Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అచ్చ తెలంగాణ పదాలతో అల్లిక… ఓ పల్లె ప్రేమికుడి నయా ప్రేమమాలిక…

July 11, 2024 by M S R

పైలం పిలగా అని ఓ కొత్త సినిమా… ఏదైనా ఓటీటీలో వస్తుందేమో… మంచి బయర్ దొరికితే థియేటర్లలోకి కూడా రావచ్చునేమో… ఒక పాట రిలీజ్ చేశారు… ఓ మిత్రుడు షేర్ చేశాడు… ప్రజెంట్ ట్రెండ్ తెలంగాణ స్లాంగ్ కదా, ఇదీ అదే అన్నాడు… అలా వినబడ్డాను…

కాజువల్‌గా వింటుంటే… తరువాత కనెక్టయింది… కారణం… అచ్చ తెలంగాణ పదాలు ప్లస్ ఉర్దూ పదాలు కొన్ని సరైన చోట్ల పడ్డయ్… అఫ్‌కోర్స్, ఓ తెలంగాణ ప్రాంత ప్రేమికుడి ఎక్స్‌ప్రెషన్ అది… నిజానికి తెలంగాణ ఫోక్ అనేది ట్రెండే అయినా సరే, కాసర్ల శ్యామ్ వంటి ఒకరిద్దరు మినహా మిగతా వాళ్ల రాతల్లో కృతిమత్వం కనిపిస్తోంది… కానీ ఈ పాటలో కాస్త ప్యూరిటీ కనిపించింది, వినిపించింది…

సరే, తప్పదు కాబట్టి, సినిమాటిక్ చిత్రీకరణను పక్కన పెడితే… ఒక కొత్త ఎక్స్ప్రెషన్ ఉంది ఈ పాటలో, అచ్చమైన తెలంగాణ పదాలు, సినిమా పాటల్లో ఇంతకు ముందు వాడని పదాలు, అందరికి అర్ధమయ్యే పదాలు, కొత్త్త వ్యక్తీకరణ….. తెలంగాణ ఫోక్ ని చాల చక్కగా సినిమా పాటకు బ్లెండ్ చేసారు…

Ads

సిక్కడ సిక్కడ నవ్వుతుంటే

ఓయ్ సిక్కడ సిక్కడ నవ్వుతుంటే

లబడ దిబడ నా గుండే

 

ఈ సిక్కడ అనే పదం చిక్కగా, చక్కగా అనే అర్థానికి వ్యవహారిక పదం. అందంగా నవ్వితే సిక్కడ, సిక్కడ నవ్వింది అంటారు తెలంగాణలోని కొన్నిచోట్ల.., హేళన చేస్తూ గట్టిగా నవ్వితే బక్కడ బక్కడ నవ్వింది అంటారు…

 

ఖుల్లా ఖుల్లా సెబుతున్నా ….

బరాబరీ సరి జోడే …..

మజాక్ గాదు సూడవే …..

కనికరిస్తే గులామునౌతా

మనువాడితే నీకు మొగుణ్ణి అవుతా ….

 

తెలంగాణ భాషలో ఉర్దూ పదం లేకుండా మాట్లాడటం కష్టం… పై వాక్యాల్లో ఉర్దూ పదాలు వాడటం వల్ల పాట పూర్తిగా తెలంగాణ పరిమళాన్ని అద్దుకుంది.

 

సోడు సోడు సోడు సొక్కమే నీ సోకు

సొప్పా కట్టే తీరు సన్నమే నీ నడుము

పక్కా లెక్కా తప్పని కొలతలే నీ శకలు

వెన్నే జున్ను కన్నా నున్నగే నీ సెంపలు

 

