బాబా రాందేవ్ పతంజలి వ్యవహారం ఇప్పుడు పతాకశీర్షికలకెక్కుతున్న నేపథ్యంలో… ఆయన వ్యాపారం వెనకున్నవారెవరు… వారు వ్యాపారంలో భాగస్వాములవ్వడమే కాకుండా.. రాందేవ్ కు ఏమేం గిఫ్ట్ గా ఇచ్చారనే అంశాలన్నీ జనబాహుళ్యంలో చర్చకొస్తున్నాయి… సుప్రీం ఆగ్రహం, బహిరంగ క్షమాపణ ప్రకటనలు, ఆ కేసు వివరాల్లోకి ఇక్కడ పోవడం లేదు… ఎక్కడో సుదూరంగా ఉన్న ఓ చిన్న దీవి పతంజలి ఫ్యాక్టరీగా మారిన తీరు, దాని వెనుక ఉన్న దాతల గురించి మాత్రమే చెప్పుకుందాం…
అందులో ప్రధానంగా అందరి దృష్టీ ఆకర్షిస్తున్నది లిటిల్ కుంబ్రే దీవి. స్కాట్లాండ్ లోని నార్త్ ఐర్షైర్లో ఉందీ లిటిల్ కుంబ్రే ద్వీపం. ఫిర్త్ ఆప్ క్లైడ్ లో ఓ ద్వీపమైన లిటిల్ కుంబ్రేను.. స్కాటిష్ దంపతులైన సర్వాన్ పొద్దార్, సునీత పొద్దార్ జూలై 2009లో కొనుగోలు చేశారు. అయితే, ఇదేదో వారి ఆనందమయ జీవితం కోసమో ఓ ఫామ్ హౌజ్ తరహా జీవితాన్ని గడపడానికో.. విహార కేంద్రంగా చేసుకోవడం కోసమో కాకుండా… తమ గురువైన రాందేవ్ బాబా కోసమే కొనుగోలు చేయడమే ఇక్కడ విశేషం.
లిటిల్ కుంబ్రే 2003లోనే ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేయగా.. మెమోరియల్ పార్క్, నేచర్ రిజర్వ్ ప్రాంతంగా అభివృద్ధి పర్చారు.
Ads
ఒబెసిటీ సమస్య ఉన్న సునీతా పొద్దార్… రాందేవ్ బాబా యోగాసనాలకు ఆకర్షితురాలైంది. అలా ఆయనతో పరిచయం ఏర్పడి.. ప్రధాన అనుచరురాలిగా, భక్తురాలిగా మారిపోయింది. ఆ క్రమంలోనే రాందేవ్ బాబా పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ కు కావల్సిన రుణాన్నందించడంతో పాటు… ఆ తర్వాత ఈ లిటిల్ కుంబ్రే దీవిని తన గురువు రాందేవ్ బాబాకు గిఫ్ట్ ఇవ్వాలని సంకల్పించింది సునీతా పొద్దార్.
పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ కు రుణమివ్వడం వరకు ఓకే కానీ.. ఏకంగా లిటిల్ కుంబ్లే దీవినే కొనివ్వాలనే భార్య మాటతో వాస్తవానికి బీహారీ మూలాలున్న టర్కిష్ భర్త సర్వన్ పొద్దార్ విభేదించాడు. ఈ విషయంలో దంపతుల మధ్య ఒకింత మాటల యుద్ధం కూడా నడిచిందన్నట్టు సమాచారం. అయితే, భార్య మాట వినకపోతే.. ఇంట్లో పరిస్థితెలా ఉంటుందో ముందే గ్రహించాడో, ఏమో సర్వన్ పొద్దార్ కూడా అనివార్య పరిస్థితుల్లో ఓకే చెప్పాడు. అలా మొత్తంగా టూ మిలియన్ పౌండ్స్ కు లిటిల్ కుంబ్రే దీవిని కొనుగోలు చేసి.. తన సంకల్పం ప్రకారం తన గురువైన బాబా రాందేవ్ కు బహుమతిగా అందించింది సునీతా పొద్దార్.
ఇక అప్పట్నుంచీ స్కాంట్లాండ్ లోని ఈ ద్వీపం రాందేవ్ బాబా పేరిట మారిపోవడంతో పాటు.. ఈ దీవిని పీస్ ఐలాండ్ గా మార్చాలని యోచించినట్టుగా.. కానీ, ఆ దేశం అందుకు తిరస్కరించినట్టుగా కూడా కొన్ని వార్తలైతే వినిపించాయి. ప్రస్తుతం కుంబ్రే ఐల్యాండ్ రాందేవ్ బాబా ఆధ్వర్యంలో యోగా, ధ్యాన కేంద్రంగా రూపుదిద్దుకోవడంతో పాటు.. ఇక్కడ ప్రస్తుతం వివాదాస్పద ప్రకటనలతో వార్తలకెక్కుతున్న పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ కు సంబంధించిన మందుల తయారీ కూడా నడుస్తోంది.
అసలు కుంబ్రే ద్వీపం చరిత్రేంటి..?
