Bharadwaja Rangavajhala……….. ఆ ఇద్దరూ….. టాలీవుడ్ లో ప్రయోగాత్మక చిత్రాల నిర్మాణానికి ఊపిరి ఊదిన నిర్మాతలు వారిద్దరూ. తమ బ్యానర్ కు సుచిత్ర అని పేరు పెట్టుకున్నారు. సుచిత్ర అంటే మంచి చిత్రాలు తీసే సంస్ధ అని అర్ధం. అర్ధం చెప్పుకోవడమే కాదు. నిజంగానే తెలుగు చలన చిత్ర చరిత్రలో నిలిచిపోయే చిత్రాలు తీశారు సుచిత్రా నిర్మాతలు. ఆ ఇద్దరిలో ఒకరు బి.నరసింగరావు. మరొకరు జి.రవీంద్రనాథ్ .
రవీంద్రనాథ్, నరసింగరావు ఇద్దరి కుటుంబ నేపధ్యాలు వేరు. రవీంద్రనాథ్ ది సినిమా కుటుంబమే. అయితే ఆయన తీసిన సినిమాలకూ కుటుంబ నేపధ్యానికి సంబంధం లేదు. అలాగే నరసింగరావు కుటుంబనేపధ్యానికీ ఆయన తీసిన సినిమాలకూ సంబంధం లేదు. వీరిద్దరినీ ఒక తాటి మీదకు తెచ్చింది… ఆ తరహా చిత్రాలు తీయించింది ఆనాటికి ఆంధ్రప్రదేశ్ యువతలో కొత్త ఆశలు రేపిన శ్రీకాకుళ రైతాంగ పోరాటం. ఆ నేపధ్యం ఏమిటో చూద్దాం.
తెలుగులో ప్రయోగాత్మక చిత్ర నిర్మాణం ప్రారంభించిన వైతాళికుల్లో బి. నరసింగరావు ఒకరు. రవీంద్రనాథ్ లా నరసింగరావుది సినిమా కుటుంబం కాదు. అయితే నరసింగరావు చిత్రకారుడు, కవి. జనం కోసం నరసింగరావు రాసిన కవిత్వం జననం పేరుతో సంకలనం గా తీసుకువచ్చారు. సినిమా అనే శక్తి వంతమైన మాధ్యమాన్ని కూడా ప్రజారాజకీయాల ప్రచారానికి వినియోగించుకోవాలనుకున్నారాయన.
Ads
మెదక్ జిల్లా ప్రజ్ఞా పూర్ లో భూస్వామ్య కుటుంబంలో పుట్టారు నరసింగరావు. ఇంటి నిండా నౌకర్లు…పాలేర్లు. దొరకొడుకుగా చిన్నతనం గడిచింది.
పుట్టింది భూస్వామ్య కుటుంబంలోనే అయినా పేదల బతుకుల గురించి ఆలోచించగలిగే విశాల హృదయమే నరసింగరావును విప్లవ రాజకీయాల వైపు నడిపింది.
నక్సల్బరీ రాజకీయాల ప్రచారానికి జననాట్యమండలి నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించిన నరసింగరావు మిత్రుడు రవీంద్రనాథ్ తో కలసి తెలంగాణ సాయుధ రైతాంగపోరాట చిత్రాన్ని తెరకెక్కించాడు. మృణాళ్ సేన్ దగ్గర రవీంద్రనాథ్ కు ఓ కుర్ర బెంగాలీ యాడ్ ఫిలిం మేకర్ తగిలాడు. అతన్ని పట్టుకొచ్చి జబ్ ఖేత్ జాగే అనే కిషన్ చందర్ నవలను సినిమా తీసే బాధ్యత అప్పగించారు. అప్పటికే ఆ నవల జైత్రయాత్ర పేరుతో తెలుగులో అనువాదమైంది. దాన్నే గౌతమ్ ఘోష్ అనే ఆ బెంగాలీ కుర్ర డైరక్టర్ తో తీయించారు నరసింగరావు, రవీంద్రనాథ్ లు. నరసింగరావు అందులో ఓ పాత్ర కూడా పోసించాడు.
సుచిత్ర నిర్మాతల్లో ఒకరైన గుళ్లపల్లి రవీంద్రనాథ్ కుటుంబం సినిమా నేపధ్యం ఉన్న కుటుంబం. ఆయన తండ్రి జి.డి.ప్రసాదరావు సారధీ స్టూడియోస్ నిర్వాహకుల్లో ఒకరు. నవయుగ సంస్ధలో కీలక వ్యక్తి. ఆయనా సినిమాలు తీశారు. తీయించారు. అయితే ఆ సినిమాలకూ రవీంద్రనాథ్ తీసిన సినిమాలకూ చాలా వ్యత్యాసం ఉంది. తండ్రి అన్నదమ్ముల సవాల్ , ఇద్దరూ అసాధ్యులే లాంటి సినిమాలు తీస్తున్న సమయంలోనే కొడుకు ఒక ఊరి కథ లాంటి ఆర్ట్ సినిమా తీశాడు. అదీ వేరియేషన్.
డెభ్బై దశకం ప్రారంభంలో రవీంద్రనాథ్ అనంతపురం ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుకోడానికి వెళ్లాడు. మిడ్ సిక్స్ టీస్ నాటికే దేశంలో తీవ్రమైన ఆర్ధిక అసమానతలు సామాజిక ఉద్యమాలకు దారి తీశాయి. కలుషితమైన రాజకీయాల స్థానంలో ప్రజారాజకీయాలను అజండా మీదకు తెచ్చాయి. అన్ని చోట్లా పతనమైన విలువలను ప్రశ్నించడంతో పాటు పోరాట సాంప్రదాయాన్ని తీసుకువచ్చింది నక్సల్బరీ. ఆ ప్రభావం అనంతపురం ఇంజనీరింగ్ కాలేజీ మీద పడింది. అలా రవీంద్రనాథ్ విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితుడయ్యాడు. అదే బాణీలో ప్రజా సినిమాలు తీశాడు. నక్సల్బరీ రాజకీయాలు అన్ని వ్యవస్థల మీదా ప్రభావం చూపించినట్టే సినిమాల మీదా తన ముద్ర వేశాయి. బలంగా వేళ్లూనుకుని పోయిన మాస్ సినిమా పేరుతో వస్తున్న కమర్షియల్ సినిమాకు కౌంటర్ గా పారలల్ సినిమా ముందుకు వచ్చింది.
ఆ ఉద్యమానికి మద్దతుగా దేశవ్యాప్తంగా సినిమా క్లబ్బులు ఏర్పడ్డాయి. ఆ వేవ్ లోనే రవీంద్రనాథ్ కొందరు మిత్రులతో కల్సి ఒక ఊరి కథ సినిమా తీశాడు. ఈ చిత్రానికి జాతీయ ఉత్తమ దర్శకుడు మృణాళ్ సేన్ దర్శకత్వం వహించారు. ప్రజా ఉద్యమాలు వేళ్లూనుకోని ప్రాంతాల్లో రైతుకూలీల్లో నైరాశ్యం నేపధ్యంలో సాగుతుంది ఒక ఊరి కథ.
పనిచేయడం వల్ల దొరల ఆస్తులు పెంచడమే మనం చేసేది. అందుకని పని చేయకపోవడమే మంచిది. తిండికి ఇబ్బంది అయితే దారి దోపిడీలు చేసుకుని పొట్టపోసుకోవడమే బెటరు అని ఫిలాసఫీ చెప్పే ఓ కూలీ జీవిత చిత్రణ ఈ సినిమా. నిజానికి గుళ్లపల్లి దుర్గా ప్రసాదరావు గారు కూడా వామపక్ష భావజాలం ఉన్నవారే. నవయుగ వాసుగారితో వ్యాపార భాగస్వామి మాత్రమే కాదు…సాక్షాత్తు పినతల్లి కొడుకు. కాట్రగడ్డ ఫ్యామ్లీతో పాటే వామపక్ష రాజకీయాలతో ఉండేవారు ప్రసాదరావు. అయితే సినిమాను కేవలం వ్యాపారంగానే భావించిన జి.డి ప్రసాదరావు ఎర్ర సినిమాలు తీసే ప్రయత్నం మాత్రం చేయలేదు. పూర్తి కమర్షియల్ సినిమాలు తీశారు. అన్నదమ్ముల సవాల్, ఇద్దరూ అసాధ్యులే లాంటి సినిమాలతో పాటు రాధాకళ్యాణం, పెళ్లి చూపులు లాంటి భాగ్యరాజా రీమేక్ లూ తీశారు.
