.
. ( Anamchinni Venkateswarao 9440000009 ) .. …. … అంచనాలు పెంచి… అడ్డంగా దొరికి… ‘మేఘా’ కోసమే కక్కుర్తి.! ‘పాలమూరు’ ప్రాజెక్టులో బయటపడనున్న ‘బడా’ బండారం! బీహెచ్ఐఎల్, మేఘా కంపెనీకి నోటీసులు… ఒరిజినల్ ఫైల్స్ న్యాయస్థానం ముందుంచాలని ఆదేశాలు
ఎలక్ట్రో- మెకానికల్ పరికరాల్లో అవినీతిపై నాగం పిటిషన్… ప్రభుత్వానికి రూ.2,400 కోట్ల నష్టం… మూడు రోజుల్లో అంచనాలు పెంచేసిన బీఆర్ఎస్ సర్కార్…
Ads
ఎట్టకేలకు ఓ బడా నేత బతుకు ‘సుప్రీం’ ముందు బట్టబయలు కానుంది. కాళేశ్వరం నిర్మాణంలో ప్రపంచంలోనే అతి పెద్ద కుంభకోణానికి పాల్పడిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ చేసిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వంతో పాటు, మేఘా ఇంజినీరింగ్ సంస్థ, జీహెచ్ఈఎల్ కు సంబంధించి ఒరిజినల్ దస్త్రాలన్నీ తమ ముందుంచాలని నోటీసుల్లో పేర్కొంది.
బీహెచ్ఈఎల్ తాను తయారుచేసి, సప్లై చేసిన పరికరాలు, పొందిన బిల్లులకు సంబంధించిన వివరాలతో అఫిడవిట్ కూడా అందించాలని స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మొదటగా ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా రూ. 5,960 కోట్లతో అంచనాలు తయారు చేసింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మరో సలహాదారుడిని తీసుకువచ్చింది. ప్రభుత్వం కావాలనే మూడు రోజుల్లోనే రూ.8,386 కోట్లతో మరో అంచనా రూపొందేలా చేసింది. అ అంచనాలను నిబంధనలకు విరుద్ధంగా సవరించారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.2,426 కోట్ల భారీ నష్టం వాటిల్లింది. పరికరాల అంచనాలకు సంబంధించి ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కోటేషన్లు కోరాల్సిన అవసరం ఉంది. ఎంఈఐఎల్, బిహెచ్ఈఎల్ మధ్య ఒప్పందంలోనూ లోపాలు ఉన్నాయి
ఆ రెండు సంస్థలు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం..:
65% ఎలక్ట్రికల్ మెకానికల్ పనులు నిర్వహించే బీహెచ్ ఈఎల్ కు 20% మొత్తం. మిగతా 35% సివిల్ పనులు నిర్వహించే మేఘా సంస్థకు 80% సొమ్మును ఇవ్వనున్నట్లు దస్త్రాలు రెడీ. బీహెచ్ఈఎల్, ఎమ్ఐఈఎల్ సంస్థ పరికరాలను మాత్రమే సరఫరా చేస్తుంది. ఆ పరికరాల ఏర్పాటుతో పాటు మెయింటెనెన్స్ పూర్తిగా మేఘా సంస్థే చూసుకుంటుంది.
ప్యాకేజీ 5కు సంబంధించి 9 మోటార్లు, పంపుల ధర రూ.1,611 కోట్లుగా ఉంది. అయితే బీహెచ్ఈఎల్ సంస్థ ఇంతగా ఖర్చు చేస్తున్నా వారికి కాంట్రాక్టు కింద రూ.803 కోట్లు మాత్రమే ఎందుకు నిర్దేశించారనే అంశంపై ప్రశ్నలు వస్తున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మోటార్లు, పంపుల ధరలను 4 నుంచి 5 రెట్లు పెంచినట్లు కాగ్ చెప్పిందనే అంటున్నారు కదా… సప్లై చేసే మోటార్లు, పంపుల ఖర్చు 65 శాతం ఉన్నా.. బీహెచ్ఈల్ కు 20 శాతం మొత్తం ఇచ్చేలా ఒప్పందం చేసుకోవడం విచిత్రంగా లేదా?
8 మోటార్లు, పంపుల్లో బీహెచ్ఈఎల్ అందించే పరికరాల వాటా ఎంత? ఆ వివరాలు చెప్పడానికి మేఘా, బీహెచ్ఈఎల్ ప్రతినిధులు సమయం తీసుకున్నారు. దీంతో అన్ని ఒరిజినల్ దస్త్రాలన్నీ సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వంతో పాటు మేఘా, బీహెచ్ఈఎల్ ను ఆదేశించింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి వయిదా వేసింది.
2017లో నాగం పిటిషన్…
నాగం జనార్దన్ రెడ్డి 2017లో తాను బీజేపీలో ఉన్న సమయంలో హైకోర్టులో ఈ విషయానికి సంబంధించి పిల్ దాఖలు చేశారు. బీహెచ్ఈఎల్, ఎమ్ఐఈఎల్ సంస్థల మధ్య సంయుక్త ఒప్పందానికి కాంట్రాక్ట్ కేటాయింపు చేయడాన్ని ఆయన సవాల్ చేశారు.
ఈ కాంట్రాక్ట్ కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ.2000 కోట్లకు పైగా నష్టం కలిగిందని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రాజెక్టులో ఉపయోగించే పరికరాల విలువను మోసపూరితంగా రూ.5,960 కోట్ల నుంచి రూ.8,386 కోట్లకు పెంచారన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. అయితే.. ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు…
ఇది తెలంగాణ వాచ్ అనే డిజిటల్ పేపర్‌లో కనిపించిన వార్త… ఏ మీడియాలోనూ కనిపించినట్టు గుర్తు లేదు… అసలు కాలేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా రేస్, పవర్ ఇష్యూస్ తదితర కేసులు, విచారణలు సాగుతుండగా… రేవంత్ రెడ్డి సర్కారు ఈ పాలమూరు కేసులో ఏం చేయనుందనేదీ ఆసక్తికరం… ఇదే మేఘా అధినేతను కేసీయార్ గతంలో బహిరంగంగా సన్మానించడం, అధికారం పోయాక మాత్రం మేఘా మీద కేసు పెట్టి, అరెస్టు చేయాలని కేటీయార్ డిమాండ్ చేయడం గుర్తొచ్చాయి…)
Share this Article