పత్రికల నిండా నానా చెత్తా ఉంటుంది… కొన్ని మాత్రమే రీడర్‌కు కనెక్టవుతాయి… మనసు కలుక్కుమనిపిస్తాయి… ఒక్క క్షణం మైండ్ బ్లాంక్ అయిపోతుంది… ఇదీ అలాంటి వార్తే… సోషల్ మీడియాలో ఎవరి వాల్ మీదో కనిపిస్తే… అసలు ఈ వార్త నిజమేనా అని డౌటొచ్చింది… ఆ పత్రిక ఫస్ట్ పేజీలోనే నిలువునా కనిపించింది…
ఎస్, మనిషికి మరణాలు అనేక రకాలుగా వస్తుంటయ్… రోగాలు, విపత్తులు, ప్రమాదాలు, హత్యలు, నిర్లక్ష్యాలు, తప్పుడు వైద్యాలు వంటివి మనిషి ప్రాణాలను బలిగొంటాయి… కానీ ఈ పసికందు చేసిన నేరమేంటి..? నిజంగా అవసరమైతే దగ్గరుండి సాయం చేయాల్సిన పోలీసులు వాళ్లే ఓ పిల్లాడి ప్రాణాలను బలితీసుకోవడం ఏమిటి..? వార్త ఏమిటంటే..?
‘‘జనగాం జిల్లా, మరిగడి గ్రామానికి చెందిన మచ్చ మల్లేశం, సరస్వతి దంపతులకు ఇటీవలే కొడుకు పుట్టిండు. కానుపు తర్వాత సరస్వతి వెంకిర్యాలలోని తన పుట్టింట్లో ఉంటోంది. పసికందుకు సుస్తి చేయడంతో మంగళవారం జనగాంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించారు. బాబు పరిస్థితి సీరియస్‌గా ఉందని, వెంటనే హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని డాక్టర్లు చెప్పారు. దీంతో ఓ కారు మాట్లాడుకుని బాబుతో పాటు ఆ దంపతులు హైదరాబాద్‌కు బయల్దేరారు. వరంగల్– హైదరాబాద్ హైవేపై వంగపల్లి దగ్గర ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్నారు. మల్లేశం దంపతులు ప్రయాణిస్తున్న కారుపై రూ.1000 పెండింగ్ చలానా ఉంది. అది క్లియర్ చేస్తే కానీ కారును వదలేది లేదని పోలీసులు తేల్చిచెప్పారు. బాబుకు ఆరోగ్యం బాలేదని, హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకెళుతున్నామని బతిలాడినా వినిపించుకోలేదని సరస్వతి చెబుతోంది. తెలిసిన వాళ్లకు ఫోన్ చేసి, చలానా క్లియర్ చేయించేదాకా విడిచిపెట్టలేదనీ, కొంచెం కూడా మానవత్వం లేకుండా చలానా కోసం అరగంటపైనే తమ కారును ఆపేశారని అంటోంది…. ఆ తర్వాత నీలోఫర్ ఆస్పత్రికి చేరుకునేసరికి ఆలస్యమైందని, అప్పటికే బాబు చనిపోయాడని డాక్టర్లు చెప్పారట…’’
Ads
సహజంగానే పోలీసులు ఖండించారు… అబ్బబ్బే, మా తప్పేం లేదు, రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా ఆపాం, చలాన్లపై కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టాం, అసలు కారులో బాబు ఉన్నాడనే విషయాన్ని ఎవరూ చెప్పలేదు అని ట్రాఫిక్ సీఐ వివరణ ఇచ్చాడట… సరే, పోలీసులు ఎలాగూ ఏదో చెబుతారు… ఏమో… నిజంగానే సరైన టైంలో నీలోఫర్ తీసుకెళ్లి ఉంటే బాబు బతికేవాడేమో… పాపం, ఆ బాబు చేసిన నేరమేంటి..? ఇలా మరణశిక్ష విధించారు ట్రాఫిక్ పోలీసులు..?!
దీన్ని కాస్త పక్కన పెడితే… పోలీసుల వివరణలు ఎలా ఉంటాయో తెలుసు… ఎవరి మీద ఏ చర్యలూ ఉండవనీ తెలుసు… కానీ కొన్నాళ్లుగా తెలంగాణవ్యాప్తంగా అందరికీ అనుభవమే… ట్రాఫిక్ పోలీసులు ఎక్కడబడితే అక్కడ ఆపేస్తున్నారు… మొత్తం చలాన్ల బాగోతమే… చకచకా కెెమెరాలు వెహికిల్స్‌ను ఫోటోలు తీస్తాయి, చలాన్ జనరేట్ అయిపోతుంది… చలాన్లు పెండింగ్ ఉన్నాయా, చెల్లించారా అని చెక్ చేయడానికి వెహికిల్స్ ఆపేస్తున్నారు…
అప్పీళ్లు ఉండవు… అడిగేవాళ్లు ఉండరు… అడగటానికి చాన్సే ఉండదు… ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసుల ఏకైక విధి చలాన్ల వేట… ఈ పసికందు సంగతే తీసుకుందాం… పెండింగ్ చలానా ఉంటే ఇప్పటికిప్పుడు ఏం మునిగిపోయిందని..? ఆ కారు మళ్లీ దొరకదా..? అడగలేరా..? కనీస మానవత్వం కూడా లేని విధి ఉంటే ఎంత..? లేకపోతే ఎంత..? ఈ భారీ ధనిక రాష్ట్రానికి ఈ చలాన్లతో వచ్చే ఆదాయం ఎంత..? పోనీ, ఇలాంటి సందర్భాల్లో తమకూ పిల్లలున్నారని ఒక్కక్షణం ఎందుకు వాళ్లు ఆలోచించలేకపోయారు..?!
ఇది ఈనాడులో వచ్చిన వార్త… వేయాలా, వద్దా అని తెగ తర్జనభర్జనలు పడి, చివరకు యాదాద్రి జిల్లా జోన్ పేజీలో కనీకనిపించకుండా పబ్లిష్ చేశారు… ఈ ప్రయారిటీ నిర్ణయం తీసుకున్న సబ్ ఎడిటర్లు ట్రాఫిక్ పోలీసులకన్నా ఎక్కువ పాపం మూటగట్టుకున్నట్టు..!!
Share this Article