ప్రస్తుతం జాతీయ స్థాయిలో వినిపిస్తున్న పేరు ఏకనాథ్ షిండే… ఒక ఆటో డ్రైవర్‌గా ప్రస్థానం ప్రారంభించి ఇప్పుడు ఏకంగా సీఎం కుర్చీనే ఆశిస్తూ హల్‌చల్ క్రియేట్ చేస్తున్న నాయకుడు… శివసైనికుడు… శివసేన మాదే, నువ్వు ఓ డమ్మీవి మాత్రమే అని ఏకంగా తన బాస్ బాల్ ఠాక్రే రాజకీయ వారసుడు ఉద్దవ్ ఠాక్రేనే సవాల్ చేస్తున్నాడు… అసలు ఎవరు ఈ షిండే అని చాలా కథనాలు, వ్యాసాలు వచ్చాయి… కానీ ఈ ఏకనాథ్ అనే కత్తికి పదును పెట్టింది ఎవరు..? తనలో నిజంగా కనిపించేది ఎవరు..?
ఆనంద్ దిఘే… ఇదీ ఆయన పేరు… కేజీఎఫ్ సినిమాలో రాకీ తరహా… 1951లో పుట్టిన ఈయన్ని ధర్మవీర్ అని కూడా పిలుస్తారు… శివసేన పార్టీవాదులకు సంబంధించి రెండు బయోపిక్స్ రిలీజైతే, అందులో ఒకటి బాల్ ఠాక్రే జీవితం మీద తీయబడింది… రెండోది ఇదుగో ఈ ఆనంద్ దిఘే మీద తీసిందే… పేరు ధర్మవీర్… మొన్నటి మే నెలలో రిలీజైన ఈ మరాఠీ సినిమా సూపర్ హిట్… ఇందులో ఏకనాథ్ పాత్ర కూడా ముఖ్యమే…
Ads
థానే… ఇదీ తన అడ్డా… ఎంతగా ఎదిగిపోయాడు అంటే… నాలుగైదు ఎంపీ స్థానాలు, పది వరకూ అసెంబ్లీ స్థానాల్లో తను మద్దతు ఇచ్చినవాళ్లే గెలిచేంత..! థానే కా ఠాక్రే అనేవాళ్లు అందరూ… మరణించేవరకూ తను పోటీచేయలేదు… కేవలం పార్టీలో జిల్లా ప్రముఖ్‌గా ఉన్నాడు… తన పరిధిలో సబ్ కోర్టులు ఓపెన్ చేశాడు… వాటిని దర్బార్లు అనేవాళ్లు… అనేక సమస్యలు వచ్చేవి వాటి ముందుకు… అక్కడికక్కడే పరిష్కరించేవాళ్లు… ఆయన దర్బార్ చాలా ఫేమస్… రైతులు, ఆదివాసీలు, ఇతర ప్రజానీకం అనేక సమస్యల మీద తన దగ్గరకు వచ్చేవాళ్లు…
స్కూళ్లలో అడ్మిషన్ల దగ్గర నుంచి ఎంపీఎస్సీ, యూపీఎస్సీ పరీక్షల దాకా విద్యార్థులను ప్రోత్సహించేవాడు… తనతోపాటు పనిచేసేవాళ్లతో అనుబంధాన్ని పెంచుకునేవాడు… బాస్, ఫాలోయర్ సంబంధం గాకుండా ఓ కుటుంబం తరహాలో ఉండేవి బంధాలు… ఇప్పుడు శివసేనను పూర్తిగా చేజిక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్న ఏకనాథ్ షిండే తన ఫాలోయరే… ఓ దశలో షిండే ఓ బోటు ప్రమాదంలో ఇద్దరు పిల్లల్ని పోగొట్టుకున్నాడు… దుఖంలో మునిగిపోయాడు… ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు… తనకు సపోర్టుగా నిలిచి, మళ్లీ జనంలోకి తెచ్చి, తన ప్రధాన అనుచరుడిగా తీసుకుని, పదును పెట్టుకున్నాడు ఆనంద్ దిఘే…
