.
ఎస్, ఒక అవకాశం ఇవ్వాల్సిందే! #బిగి సడలుతున్న పిడికిలి..!!
అరాచక, అనాగరిక వ్యవస్థీకృత మలినాలవల్ల పుట్టిన పుండు మానాలి! అది సంపూర్ణంగా మాని శుష్కించి పోవాలి! ఆ దిశలో శాంతి, సంయమనాలతో కూడిన ప్రయాస జరగాలి! అంతేకానీ, సలుపుతుందని ఆ పుండును కత్తితో కోసి సర్జరీ చేస్తాం అంటే? ఎన్నటికీ పూడ్చలేని బొక్క పడుతుంది! అది శాశ్వత మచ్చను మిగుల్చుతుంది!
అంతర్గత భద్రత [#InternalSecurity] ని ప్రశ్నార్థకంలోకి నెడుతున్న తీవ్రవాదాన్నీ పాలకులు అదే కోణంలో చూడాలి! ఎంతైనా, వాళ్లూ మన సోదరులే! వెంటాడి, వేటాడి చంపడం సరైన చర్య కానేకాదు! చర్చలు అని వాళ్లు అడిగినప్పుడు ఒక అవకాశం తప్పకుండా ఇవ్వాల్సిందే!
Ads
ఆ ప్రక్రియకు వెంటనే శ్రీకారం చుట్టి, ఓ తటస్థ వేదికపై కూచుని వాళ్ల గోడు వినాల్సిందే! దేశపౌరులుగా మనోభావాలను వెల్లడించడం వాళ్ల ప్రాథమిక హక్కు!
గతంకంటే నక్సల్ మీనేస్ గణనీయంగా తగ్గిందన్నది ఒక అధ్యయన సారాంశం! ఫ్యూడలిజం నాటి కాలమాన పరిస్థితుల్లో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ [#IIT], రీజినల్ ఇంజనీరింగ్ కళాశాల [#REC] లాంటి వాటిల్లో ఎంటెక్ వంటి ఉన్నత విద్యాభ్యాసం చేసిన వాళ్లు సామాజిక స్పృహతో ఉద్యమబాట పట్టడం ఒకరకంగా అనివార్యమైంది!
కానీ, అలాంటి హైలీ క్వాలిఫైడ్ ఇంటెలెక్చువల్స్ ఒకవేళ జనజీవన స్రవంతిలోనే ఉండి ఉంటే, వాళ్లు కచ్చితంగా హైపొజిషన్లో ఉండి ఇవాళ దేశానికి సేవ చేసేవాళ్లు! సో, అన్ని రకాల అర్హతలు ఉండి, విలాసవంతమైన జీవితం గడపడానికి అవకాశం ఉండి, చదువుసంధ్యలు కలిగిన ఆ మేధావులు, అలా ఆయుధం పట్టి అడవిబాట పట్టాల్సి వచ్చిందంటే, ఆనాటి ఆ అసమానతల తీవ్రతను ముందు అర్థం చేసుకోవాలి! ఆ సాధకబాధకాలు ఏమై ఉంటాయో అంచనా వేయాలి!
బూర్జువా వ్యవస్థల్లో దొరల దాష్టీకానికి బలి ఔతున్న తాడిత పీడిత జనాల తరఫున నిలబడి దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న నక్సలిజాన్ని, టెర్రరిజంతో పోల్చడం ముమ్మాటికీ తప్పు! మత రక్కసికి పుట్టిన ఉగ్రవాదం ఏ కోశానా ఉపేక్షించదగింది కాదు! రక్తం మరిగిన అలాంటి శక్తుల పీచమణచడానికి మానవత చూపించనక్కరలేదు!
వాళ్లపట్ల ఎంత కఠినాతికఠినంగా వ్యవహరించినా తప్పులేదు! కానీ, నక్సలైట్లు అలా కాదు! ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి సమాజంలో అణగారినవర్గాల పక్షాన నిలబడి వాళ్లు భీకర పోరాటం చేస్తున్నారన్నది నిఖార్సైన నిజం! ఇక్కడ మానవతా కోణం తప్పనిసరి! హింసకు హింస సమాధానం కాకూడదు!
కొడుకు తప్పు చేస్తే తండ్రి ఎలాంటి పాత్ర పోషిస్తాడో, అంతటి ఉదాత్తతను ప్రభుత్వాలు సైతం ప్రదర్శించాలి! వాళ్లు చంపారు, మేం కూడా మరణశాసనం రాస్తామని పాలకులు అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో చెల్లదు కాక చెల్లదు! నయాన్నో, భయాన్నో దారికి తెచ్చుకునే మార్గాలే ఇక్కడ అనుసరణీయం, ఆచరణీయం! రాజ్యహింసకు ఎన్నడూ ప్రజామోదం ఉండదు కాక ఉండదు!
కాలం సైతం మారిపోయింది! పౌరవ్యవస్థ ఆనాడున్న దీనస్థితిలో ఈనాడు లేదు! ప్రజాతంత్రంలో బహుజనవర్గాలు కీలక భూమిక పోషిస్తున్నాయి! సబ్బండవర్ణాలు నిర్ణయాత్మకశక్తిగా ఎదుగుతున్నాయి! చిలువలు పలువలైన వ్యక్తిగత ఆలోచనల నడుమ ఉద్యమ సిద్ధాంతం సైతం రాద్దాంతం ఐపోయింది!
నిబద్ధత, నైతికతలు లుప్తమైపోయాయి! వీటికి తోడు డే బై డే సొసైటీ మోడ్రనైజ్ ఔతోంది! లిట్రసీ పెరిగింది! వివిధ రుగ్మతలపై పీడితవర్గంలో అవేర్నెస్ కూడా వచ్చింది! ట్వంటీఫస్ట్ సెంచరీలో యంగ్ జనరేషన్ కెరీర్ బిల్డింగ్, డాలర్ డ్రీమ్స్ లో ఓలలాడుతోంది!
ఇది కలర్ ఫుల్ అర్బన్ కల్చర్ ఎరా! ఫక్తు కమాయేంగే, ఖాయేంగే, పీయేంగే బాపతు జమానా! విప్లవ ఉద్యమాల వైపు యూత్ పెద్దగా ఆసక్తి చూపని కాలం! అత్యంత కఠిన పరిస్థితులను ఓర్చి జంజంబల్బరీ వెయ్కాళ్లా జెర్రీ అంటూ పిడికిలి బిగించి అడవిబాట పట్టే సాహసం చేసే పరిస్థితిలో ఈతరం యువత లేనేలేదు! పిల్లలు తుపాకీ పట్టి చల్కల్, జంగల్ పట్టడం ఇకపై కల్ల!
అందుకే, ఏమో, ఈ పరిస్థితులన్నిటినీ ఆకళింపు చేసుకొని, బహుశా నక్సలైట్ నాయకత్వం తుపాకీ వీడుదాం అనుకుంటుందేమో? అందుకు ఒక వేదిక కోసం వెతుకుతుందేమో? ప్రభుత్వంతో చర్చలు జరపడం ద్వారా, పంథాను, గమనాన్ని మార్చుకోవాలి అనుకుంటుందేమో? పైగా ప్రాణాలను ఫణంగా పెట్టి రాజ్యంతో చేస్తున్న వాళ్ల సంఘర్షణ వృధాప్రయాసగా మారిపోతోందని అజ్ఞాతం [#UnderGround] లో ఉన్న ఉద్యమకారులు భావిస్తున్నారేమో!
వాళ్లలో అనేకమంది ప్రశాంత జీవితాన్ని కోరుకుంటున్నారేమో? అలా ఐతే మాత్రం, వాళ్ల కోరిక ముమ్మాటికీ న్యాయమైందే! సర్కారు సైతం వాళ్లకొక అవకాశం ఇవ్వాల్సిందే!
#గమనిక :: నాది వామపక్ష భావజాలం కాదు! ఆ వాదానికి సానుభూతిపరుణ్ణి అస్సలు కాదు! సంపూర్ణ ధర్మబద్ధుడిని! ధర్మం అని నమ్మిన దాన్ని నిక్కచ్చిగా చెప్పే భావస్వేచ్ఛ ఉన్న సగటు భారతీయ పౌరుణ్ణి!…….. 𝐒𝐔𝐑𝐀𝐉 𝐕. 𝐁𝐇𝐀𝐑𝐀𝐃𝐖𝐀𝐉.
Share this Article