చిరంజీవికి పద్మవిభూషణ్ ప్రకటించడం మీద సోషల్ మీడియాలో భారీగానే చర్చ సాగుతోంది… సహజంగానే తనకు ఫ్యాన్స్ ఎంత మందో, తనను ట్రోలింగ్ చేసేవాళ్లూ అంతే సంఖ్యలో ఉంటారు కాబట్టి పాజిటివ్, నెెగెటివ్ వాదనలు జోరుగా సాగుతున్నయ్.., సరే, ఆనందిద్దాం, అభినందిద్దాం… మన తెలుగువాడికి ఓ మంచి పురస్కారం, అదీ ఈ దేశ రెండో అత్యున్నత పురస్కారం దక్కింది కాబట్టి…
అఫ్‌కోర్స్, వెంకయ్యనాయకుడికీ ప్రకటించారు, గుడ్… కానీ చిరంజీవి పద్మవిభూషణ్ మీద డిబేట్ ఏ స్థాయికి వెళ్లిందంటే… అసలు సినిమా కళ ఎందుకవుతుంది, అది పర్‌ఫెక్ట్ దందా కదా, వ్యాపారం కేటగిరీలో ఇవ్వాల్సింది అనే వ్యంగ్య వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి…
ఒక మోహన్‌లాల్, ఒక మమ్ముట్టి, ఒక అమితాబ్ బచ్చన్ వంటి వెటరన్ సూపర్ స్టార్లు ఎంచుకుంటున్న పాత్రలేమిటి..? ప్రయోగాలేమిటి..? వాళ్లతో పోలిస్తే చిరంజీవి ఎక్కడ..? ఈ అమ్మడూ- కుమ్ముడు స్టార్ కళకు ఈ పురస్కారం అవసరమా అనే విమర్శలు కూడా… సరే, ఎవరితోనూ పోలికలు వద్దు, తను ఏం చేశాడనేది, తన అర్హత ఏమిటనే డిబేట్ అలా వదిలేస్తే… అసలు బీజేపీ ఆశించిన ఫాయిదా ఏమిటి..? ఇదీ అసలు ప్రశ్న…
Ads
పద్మశ్రీల వరకూ కాస్త వోకే… వాటి ఎంపికల ప్రాధాన్యతలు, అర్హతల గురించి వదిలేస్తే… పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న వంటి పురస్కారాల ప్రకటనల వెనుక కేంద్రంలోని అధికార పార్టీ వేరే లెక్కలు చూచాయగా కనిపిస్తుంటాయి… ప్రతి పురస్కారం వెనుక ఓ మార్మిక ఉద్దేశం తప్పకుండా ఉంటుంది… ఉదాహరణకు కర్పూర్ ఠాకూర్‌కు భారతరత్న అనేది పక్కా పొలిటికల్లీ మోటివేటెడ్… మరి చిరంజీవికి..?
ఎస్, తను బీజేపీతో పొత్తులో ఉన్నట్టు చెప్పబడుతున్న జనసేనాని పవన్ కల్యాణ్‌కు సొంత అన్న… జగన్‌తోనూ మంచి సంబంధాలే ఉన్నాయి… చిరంజీవి దాదాపుగా అందరితోనూ బాగానే ఉంటాడు… (తన క్యాంపే గరికపాటి, యండమూరి, ఆర్జీవీ వంటి వాళ్లపై నోళ్లు పారేసుకుంటూ ఉంటుంది, అది వేరే సంగతి…) అదే జనసేనాని టీడీపీతో పొత్తులో ఉంటాడు, కానీ బీజేపీ-టీడీపీ నడుమ పొత్తు ఉండదు… ఓ చిత్రమైన సమీకరణం…
పోనీ, జనసేనాని అన్న కాబట్టి, రేప్పొద్దున తన ఇమేజీ బీజేపీకి ఉపయోగపడుతుందని బీజేపీ భ్రమపడుతోంది అనుకుందాం… ఒకప్పటి కాంగ్రెస్ కేంద్ర మంత్రి, తన పార్టీని కాంగ్రెస్‌కు అమ్మేసుకున్న చిరంజీవి తరువాత కాలంలో రాజకీయాల్లో ఇన్‌యాక్టివ్… కానీ కాంగ్రెస్‌తో నాకు సంబంధం లేదు అని ఎన్నడూ బహిరంగంగా చెప్పినట్టు గుర్తులేదు, పోనీ, తమ్ముడితో ఉన్నాడా అంటే అదీ లేదు… మరి చిరంజీవి నుంచి బీజేపీ ఆశిస్తున్న ఫాయిదా ఏమిటి..? అదొక బ్రహ్మపదార్థం…
సేమ్, ఇలాగే రాజమౌళి డాడీ విజయేంద్రప్రసాద్‌ను పిలిచి మరీ రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు… తనతో ఒరిగిందేముంది..? ఒరిగేదేముంది..? ఏం ఒరుగుతుందని ఆ వరం ఇచ్చింది బీజేపీ హైకమాండ్..? పెద్ద క్వశ్చన్ మార్క్… సేమ్, ఆమధ్య జూనియర్ ఎన్టీయార్‌తో అమిత్ షా ప్రత్యేక భేటీ, చిట్‌చాట్… దేనికి..? అబ్బో, ఈ కలయికలు, ఈ వరాలు, ఈ పురస్కారాల వెనుక ఏదో బలమైన ఎత్తుగడ, ఆంతర్యం ఉంటుందని బీజేపీ సానుభూతిపరులు కూడా అనుకుని సంతృప్తిపడటమే తప్ప… హైకమాండ్ ఆలోచనల్లో పెద్ద వ్యూహాలున్నట్టుగా ఏమీ కనిపించదు…!!
2016లో ఇదే బీజేపీ హైకమాండ్ రామోజీరావుకు పద్మవిభూషణ్ ఇచ్చింది… హైదరాబాద్ వస్తే అమిత్ షా వెళ్లి రామోజీరావు రాజాస్థానంలో గెస్టుగా కూర్చుని ఓ నమస్కారం పెట్టి వస్తుంటాడు… మరి అదే రామోజీరావుతో ఈరోజుకూ బీజేపీకి ఈనాడుపరంగా కనీసం వీసమెత్తు ఫాయిదా ఏమైనా కనిపించిందా..? ఆ తెలుగుదేశం డప్పే కదా మోత మోగేది ఈరోజుకూ..!! అబ్బే, ప్రతి పద్మ పురస్కారానికి ఫాయిదా లెక్కలుండాలా, ఉంటాయా అనే అమాయకపు ప్రశ్న సంధించకండి..!
Share this Article