నిజానికి ఈరోజు అన్ని పత్రికల్లోనూ కనిపించాల్సిన వార్త ఇది… మన మెయిన్ స్ట్రీమ్ మీడియాకు రాజకీయ రంగులు పూసుకుని డప్పులు కొట్టుకోవడానికి, ప్రత్యర్థి పార్టీలను తిట్టడానికే స్పేస్ సరిపోవడం లేదు… ఇక అసలైన వార్తలకు, ప్రజాకోణంలో అవసరమైన వార్తలకు చోటెక్కడిది..? వార్త ఏమిటంటే..?
మధ్యప్రదేశ్ రాష్ట్రం… రేవా జిల్లా… రాయ్‌పూర్ గ్రామం… 80 ఏళ్ల ములియా కీవత్‌కు తీవ్ర అనారోగ్యం… పరిస్థితి విషమిస్తోంది… ఏం చేయాలి..? సమయానికి ఎవరూ ఆదుకునేవాళ్లు లేరు..? అయిదు కిలోమీటర్ల దూరంలో కుర్చలియన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంటుంది… అక్కడికి తీసుకుపోతే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో… కానీ వాహన సౌకర్యాల్లేవు… అంబులెన్సులు కూడా రావు… ఐనా ఫోన్లు చేశారు… ప్రభుత్వ అంబులెన్సులు కదా, ఎవరూ పట్టించుకోలేదు…
ఆమెకు నలుగురు కూతుళ్లు… అమ్మ పరిస్థితి తెలిసి వచ్చారు, శుశ్రూష చేశారు, ఫలితం కనిపించడం లేదు… అప్పుడేం చేయాలి..? ఓ చివరి ప్రయత్నంగా అమ్మ పడుకున్న మంచాన్నే తిరగేశారు… దానిపై అమ్మను పడుకోబెట్టారు… నలుగురు దాన్ని ఎత్తుకుని పరుగుపరుగున ఆ కమ్యూనిటీ సెంటర్‌కు మోసుకుపోయారు… మరి ఆ ఊళ్లో ఇంకెవడూ లేడా..? అసలు మనుషులే లేరా..? అది వేరే చర్చ…
Ads
తీరా ఆ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లేసరికి అమ్మ కన్నుమూసింది… మీ అమ్మ చచ్చిపోయింది అని ఆ హెల్త్ సెంటర్ వాళ్లు గడప దగ్గరే తేల్చేసి, తీసుకుపొండి అన్నారు… అయ్యా, మృతదేహాన్ని తీసుకుపోతాం, అంబులెన్స్ ఇవ్వండి అని వేడుకున్నారు ఆ నలుగురు కూతుళ్లు… ప్రభుత్వ సర్వీస్ కదా, సహజంగానే పట్టించుకోలేదు, ఈసడించుకున్నారు…
మళ్లీ ఏం చేయాలి..? అదే మంచం మీద శవాన్ని పడుకోబెట్టి, మళ్లీ మోసుకుంటూ వాపస్ వచ్చారు… మండుటెండ… కాళ్లకు చెప్పుల్లేకుండా ఏడుస్తూ వాళ్లు శవాన్ని మోసుకుపోతుంటే పట్టించుకున్ననాథుడు లేడు… అవును, సమాజంలో ఇంకా సెన్సిటివిటీ ఎక్కడ ఏడ్చిందని..? అదెప్పుడో చచ్చిపోయింది కదా… ఎవడో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు…
తరువాత ఏం జరిగిందా..? ఆ వీడియో కాస్త వైరల్ అయ్యింది… కొన్ని న్యూస్ వెబ్‌సైట్లు అప్పటికప్పుడు వార్త రాశాయి… వెంటనే రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు అయ్యో అయ్యో ఎంత అన్యాయం, ఎంత దారుణం అంటూ మొత్తుకోవడం స్టార్టయింది… వాడిని వీడు, వీడిని వాడు తిట్టుకోవడం… అంతకుమించి జరిగేది ఏమీ ఉండదు కదా… అసలు ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఏమిటంటే..? ఆ ఊళ్లో గానీ, ఆ హెల్త్ సెంటర్ ఉన్న ఊళ్లో గానీ అసలు మనుషులు అనేవాళ్లు లేరా అని..?! ప్రభుత్వ సర్వీసులో మనుషులు ఉండరు, చేరినా మనుషులుగా మిగలరు కాబట్టి వాళ్లను తిట్టీ వేస్ట్…! తోలుమందం రాజకీయ నాయకుల్ని తిట్టడం ప్రపంచంలోకెల్లా వృథా పని…!!
Share this Article