ‘ఇంద తీసుకో” అని ముఖాన విసిరేసినట్టే ఉండేది. ఇది అతిశయోక్తి కాదు. యూట్యూబ్‌లో పాత వీడియోలు చూడండి. మీకే తెలుస్తుంది. నిజంగా కొందరి చేతిలో అవార్డు విసిరేసినట్టు విసిరేశారాయన. నవ్వు లేదు, కనీసం ఒక పాజిటివ్ చూపు లేదు. అత్యంత చిరాకు కలిగించేలా మొహం పెట్టి నిల్చునేవారు.

murmu

ఇంకా దారుణమైన విషయమేమిటంటే, దక్షిణాది వాళ్లతో ఇంత విచిత్రంగా ప్రవర్తించే ఆయన, హిందీ సినిమా వాళ్లు వస్తే మాత్రం నవ్వులు చిందించేవారు. ఫొటోకు ఫోజ్ ఇచ్చేవారు. అది కూడా సీనియర్లు, ఆయనకు తెలిసిన నటులు అయితేనే! నటి ప్రియాంకా చోప్రా లాంటి వారు ఆయన చేతులమీదుగా పద్మ అవార్డు అందుకున్నారు. ఒక్క సెకనులో ఆమె చేతిలో అవార్డు పెట్టి, బిగుసుకొని నిలబడ్డారు. కనీసం ఫొటో తీసే టైం కూడా ఇవ్వలేదు. ఆవిడకు ఏమీ అర్థం కాక ఒక్క నిమిషం అయోమయ పడి, పక్కకు వెళ్లిపోయింది. ఆ వీడియో యూట్యూబ్లో ఉంది. రాష్ట్రపతి అలా బిగుసుకొని ఉండాలని ఎక్కడైనా రాసుందో ఏమో మరి?

May be an image of 4 people, musical instrument, dais and text

ప్రణబ్ ముఖర్జీకి ప్రధానమంత్రి అవ్వాలని ఉండేదని అప్పట్లో పత్రికలు రాశాయి. కానీ కొన్ని కారణాల రీత్యా(చంచల స్వభావం, ప్రశ్నించే గుణం, కోపం) ఆయన్ని పక్కన పెట్టారని అంటారు. యూపీఏ మన్‌మోహన్‌సింగ్‌ని ప్రధానిని చేసింది‌. ఆయనైతే ఏమీ మాట్లాడక, మౌనంగా ఉంటూ చెప్పింది చేస్తారని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. చివరకు సీనియర్ కోటాలో ప్రణబ్‌ని రాష్ట్రపతి పీఠం ఎక్కించారు. ఆయన ఐదేళ్లపాటు కొనసాగారు.

PS: ఆ తర్వాత ఎన్డీఏ హయాంలో ప్రణబ్‌కి భారతరత్న ఇచ్చారు. తను రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అవార్డుల ప్రదానోత్సవంలో అంత బిగుసుకుపోయి కనిపించిన ప్రణబ్ తనకు భారతరత్న వచ్చినప్పుడు మాత్రం చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. రామ్‌నాథ్ కోవింద్ నుంచి అవార్డు తీసుకుంటూ తెగ సంబరపడ్డారు. ఫొటోకు చక్కగా ఫోజ్ ఇచ్చారు.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions