శవాలకు కూడా వైద్యం చేసి… ఆస్తులన్నీ అమ్మించి… అప్పులపాలు చేసి… మనిషి సర్వభ్రష్టుడిని చేసే కార్పొరేట్ హాస్పిటళ్ల దందా అందరికీ తెలుసు… కానీ ప్రజావైద్యం సరిగ్గా లేక, వేరే దిక్కులేక… జనం తమ బతుకుల్ని తాకట్టు పెట్టాల్సిన దురవస్థ…. ఐనా మన ప్రభువులు వెనకేసుకుని వస్తారు… ప్రజలపై వాళ్లకున్న అమితమైన ప్రేమ అది… కీలకస్థానాల్లో ఉన్నవాళ్లు ప్రెస్మీట్లు పెట్టి, బిస్కెట్లు తింటూ… అంతా బాగానే ఉంది… అని పలుకుతుంటే, ఆ ప్రవచనాలు టీవీల్లో విని, పత్రికల్లో చదివిన వాళ్ల గుండెలు ఎంత మండిపోయాయో……. ఇది సరిపోనట్టు సరిహద్దుల్లో అంబులెన్సులు ఆపేసి, మీ చావు మీరు చావండి అనే ధోరణి… పేరుకు ఇది విశ్వనగరం… తీసుకురండి, పెట్టుబడులు పెట్టండి, ఇక్కడ నిర్భయంగా బతకండి… ఇదుగో ఇలాంటి చావుబతుకుల పరిస్థితి వస్తే…. ఆంధ్రోడు, తెలంగాణోడు పంచాయితీ… హాస్పిటల్ వాడు బెడ్ ఉన్నట్టు చెబితే, ఆమేరకు రాసిస్తే తెలంగాణలోకి రానిస్తారట… అసలు కార్పొరేట్ హాస్పిటళ్లు ఎలా ఉన్నాయో ఎప్పుడైనా, ఒక్క క్షణమైనా ఈ ప్రభుత్వం సమీక్ష చేసుకుందా..? నా దగ్గర బెడ్ ఉంది, పర్లేదు, వచ్చెయండి అని అవి చెబుతాయట… ఈ ప్రభువులు దయతో అప్పుడు రానిస్తారట… ఈ ఒక్క ఉదంతం చదవండి… ఈనాడు ఫస్ట్ పేజీ వార్త… ప్రభుత్వంలో ఉన్నవాళ్లకు, డప్పులు కొట్టేవాళ్లకు తప్ప అందరికీ కడుపు తరుక్కుపోయే వార్త… సరైన ప్రయారిటీతో, సరిగ్గా స్పందించింది ఈనాడు…
మల్లాపూర్లో ఉండేది పావని… ఏలూరుకు చెందిన తిరుమలరావుతో పెళ్లయ్యింది… ప్రసవం కోసం హైదరాబాద్ వచ్చింది… గురువారం ఓ హాస్పిటల్ తీసుకెళ్లారు… ఉమ్మనీరు తక్కువగా ఉంది అంటూ ఓ సెలైన్ ఎక్కించి పంపించేశారు… శుక్రవారం తెల్లవారుజామున అసలు నరకం ఏమిటో ఆమెకు మొదలైంది… ఆయాసం… అదే హాస్పిటల్ తీసుకెళ్లారు… ఎప్పుడూ అక్కడే చూపించేవాళ్లు… ఆ హాస్పిటల్ వాళ్లు కరోనా అనే సందేహంతో చేర్చుకోలేదు… అంబులెన్సులో మరో హాస్పిటల్… ఫలితం లేదు… లక్డీకాపూల్ లోని మరో హాస్పిటల్, మకు వెంటిలేటర్ సౌకర్యం లేదుపో అన్నారు వాళ్లు… ఎల్బీ నగర్లోని మరో హాస్పిటల్… చేర్చుకున్నారు, కాసేపటికే గాంధీకి గానీ, కింగ్ కోఠి హాస్పిటల్కు గానీ తీసుకుపొండి అని పంపించేశారు… కనీసం బిడ్డయినా బతుకుతుందని పిడుగువంటి వార్త చెప్పారు… తీరా కింగ్ కోఠికి తీసుకెళ్తుండగానే కన్నుమూసింది ఆమె… ఓ తెల్లవారుజాము నుంచీ ఆమె తల్లి నీలవేణి చేయని ప్రయత్నం లేదు… హైదరాబాద్ అంతా చుట్టబెట్టింది… ఐదు దవాఖానాలు తిరిగింది… అంబులెన్స్ వాడే 30 వేలు తీసుకున్నాడు… చివరకు శ్మశానానికి వెళ్తే… తల్లీబిడ్డను వేరు చేస్తే తప్ప అంత్యక్రియలు చేయమని చెప్పారు… ఆ పని ఎవరు చేయాలి..? హాస్పిటళ్లన్నీ నిరాకరిస్తేనే కదా, తల్లీ, కడుపులో బిడ్డ కలిసి మరణించారు… శవాన్ని ఇంటికి తీసుకుపోయారు… ఈనాడు వార్త అక్కడ ముగిసింది… (శనివారం స్థానిక హాస్పిటల్ లో తల్లీబిడ్డలను వేరు చేశాక అంత్య క్రియలు జరిగాయి…)
Ads
రోజూ ఇలాంటివి ఎన్నెన్ని వార్తలు..? ఎన్ని కన్నీళ్లు..?! ఇక్కడేదో సక్కగా ఉన్నట్టు… అంబులెన్సుల్లో ఎందుకు ఎగబడి వస్తున్నార్రా…? వద్దు, వాపస్ వెళ్లిపొండి… మీ చావు మీ దగ్గరే చావండి….. కఠినంగా ఉన్నా సరే, ఈ భావన కలిగితే, ఈ కోపం రగిలితే… తప్పేమైనా ఉందా..?! ‘‘ఏమో, ఆమెకు అప్పటికే సీరియస్ కావచ్చు, అంబులెన్సుల్లో మరణం ఏమైనా అసాధారణమా..? తల్లీబిడ్డా ప్రసవకష్టంతో చనిపోవడం ఎన్నడూ చూడలేదా..? ఈనాడు ఆంధ్రాపత్రిక, ప్రభుత్వంపై ద్వేషంతో ఇలా రాసింది..’’ వంటి వ్యాఖ్యలు వద్దు… పెయిన్ అనుభవించేవాళ్లకు తెలుస్తుంది… అందరికీ కుటుంబాలున్నయ్… కరోనా సందేహంతో హాస్పిటళ్లలో చేర్చుకోలేని దురవస్థ ఏమిటి..? అప్పటికప్పుడు కరోనా ఉందో లేదో ఆ తల్లి ఎలా నిర్ధారించుకుని, ఆధారాలు చూపించాలి… ఆలోపు ఆమె బతుకుతుందా..? దీనికి ఏదీ పరిష్కారం..?!
Share this Article