మొత్తం మీడియాలోనూ వచ్చింది వార్త… ఏమిటంటే..? రాజ్యసభలో బీజేపీ బలం మరీ 86కు పడిపోయింది… ఎన్డీయే బలం లెక్కించినా 101కు పడిపోయింది… ఇదీ వార్త…
నలుగురు నామినేట్ సభ్యుల పదవీకాలం పూర్తయినందున ఈ మార్పు తలెత్తింది… ఇక ఎవరికి తోచిన బాష్యాలు వాళ్లు రాసేసుకున్నారు… ఇక రాజ్యసభలో బిల్లులు పాస్ చేయించుకోవడం బీజేపీకి కష్టమే అన్నట్టుగా కొందరు తేల్చేశారు… పిచ్చి లెక్కలు, పిచ్చి విశ్లేషణలు… ఎందుకంటే..?
నిజానికి మొత్తం సభ్యుల సంఖ్య 245… 20 ఖాళీలు… అంటే 225 సీట్లను గాను మెజారిటీ మార్క్ 113… మరి ఇంతకుముందు కూడా బీజేపీకి మెజారిటీ లేదు కదా… 90 మంది ఉండేవాళ్లు… కాకపోతే 9 మంది సభ్యులున్న బీజేడీ కీలక బిల్లుల సందర్భాల్లో బీజేపీకి సహకరించేది గతంలో, ఇప్పుడు ప్రతిపక్షంగా వ్యవహరిస్తోంది… నలుగురు అన్నాడీఎంకే సభ్యులు కూడా ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకమే అవుతారు… అంటే గతంలో సహకరించిన 13 మంది అపోజిషన్ బెంచులోకి చేరినట్టు…
Ads
ఐనా సరే, ఎన్డీయే బలం 101 ఉంది ఇప్పుడు… బీజేపీ నామినేట్ చేసిన 12 మంది సభ్యులు కూడా ఉన్నారు… అంటే మెజారిటీ మార్క్ ఉన్నట్టే కదా… 11 మంది సభ్యులున్న వైసీపీ కూడా బీజేపీకి బిల్లుల విషయంలో సపోర్ట్ ఇస్తూ వస్తున్నది, ఇకముందు కూడా ఇస్తుంది… జగన్‌కు తప్పదు… తను ఇండి కూటమికి సపోర్ట్ చేయడు…
కాంగ్రెస్ పార్టీకి ఉన్నది 26 మంది మాత్రమే… కాకపోతే ఇండి కూటమిలో టీఎంసీకి 13, ఆప్‌కు 10 మంది, డీఎంకేకు 10 మంది ఉన్నారు… మొత్తం కూటమి బలం 87 మాత్రమే… అందుకే బిల్లులు వీగిపోయేలా చేయగల సంఖ్యాబలం ఆ కూటమికి ఇప్పటికీ లేదు… పైగా ఖాళీ అయిన నలుగురి ప్లేసును భర్తీ చేయడం ఎంతసేపు..? ఎలాగూ నామినేట్ చేయడమే కదా…!
ఇక బీఆర్ఎస్‌కు నలుగురు సభ్యులు… ఇక్కడే చర్చ… మొన్నామధ్య హరీష్‌రావు, కేటీయార్ ఢిల్లీ వెళ్లి, వారం రోజులు అడ్డా వేసి, బీజేపీతో సంప్రదింపులు చేశారని వార్తలొచ్చాయి… నిజానిజాలేమిటో గానీ… మా నలుగురు సభ్యుల్ని మీరు తీసుకొండి (అచ్చం గతంలో టీడీపీ నుంచి వెళ్లిపోయినట్టుగానే…) (లోకసభలో ఎవరూ లేరు ఈ పార్టీకి ఇప్పుడు… కారు, సర్కారు, కేసీయారు, పదహారు అనే పాత వైభవ దినాలు గతించి ఇప్పుడు సున్నా దగ్గర స్థిరపడింది కదా…) ప్రతిగా మా కవితను విడిచిపెట్టాలి, మాకు రక్షణగా నిలవాలి అని బేరసారాలకు దిగినట్టు ఆ వార్తల సారాంశం…
నిజానికి బీజేపీకి అంత అవసరం లేదు… ఒకసారి బీఆర్ఎస్‌కు జీవగంజి పోస్తే అది బీజేపీకే మళ్లీ ఏకుమేకులా మారుతుంది… బీఆర్ఎస్‌ను నమ్మితే కేసీయార్ కేసులు, ఫిరాయింపు డ్రామాల పేరిట ఎంత బదనాం చేశాడో మరిచిపోతే ఎలా..? పైగా ఇప్పుడు బీఆర్ఎస్ కేడర్ ఖాళీ అయ్యేకొద్దీ ఆ స్పేసులోకి బీజేపీ చొచ్చుకుపోవడానికి ప్రయత్నించాలి, బలం పెంచుకోవడానికి ప్రయత్నించాలి… ఈ స్థితిలో బీఆర్ఎస్‌ను నిలబెడితే తన అవకాశాల్ని తనే సమాధి చేసుకోవడం అవుతుంది…
బహుశా బీజేపీ హైకమాండ్ ఇదే ఆలోచించిందో ఏమో… లేదా కొన్నాళ్లు టైమ్ కిల్లింగో తెలియదు గానీ… సానుకూల ఫలితం ఏమీ కనిపించలేదు ఇప్పటికి బీఆర్ఎస్‌కు..! ఈ ప్రయత్నాలు జరిగాయనే వార్తలకు బీఆర్ఎస్ నుంచి పెద్దగా ఖండనలు కూడా కనిపించలేదు, జరిగాయని మీడియా వార్తలే తప్ప, ఇప్పుడు నిర్ధారణగా చెప్పలేం కూడా..!
ఏమో… బండి సంజయ్ హఠాత్తుగా హరీష్ మంచి లీడర్ అని పొగడ్తలకు దిగాడు… మైండ్ గేమ్ ఏదైనా కొత్తగా స్టార్ట్ చేస్తున్నదా బీజేపీ..? లేక నువ్వు మరో షిండేవు, కమాన్, వచ్చెయ్ అని పిలుపునిస్తోందా..? కాంగ్రెస్ మరో పది మందిని లాగేసేలోపు, నువ్వే ఏదైనా నిర్ణయం తీసుకో, ఎలాగూ ఆ పడవ మునిగిపోతోంది అని పరోక్షంగా సూచనలు ఇస్తోందా..? ఏమో, లోగుట్టు మోడీషాలకు ఎరుక..!!
Share this Article