ఈ సోడు అనే పదం తెలంగాణలో ధాన్యాన్ని కొలిచే ఒక కొలత… సోడు, సోలెడు, అడ్డెడు, మానెడు …. ఇవి ధాన్యాన్ని కొలిచే కొలతలు. ఆ కొలతలతో అమ్మాయి అందాన్ని కొలవడం, సొప్ప కట్టే …. కాలువల వెంట, పొలాల్లో పెరిగే సన్నని మెత్తని గడ్డి… పశువులు ఇష్టంగా తింటాయి, పాలు బాగా ఇస్తాయి. ఆ సన్నని, మెత్తటి గడ్డి తో నడుమును పోల్చడం. ఇతర పదాలకన్నా అమ్మాయి నడుమును సొప్ప కట్టెలెక్క సన్నంగ ఉందే పిల్లా అనడం ఓ కొత్త వ్యక్తీకరణ, బాగుంది…

pailam

 

వాన మబ్బు మోసుకొచ్చి

సిన్న సినుకైనా రాల్చకుంటే

దూపెట్టా తీరేదే పిట్టా

అరే కండ్లతోని నన్ను పిలిసి

నోటితోని తిట్టి పోస్తే

బతకలేనే బంగారు పెట్టా

అందులోనా ఇందులోనా తగ్గనీయనే

గుండెల్లోనా పెట్టుకోని సచ్చిపోతనే

 

ఇక ఈ రెండో చరణం లోని ఎక్స్ప్రెషన్ గొప్పగా కుదిరింది. వాన మబ్బు వచ్చి చినుకు రాలకుండా పోతే ఎంత అసంతృప్తి గా ఉంటుంది? కళ్లతో రారా అంటూ పిలిచి దగ్గరికి వెళ్తే నోటితో పో పో … అని చెప్తే ఎంత బాధగా ఉంటుంది…. ఒక ప్రేమికుడి వేదనకి ఒక క్యూట్ ఎక్స్ప్రెషన్… (కనికరం, బంగారుపెట్టె పదాలు కాస్త అటూఇటూ ఉన్నా సరే…)

 

ఈ పాటకు ఉన్న ఇంకో విశేషం ఏంటంటే… ఇప్పుడు అన్ని పాటలకి ట్యూన్‌కే సాహిత్యం రాస్తున్నారు, కానీ ఈ పాట రాసిన తరువాత అందమైన ట్యూన్ కట్టాడు మ్యూజిక్ కంపోజర్ యశ్వంత్ నాగ్… అప్పట్లో కే వి మహదేవన్ సాహిత్యానికి ట్యూన్ చేసేవాడు… మిరియాల రామ్ గొంతు కూడా సరిగ్గా సూటైంది… బాగుంది, ఇక మిగతా సినిమా పైలం పిలగా జెర…!! దర్శకుడు గుర్రం ఆనంద్ పాట మీద మరోసారి చెప్పుకుందాం…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రిట్రీట్..? మావోయిస్టుల ఆయుధసన్యాసం నిజమేనా..? వాట్ నెక్స్ట్..?!
  • అప్పటికీ ఇప్పటికీ భక్తసులభుడు చిలుకూరు వీసాల బాలాజీ..!!
  • అక్కడ హారన్ కొట్టరు… ట్రాఫిక్ గీత దాటరు… సెల్ఫ్ డిసిప్లిన్…
  • మంచు కాదు కంచు లక్ష్మి..! డ్రెస్‌ సెన్స్‌ ప్రశ్నకు దిమ్మతిరిగే జవాబు…!
  • కృష్ణాజలాలపై కేసీయార్ తప్పుటడుగులకు రేవంత్ విరుగుడు ప్రయాస..!
  • కేసీయార్ బాపతు గోదావరి జలవైఫల్యాలకు రేవంత్‌రెడ్డి దిద్దుబాట..!
  • విరిగిన ఎముకలకు ‘క్విక్ ఫిక్స్’… నిమిషాల్లో అతికించే మ్యాజికల్ జిగురు..!!
  • విలనుడు రేపు చేస్తే కేరక్టర్ అవుతుంది గానీ వీరోయిన్ అయిపోదు కదా…
  • వాణిశ్రీ అనుకుని భానుమతి రూమ్ బెల్ కొట్టాను… ఆమె ఏమన్నారంటే!
  • భారీ బ్యానర్ ఐనంతమాత్రాన … సినిమా ఆడాలనేముంది..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions