నో డౌట్… బ్యాన్ పఠాన్ అట్టర్ ఫెయిల్యూర్ స్లోగన్… ఓ పది మంది కలిసి ప్రతి విషయంలోనూ బ్యాన్ బ్యాన్ అని సోషల్ మీడియాలో అరిస్తే ఫలితం రాదు… పైగా ప్రతి చిన్నవిషయానికీ పెన్సిలిన్ వాడొద్దు… ఏదేని సీరియస్ అంశం మీద బ్యాన్ అస్త్రం ప్రయోగిస్తేనే ఫలితం ఉంటుంది… దీపిక పడుకోన్ పాత్రే ఓ చిల్లర, వెగటు పాత్ర… దానికి తగ్గట్టు వీలైనంత వెకిలిగా చేసింది ఈ మహానటి… వంద దేశాలకు పాకుతుందట ఇప్పుడు ఈ కంపు..! ఐఎస్ఐ లేడీ ఏజెంట్లు ఎవరైనా ఈ సినిమా చూస్తే, ఏ అఘాయిత్యమైనా చేసుకుంటే దానికి బాధ్యత దీపికదే…
సగటు వ్యాంప్‌ను మించిన లేకితనం ఆమెది… సమస్య ఆమె ప్రదర్శించిన అసభ్య మూమెంట్స్, అశ్లీల ఊపులు… అంతేగానీ ఆమె ఏ రంగు బట్టలు వేస్తేనేం..? ఆమె దాదాపుగా సినిమా మొత్తం బట్టలంటే ఓ ఎలర్జీ ఉన్నదానిలా, దేహ ప్రదర్శన చేస్తూ పోయింది… అంతేతప్ప మతాలకు రంగులుంటాయా..? రంగులకు మంతాలుంటాయా..?
బాస్ ఈజ్ బ్యాక్… ఈమధ్య ఇదో నినాదం… అంటే ఇన్నేళ్లూ గాడిదలు కాశాడని పరోక్షంగా చెప్పడమేనా..? తెలుగులో కూడా ఇది మంత్రంలా పఠించారు కదా అదేదో తాజా సినిమా గురించి..! చాలాా ఏళ్లుగా షారూక్ సక్సెస్ లేదు, జీరో తరువాత పూర్తిగా జీరో అయ్యాడు… ఇప్పుడు దాన్ని అధిగమించడానికి ఫుల్లు యాక్షన్… మెషిన్ గన్లు, తుపాకులు, హెలికాప్టర్ ఫైట్లు… సినిమా అంతా యాక్షనే… నడుమ దీపికతో చిల్లర ఎపిసోడ్స్ సరేసరి… (తాము చెప్పిన కట్స్ ఏమయ్యాయో ఫిలిమ్ సెన్సార్ బోర్డు ఓసారి చెక్ చేసుకుంటే బెటర్..)
Ads
తెలుగులో అగ్రహీరోలాగే… షారూక్‌కు కూడా తనొక్కడే సరిపోడు అనిపించింది… సల్మాన్ ఖాన్‌ను తోడు తెచ్చుకున్నాడు… కాసేపు సినిమాకు అదనపు ఊపు కావాలంటే పాపులర్ హీరో ‘చేయూత అందించాలి… ఇందులోనూ అంతే… షారూక్ ఫైట్లతో చావదొబ్బుతున్నాడురా బాబూ అనేలోపు సల్మాన్ కూడా వచ్చి తనూ అందుకుంటాడు…
ఐనా ఈమధ్య అంతా సౌత్ సినిమాల ట్రెండ్ కదా… డిష్యూం, డిష్యూం… సూపర్‌మెన్ కేరక్టర్లు కదా హీరోలు… మితిమీరిన అతి ఎలివేషన్లు… సేమ్, పఠాన్ సినిమాలో కూడా అడుగుకో ఎలివేషన్… వంద కేజీఎఫ్‌లు, వేయి వీరయ్యలు, మరో వేయి వీరసింహారెడ్డిలు కనిపిస్తారు… బాలయ్యను, చిరంజీవిని ఇద్దరినీ మిక్సీ చేసి, తనలోకి ఆవాహన చేసుకున్నాడు షారూక్… కాస్త కామెడీ టచ్, ఫుల్ యాక్షన్ డోస్… కాకపోతే బాలయ్య, చిరంజీవి సినిమాల్లో దీపిక వంటి హీరోయిన్ ‘భంగిమలు, బికినీలు, థర్డ్ రేట్ ఊపులు’ ఉండవు…
కథ, తొక్కా పెద్ద విశ్లేషణ అక్కర్లేదు… పక్కా మధుబాబు షాడో నవల… నిజానికి ‘రా’ పేరును ఎప్పుడూ పెద్దగా సినిమాల్లో గానీ, సాహిత్యంలో గానీ తీసుకురాకుండా జాగ్రత్తపడేవాళ్లు… ఇప్పుడు ఎవడుపడితేవాడు రా అండర్ కవర్ ఏజెంటుగా కనిపిస్తాడు… అదేమంటే దేశభక్తి… సాహసం, ఒంటిచేత్తో మెషిన్ గన్, గ్రెనేడ్ లాంచర్, మినీ పోర్టబుల్ రాకెట్ లాంచర్… వీలయితే మన హీరోలు డర్టీ బాంబులు కూడా ప్రయోగించేంత రిస్కీలు…