శివసేన సిద్ధాంతం హిందుత్వ ప్లస్ మరాఠీ… దాని బలం అదే, దాని బలహీనత కూడా అదే… దాన్ని వదిలేస్తే శివసేన లేదు… ఇప్పుడు ఠాక్రే పతనానికీ అదే కారణం… కాంగ్రెస్ కోసం, ఎన్సీపీ కోసం హిందుత్వను వదిలేయడమే కాదు… హిందుత్వకు విరుద్ధంగా వెళ్లాడు… పార్టీ ఎమ్మెల్యేల్లో ఠాక్రే పట్ల బాగా ఆగ్రహం, అసంతృప్తి, అసహనం పెరగటానికి అదీ ఓ కారణమే…
ఎన్సీపీ కోవర్టుగా చెప్పబడే సంజయ్ రౌత్ పార్టీకి అనధికారిక అధ్యక్షుడిగా వ్యవహరించడం, ఏకనాథ్ షిండే వంటి హార్డ్ కోర్ సీనియర్ శివసైనికులకు కూడా ప్రయారిటీ తగ్గిపోవడం, పరాభవాలు, ఉద్దవ్ ఠాక్రే పార్టీ వ్యవహారాల్ని పట్టించుకోకపోవడం వంటి కారణాలు పార్టీ ఎమ్మెల్యేల్లో అభద్రతను నింపాయి… ఆనంద్ దిఘే కూడా శివసైనికుడే కాబట్టి హిందుత్వవాదే… కానీ ముస్లిం ద్వేషి కాదు… నేను జిహాదీలకు మాత్రమే వ్యతిరేకిని అని చెప్పేవాడు… తన దర్బార్‌కు ముస్లిములు కూడా వచ్చేవాళ్లు, వోట్లేసేవాళ్లు…
చట్టం పరిభాషలో చెప్పాలంటే ఆనంద్ ఓ రౌడీ ఎలిమెంట్… కానీ వాస్తవం వేరే… తనది పూర్తిగా పెదరాయుడు తరహా… సత్వర న్యాయం… ఏదేని షాపులో తన ఫోటో ఉందంటే అదే పెద్ద రక్షణ… ఎవరైనా తనను ఆశ్రయించి, న్యాయం కోరారూ అంటే ఓ భరోసా… అంతగా పాతుకుపోయాడు… సహజంగానే అనేక వివాదాలు… శ్రీధర్ ఖోప్కర్ అనే శివసేన నాయకుడు కాంగ్రెస్ వైపు క్రాస్ ఓటింగ్ చేయడంతో తనను హతమార్చాడని ఓ ఆరోపణ ఉంది… దాని మీదే టాడా కేసు పెట్టారు తనపై… ఆనంద్‌కు పెరుగుతున్న జనాదరణతో బాల్ ఠాక్రే కూడా కలవరపడేవాడని అంటారు…
తన మరణం కూడా ఓ మిస్టరీ… ఓ వివాదం… 2001, ఆగస్టు 26… ఓ ప్రమాదానికి గురయ్యాడు… కాలు విరిగింది… హాస్పిటల్‌లో చేర్పించారు… అక్కడే తను మరణించాడు… గుండెపోటు అని ప్రకటించింది హాస్పిటల్… జనం దాన్ని నమ్మలేదు… ఆగ్రహించారు… ఆ మంటల్లో ఆ సింఘానియా హాస్పిటల్ మొత్తం బూడిదైంది… ఠాక్రే చంపించాడనే ప్రచారం కూడా జరిగి పెద్ద ఎత్తున ఉద్రిక్తత… తన అంత్యక్రియలకు దాదాపు ఆరేడు లక్షల ప్రజలు హాజరయ్యారంటారు… ఇప్పటికీ థానే పరిసరాల్లో జరిగే డెత్ యానివర్సరీల్లో లక్షల జనం పాల్గొంటారు… ప్రత్యేకించి ఆదివాసీలకు ఆనంద్ స్మరణీయుడు…!
Share this Article