.
ఈటీవీ పాడుతా తీయగా ప్రోమో… కీరవాణికి ఇష్టమైన పాటల్ని కంటెస్టెంట్లు పాడాలి… ఓ గాయని ఓ పాట అందుకుంది… ఆహా… పగలైతే దొరవేరా… రాతిరి నా రాజువురా… ఎంత శ్రావ్యంగా పాడిందో… జడ్జిలు, వాయిద్యకారులు, అతిథులు అదో మైకంలో పడిపోయారు…
ఎప్పుడో 1969లో వచ్చిన సినిమా అది… పేరు బంగారు పంజరం… సంగీతం సాలూరు రాజేశ్వరరావు… రాసిందేమో దేవులపల్లి…. కఠిన, సంక్లిష్ట, మర్మార్థ, గంభీర పదాల జోలికి… అనగా రచయితల విద్వత్తు ప్రదర్శన గాకుండా… సరళమైన పదాల్లోనే లోతైన, సీన్‌కు తగిన, పాత్రలకు తగిన విధంగా భావాన్ని వ్యక్తీకరించడంలో ఆయన తరువాతే ఎవరైనా…
Ads
ఇప్పటి లిరిక్ రైటర్స్ ఆయన పాటలను అప్పుడప్పుడూ వినాలి… ప్రాసలు, ప్రయాసలు, తిక్క పదాలు, వక్ర పాదాలు గాకుండా… మంచి తెలుగులో, ప్రేక్షకుడిని కనెక్టయ్యే భావ గర్భితాలు రాసే ప్రయత్నం చేయాలి…
ఐనా అప్పటి నిర్మాతలు, దర్శకుల టేస్టు వేరు… ఇప్పుడన్నీ దబిడి దిబిడి, నీయమ్మని నీయక్కని, అమ్మడూ కుమ్ముడు పాటలే కదా… అదేమంటే ట్రెండ్ అంటారు… అక్కడికి అది ట్రెండని ఎవడన్నాడో…
- సరే, పగలైతే దొరవేరా పాట సంగతికొద్దాం… పాడింది జానకి… ఇంకేం, తిరుగేముంది..? కాసేపు కళ్లు మూసుకుని ఆ స్వర మాధుర్యాన్ని ఆస్వాదించడమే… ఈ పాటలో శోభన్ బాబు, వాణిశ్రీ… వాళ్ల కెరీర్ తొలినాళ్లలో కావచ్చు బహుశా… పాట ఆమెది, ఆస్వాదన ఆయనది… హీరో నోటి వెంట ఒక్క పదమూ రాదు… మురిపెంగా ఆమెను చూస్తూ ఉంటాడు, అంతే…
పగలంతా నీ దొరతనం, నీ వ్యవహారాలతో నువ్వేమిటో గానీ దొరా… రాత్రికి మాత్రం నా రాజువురా అంటోంది కథానాయిక… అంటే, పగలు నీ రాచకార్యాలేమున్నా, రాత్రికి నా కౌగిలిలో బందీవయ్యే నా రాజువు మాత్రమే అని… అలా ఉండాలి, అలాగే ఉంటావు అని సున్నితంగా, మురిపెంగా చెబుతోంది…
అంతేకాదు, నువ్వు తోడుంటే నాకు ప్రతి రాత్రీ పున్నమేరా… పగలంతా నీ సొగసు దాగేను, రాత్రయితే ఆరు బయలంతా వెలుగులీనుతూ నిండిపోతుందిరా… నేను కొలిచే దొరవు నన్నే వలిచే నా రాజువు… ఇలాగే ఉండిపోదాం… ఇంతే…
మహా అయితే ఇరవై పదాలు కూడా దాటవు… అవీ చాలా సరళమైన లలితమైన పదాలు… వాటినే పొదిగి ఓ అందమైన గీతాన్ని రచించాడు దేవులపల్లి… ఆహా… కీరవాణి మంచి పాటను గుర్తుచేశావయ్యా… అందుకే పాడుతా తీయగా స్టిల్, చూడబుల్ మ్యూజిక్ రియాలిటీ షో…! ఆ పాత మధురాల్ని పాడిస్తోంది… గుర్తుచేస్తోంది… అలరిస్తోంది…
థమన్, ఎప్పుడైనా ఇలాంటి పాటను పాడించావా ఆహా ఇండియన్ ఐడల్ తెలుగు షోలో...!టేస్టుండాలోయీ..!!
ఇదీ ఆ పాట లిరిక్స్….
పగలైతే దొరవేరా
రాతిరి నా రాజువురా
రాతిరి నా రాజువురా…
పక్కనా నువ్వుంటే ప్రతిరాత్రి పున్నమి రా
పక్కనా నువ్వుంటే ప్రతిరాత్రి పున్నమి రా
పగలైతే దొరవేరా
రాతిరి నా రాజువురా
రాతిరి నా రాజువురా…
చరణం 1:
పగలైతే నాలో నీ సొగసంతా దాగేరా
పగలైతే నాలో నీ సొగసంతా దాగేరా
రేయైతే వెన్నెలగా బయలంత నిండేరా..
రాతిరి నా రాజువురా
రాతిరి నా రాజువురా…
చరణం 2:
నే కొలిచే దొరవైనా… నను వలచే నా రాజువే
నే కొలిచే దొరవైనా… నను వలచే నా రాజువే
కలకాలం ఈలాగే నిలిచే నీదాననే
పక్కనా నీవుంటే.. ప్రతిరాత్రి పున్నమి రా
ప్రతిరాత్రి..ఈ…ఈ.. పున్నమి రా…
పగలైతే దొరవేరా…
రాతిరి నా రాజువురా…
రాతిరి నా…. రాజువురా…
Share this Article