మిగతా విషయాల్లో ఎంత చెత్తిస్టు అయినా సరే… రాంగోపాలవర్మను ఒక్క విషయంలో మెచ్చుకోవచ్చు… కొన్ని పాత్రలకు అచ్చు సరిపోయే వ్యక్తుల్ని భలే పట్టుకుంటాడు… చంద్రబాబు పాత్రకు కావచ్చు, వీరప్పన్ పాత్రకు కావచ్చు, ఎన్టీయార్ పాత్రకు కావచ్చు… అయితే ఆయా ఒరిజినల్ కేరక్టర్లను తలపించేలా నటులు ఉండాలా అనే ప్రశ్నకు సమాధానం లేదు… ఒరిజినల్ కేరక్టర్లలా ఉంటే మరింత రక్తికట్టే అవకాశం ఉందనేది నిజం…
గాంధీ బయోపిక్‌లో బెన్‌కింగ్‌స్లే నటించాడు… తను తెల్లవాడు… గాంధీ నల్లవాడు… రూపురేఖలు, భాష, లుక్కులో అస్సలు పోలికే ఉండదు… కానీ అనితరసాధ్యంగా చేశాడు… ఆస్కార్ సహా ఆ పాత్రకు ఎన్ని అవార్డులు వచ్చాయో లెక్కేలేదు… బయోపిక్ ఎవరి మీదనైతే తీస్తున్నామో ఆ వ్యక్తి నడక, మాటతీరు, మ్యానరిజం గట్రా సరిగ్గా పట్టుకుంటే చాలు, ఆ పాత్ర పండుతుంది… ఇదంతా ఎందుకు చెప్పడం అంటే..?
మనవాళ్లు మేకప్ ద్వారా అచ్చు అవే కేరక్టర్లను తెరమీద దింపాలని ప్రయత్నిస్తుంటారు, లేదా ఆ పోలికలున్న నటులను ఎంపిక చేస్తుంటారు… రీసెంటుగా ఎమర్జెన్సీ సినిమాలో కంగనా రనౌత్ ఇందిరాగాంధీ వేషం వేస్తోంది… భలే కుదిరింది… అంతకుముందు తలైవిగా జయలలిత పాత్రకు మాత్రం ఆమె ఎందుకో సూటైనట్టు అనిపించలేదు… ఇప్పుడు తాజాగా పంకజ్ త్రిపాఠీ వాజపేయి వేషానికి భలే కుదిరాడు…
Ads
గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ వెబ్ సీరీస్‌లో నటించాడు తెలుసు కదా… తనే… తెలుగులో దూసుకెళ్తా అనే సినిమాలో కూడా చేశాడు… సినిమాలకన్నా టీవీ షోలతో ఎక్కువ ప్రసిద్ధుడు… మెరిట్ ఉన్న నటుడు… అటల్ బిహారీ వాజపేయి పాత్రకు సంబంధించిన తన లుక్కును సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు… దేశవ్యాప్తంగా నెటిజనం బాగుందని ఆమోదముద్ర వేశారు… జూన్‌లో ఈ బయోపిక్ సంబంధ వార్తలు కొన్ని కనిపించాయి… మళ్లీ ఇప్పుడే సినిమాకు సంబంధించిన ఓ ఫోటో జనంలోకి రావడం…
నిజానికి ఈ సినిమాను ట్రూ స్పిరిట్‌తో ఇప్పుడు తీయగలరా అనేది ప్రశ్నే… బీజేపీ అధికారంలో ఉంది, వాజపేయి మీద పాత్రచిత్రణ ఏమాత్రం శృతితప్పినా రచ్చరచ్చే… కార్గిల్ యుద్దం, పాకిస్థాన్ వెన్నుపోటు, అణుపరీక్షలు, సంకీర్ణ ప్రభుత్వ సారథ్యం, కవి, భావుకుడు, స్నేహశీలి తదితర అంశాలను ఎలా చూపించినా ఫరక్ పడదు… తనను ఓ రాజనీతిజ్ఞుడిగా ఎక్స్‌పోజ్ చేస్తే వోకే…
కానీ ఆయన ప్రేమ యవ్వారం, ప్రేమికురాలిని తన ఇంట్లోకే తెచ్చుకోవడం గట్రా తన వ్యక్తిగత జీవితాన్ని టచ్ చేస్తారా, చేస్తే ఎలా ఫోకస్ చేస్తారనేది సంక్లిష్టం… అది అవాయిడ్ చేస్తే ఇక ఆ సినిమాకు అర్థమే లేదు… నిర్మాత సందీప్ సింగ్ గతంలో నరేంద్ర మోడీ జీవితం మీద కూడా ఓ సినిమా తీశాడు… ఈ సినిమాను ఎన్‌పి ఉల్లేఖ్ రాసిన The Untold Vajpayee_ politician and paradox పుస్తకం ఆధారంగా తీస్తున్నట్టు ఆరు నెలల క్రితమే ప్రకటించారు… డిసెంబరు 2023లో విడుదల చేయాలని సంకల్పం… (ఒకటి మాత్రం రిలీఫ్… దీన్ని కూడా అక్షయ్ కుమార్ అందిపుచ్చుకుని తనే ఈ వేషం వేయడం లేదు…)
Share this Article