మా భూమి విడుదలైన సంవత్సరమే ఆంధ్రప్రదేశ్ లో సిపిఐ ఎమ్ఎల్ పీపుల్స్ వార్ ఏర్పడింది. మాభూమి సినిమా చూసిన కొండపల్లి సీతారామయ్య దర్శకుడు గౌతమ్ ఘోష్ ను పిలిపించుకుని నువ్వు గ్రేట్… అని అభినందించడం తన జీవితంలో మరచిపోలేని అనుభవం అని ఇప్పటికీ చెప్పుకుంటాడు గౌతమ్. మాభూమిని లక్ష్మీ ఫిలింస్ రిలీజ్ చేసింది. సినిమా పెద్దగా ఆడుతుందని అనుకోలేదు కూడా. అలాగే శంకరాభరణం సినిమా కూడా లక్ష్మీ ఫిలింస్ పంపిణీకి తీసుకుంది. ఆ సినిమా కూడా పోతుందనే నమ్మకంతోనే తీసుకున్నారు. శంకరాభరణం రెగ్యులర్ షోస్ వేసిన చాలా ధియేటర్స్ లో మాభూమి నూన్ షోస్ లో రిలీజ్ చేశారు. గ్యాప్ లో వేయడానికి పనికొస్తాయని తీసుకున్న ఈ రెండు సినిమాలూ రికార్టు స్థాయి వసూళ్లు సాధించాయి.
మాభూమి కోసం రవీంద్రనాథ్ తన దగ్గరున్న బంగారాన్ని అమ్మేస్తే… నరసింగరావు ఆల్వాల్ లోని తన ఇంటిని తాకట్టు పెట్టి సిండికేట్ బ్యాంకు నుంచి అప్పుతెచ్చారు. మాభూమి తర్వాత నరసింగరావు, రవీంద్రనాథ్ కల్సి నిర్మించిన రంగులకల చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు తనే స్వీకరించారు నరసింగరావు. మా భూమి తర్వాత చాలా గ్యాప్ తీసుకుని తీసిన చిత్రం రంగులకల. సమాజంలో కళాకారుల బాధ్యత ఏమిటి అనే అంశం మీద నిర్మించిన రంగులకల చిత్రం అంతర్జాతీయ వేదికల మీద అనేక అవార్టులు సాధించింది.
భద్రం కొడుకో నా కొడుకో కొమురన్న అంటూ గద్దర్ ఆలపించిన గీతం బడుగు జీవుల బతుకు చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. తెలంగాణ శకుంతలగా పాపులర్ అయిన శకుంతలను వెండితెరకు పరిచయం చేసింది నరసింగరావే. అప్పటి వరకు స్టేజ్ నాటకాలతోనూ దూరదర్శన్ స్కిట్స్ లోనూ కనిపించిన శకుంతల రంగులకలలో తన అద్భుత నటనతో ఆడియన్స్ దృష్టిలో పడింది.
రంగులకల తర్వాత రవీంద్రనాథ్ చిత్రనిర్మాణ రంగం నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం అమెరికాలోని డెట్రాయిట్ లో ఉంటున్నారు. అయితే తెలుగులో ప్రత్యామ్నాయ సినిమా కోసం ఆయన పడ్డ తపన సామాన్యమైనది కాదు. తెలుగులో పారలల్ సినిమా అనగానే రవీంద్రనాథ్ గుర్తు రాకుండామానరు. ఆ తర్వాత నరసింగరావు దాసి, మట్టిమనుషులు లాంటి సినిమాలతో తన ప్రస్తానాన్ని కొనసాగించారు. ప్రస్తుతం తెలంగాణ ఉద్యమ నేపద్యంలో సినిమా తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు నరసింగరావు. ఉద్యమం కోసం ప్రాణాలను బలిదానం చేస్తున్న విద్యార్ధుల త్యాగాల నేపధ్యంలో ఉద్యమ గతి గమనం చెప్పడం తన లక్ష్యం అని చెప్తున్నారు నరసింగరావు.
తాము పుట్టింది ఎక్కడైనా బడుగు జీవుల కోసం ఆచరణాత్మకంగా కదిలి తమ పరిధిలో తామేం చేయగలమో అదే చేస్తూ… నమ్మిన ఆశయాల మేరకు చిత్రాలు నిర్మించిన కమిటెడ్ నిర్మాతలుగా రవీంద్రనాథ్, నరసింగరావులు నిల్చిపోతారు. ఇటీవల ఓ సభలో రవీంద్రనాథ్ కలిశారు. ఆయన నుదుట తిలకం చూసి ఖంగారు పడ్డాను. అయితే రవి నా ఖంగారు చూసి ఓ మాట అన్నాడు. చిన్నప్పుడు మా అమ్మ నా చేయి పట్టుకొని గుడికి తీసుకుపోయేది. ఆ తర్వాత నేను ఆ చేయి విడిపించుకుని ఎక్కడెక్కడో తిరిగాను. అయితే విచిత్రంగా ఈ మధ్య జియర్ స్వామి మళ్ళీ నన్ను గుడిబాట పట్టించాడు… అని తాను జీయ్యరీకరణ చెందిన విషయం చెప్పి నన్ను జ్ఞానం పరిచారు….
Share this Article