ఒక రా ఏజెంట్, కొలువు పోతది గానీ ప్రతి నెత్తుటి చుక్కలోనూ దేశభక్తి అట్లనే ఉంటది… మరో కొలువు పోయిన రా ఏజెంట్ విలన్… దేశభక్తి అంటే పాకిస్థాన్‌ను తిట్టాలె కదా… పిండి లేక, రొట్టెలు లేక జనం మొత్తుకుంటుంటే… రూపాయి అప్పు పుట్టక, యుద్ధాలు మానేద్దాం, ప్లీజ్, సారీ అంటూ ఆ దేశ ప్రధానులు ఏడ్చి కన్నీళ్లు పెట్టుకుంటుంటే… ఇందులో పాకిస్థానీ జనరల్ ఓ ప్రమాదకరమైన రక్తబీజ్ అనే జీవాయుధ ప్రయోగం ఇండియాపై తలపెడతాడు… దాన్ని భగ్నం చేయడమే కథ…
JOCR అని తనే సొంతంగా ఓ వ్యవస్తను ఏర్పాటు చేసుకుంటాడు షారూక్… నిజంగానే ఓ జోకర్ తరహా క్రియేటివ్ ఆలోచన… ఇంకేముంది..? సినిమా మొత్తం తుపాకులే ఎంటర్‌టెయిన్ చేస్తాయి… కేజీఎఫ్, విక్రమ్, వీరయ్య, ట్రిపుల్ ఆర్… ఇప్పుడు ట్రెండ్ హీరోలందరూ వందరెట్ల సిల్వెస్టర్ స్టాలోన్లు… పఠాన్ కూడా భిన్నమేమీ కాదు… మాకూ అదే నచ్చుతుంది అంటారా..? మీకు ఫుల్ బిర్యానీ భోజనమే ఈ సినిమా… నిజానికి ఈ సినిమాలో దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ పాత సినిమా ‘వార్’ వాసనలున్నాయి, పెద్దగా ట్విస్టులు, ఎమోషన్స్ లేవు… అయితేనేం… అడ్వాన్స్ బుకింగులే 50 కోట్లు దాటాయట… 10 రోజుల్లో 500 కోట్లు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం… ఈ దెబ్బకు కేజీఎఫ్‌లు, ట్రిపుల్ ఆర్‌లు, విక్రమ్‌లు కొట్టుకుపోవాల్సిందే…!!
ప్రస్తుతం ఈ దర్శకుడు మైత్రి మూవీస్ వాళ్లు ప్రభాస్‌తో తీయబోయే సినిమాకు ఎంత అడుగుతున్నాడో తెలుసా తన రెమ్యునరేషన్…? 150 కోట్లు… ప్లస్ ప్రభాస్‌కు 150 కోట్లు… పైసలా, పెంకాసులా ఇవి..? అభూత సాహసాలు, అశ్లీల దృశ్యాలతో జనం పర్సుల్ని కత్తిరించి, వాళ్లను మాయమోహంలో ముంచేసి వాళ్ల కార్డుల్ని గీకేయడమే కదా… అవును, అదే విజయరహస్యం… అవును, పఠాన్ సినిమా సూపర్ హిట్… (సినిమా చూస్తే హిందీలోనే చూడండి, తెలుగులో వద్దు… కృతకంగా ఉంది…)
“మనం థర్టీ ఇయిర్స్ ఇండస్ట్రీ… ఫైట్స్ చేస్తూనే ఉన్నాం… దేశాన్ని కాపాడుతునే ఉన్నాం… కొత్త కుర్రాళ్ళు వస్తే బాగుంటుంది… ఎవరొస్తే బాగుంటుంది… అని సినిమా చివర్లో అసలు హీరో ప్లస్ కొసరు హీరో బాగా మధిస్తారు… చివరికి… కుర్రాళ్ల చేతిలో ఇంత పెద్ద భాధ్యతని ఎలా పెడతాం… మనమే కంటిన్యూ చేద్దాం” అంటారు… అవును, మన తెలుగులోనూ కొంచెం అటూ, ఇటూగా అంతే కదా… సంక్రాంతి ప్రూవ్ చేసింది అదే కదా…!!
#sharukhkhan #phatan #DeepikaPadukone
Share this Article