పొరుగునే ఉండే ది గ్రేట్ కుంబ్రే అనే మరో ద్వీపానికి దక్షిణాన ఉండేదే ఈ లిటిల్ కుంబ్రే దీవి. 20 శతాబ్దంలో ఇదో టూరిస్ట్ ప్లేస్ గా మారిపోయిందే తప్ప ఇక్కడ శాశ్వత నివాసముండేవారి సంఖ్య తక్కువ. 19వ శతాబ్దం చివరినాటికే ఇక్కడి జనాభా కేవలం 23 మందికి తగ్గిపోయినట్టు ఓ అంచనా. సౌత్ స్కాట్లాండ్ లో కుంబ్రిక్ అనే భాష మాట్లాడేవారికి సూచికగా.. ఈ కుంబ్రే ద్వీపానికి పేరు వచ్చినట్టు చెబుతుంటారు. అలాగే, ఈ కుంబ్రే దీవికి స్కాటిష్ సంబంధిత భాషలో రకరకాల పేర్లు.. ఆ పేర్ల వెనుక వివిధ రకాల చరిత్రలు కూడా వినిపిస్తుంటాయి.
ది గ్రేట్ కుంబ్రే మొత్తం.. మడ అడవులు, గ్రీనరీతో కనిపిస్తే.. దానికి సౌత్ సైడ్ కనిపించే ఈ లిటిల్ కుంబ్రే మాత్రం అందుకు భిన్నంగా పెద్ద పెద్ద కొండలు, రాళ్ల సమూహంతో కనిపిస్తుంది.
క్రీ.శ 13వ శతాబ్దంలోనే ఇక్కడ క్యాజిల్ నిర్మాణాలు జరిగినట్టు తెలుస్తోంది. వాల్టర్ స్టీవర్ట్ అనే అప్పటి రాజు లిటిల్ కుంబ్రేలో ఓ ఫామ్ హౌజ్ తరహాలో ఓ కోటను నిర్మించాడని.. ఆ తర్వాత అతడి కుమారుడు రాబర్ట్ 2 జింకలు, చేపల వేట కోసం ఇక్కడ నిర్మించిన ఆల్డ్ క్యాజిల్ ను తన స్థావరంగా మార్చుకున్నాడనీ ఇక్కడి చరిత్ర తెలియపరుస్తోంది. ఆ తర్వాత 16వ శతాబ్దాంలోనూ ఇక్కడ మరో క్యాజిల్ నిర్మాణం జరిగినట్టు సమాచారం.
ఇక 20వ శతాబ్దానికి వచ్చేసరికి ఇక్కడ నూతన పద్ధతుల్లో నిర్మాణాలు చోటుచేసుకున్నాయి. ఎవెలిన్ స్టువర్ట్ పార్కర్ అనే యాజమాని.. ఇక్కడొక మ్యాన్షన్ హౌజ్ నిర్మించాడు. నాటి ప్రఖ్యాత గార్డెన్ డిజైనరైన గెర్ట్రూడ్ జెకిల్ తో.. ఈ లిటిల్ కుంబ్రేలో గార్డెన్స్ డిజైన్ చేశారు. 1926-29 మధ్య ఇక్కడొక స్క్వేర్ టవర్ నిర్మాణం కూడా చేపట్టారు. ఇక్కడ నిర్మించిన 28 అడుగుల ఎత్తైన లైట్ హాజ్ ఇక్కడ ప్రత్యేకంగా కనిపించేదట. నాటి కాలంలో 39 ఆయిల్ ల్యాంప్స్ తో.. రిఫ్లెక్టర్ల్స్ ద్వారా ఇక్కడ లైటింగ్ ఏర్పాటుండేది. ఇప్పటికీ ఆపాత నిర్మాణాల ఆనవాళ్లూ కనిపిస్తుంటాయి. 1974లోనే సౌరశక్తితో పనిచేసే లైట్ హౌజ్ నిర్మాణం జరిగింది.
గ్లాస్గో విమానాశ్రయం నుంచి 28 మైళ్ల దూరంలో ఈ లిటిల్ కుంబ్రే ద్వీపముంటుంది. మొత్తం 684 ఎకరాల్లో ఉండే ఈ ద్వీపంలో 7వ శతాబ్దంలోనే ఓ సన్యాసి నిర్మించిన మతపరమైన పురాతన శిథిలమైన ప్రార్థనా మందిర అవశేషాలు కనిపిస్తుంటాయి. ఇక్కడ కనిపించే సన్యాసి గుహనే కింగ్స్ కేవ్ అని.. అలాగే, మాంక్స్ కేవ్ అని కూడా పిలుస్తుంటారు. తుపాన్లు వచ్చినా సురక్షితంగా ఉండేలా.. శత్రుదుర్భేద్యంగా ఇక్కడి నిర్మాణాలుంటాయి.
లిటిల్ కుంబ్రేలో 75 రకాల పక్షుల ఆనవాళ్లను గుర్తించారు. వాటిలో చాలా అరుదైన, అంతరించిపోతున్న జాతులున్నాయి. హార్బర్ పోర్పోయిస్, డాల్ఫిన్స్, సీల్స్ వంటివిక్కడ క్రమం తప్పకుండా కనిపిస్తుంటాయి. మొత్తంగా ఒక అందమైన శతాబ్దాల నాటి గుహలు, కొండలు, అరుదైన జాతి పక్షులు, ఇతర నీటి జంతువుల వంటి వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ తో.. దేశం కాని దేశంలో ఇప్పుడీ లిటిల్ కుంబ్రే.. మన బాబా రాందేవ్ సొంతమైపోయి.. యోగా, ధ్యాన కేంద్రంగా.. పతంజలి ఆయుర్వేదిక్ మెడిసిన తయారీ కార్ఖానాగా మారడమంటే.. గ్రేటేగా మరి! (Article By… రమణ కొంటికర్ల 99126 99960)
Share this Article