ఈరోజు నచ్చిన వార్త ఇది… గొప్ప వార్త కాదు.,. ప్రజలు తిరగబడి కొట్టలేదు… తెలంగాణలో ఓ లేడీ ఎమ్మార్వోను తగులబెట్టినట్టు కూడా కాదు… రెవిన్యూ వ్యవస్థ అంటేనే ప్రజల్లో విపరీతమైన ద్వేషం… భూమికి సంబంధించిన పెత్తనాలు కాబట్టి అధికారం కేంద్రీకృతమైన వ్యవస్థ అది… పైగా మెజిస్టీరియల్ పవర్స్… ఒక్క ముక్కలో చెప్పాలంటే పాలనకు కేంద్ర బిందువులు…
ప్రభుత్వ ఉద్యోగి అంటేనే… తన రూపస్వభావాలు ఏమిటో ప్రజలకు క్లారిటీ ఉంది… ఆ క్లారిటీని ప్రభుత్వ ఉద్యోగులు ఇస్తుంటారు కూడా… తమ మీద ప్రజలకున్న అభిప్రాయాన్ని, అంచనాల్ని తగ్గించడానికి వాళ్లేమీ ప్రయత్నించరు… సిస్టంలో అతి పెద్ద వైరస్… ప్రభుత్వ యంత్రాంగం అవినీతి… నాట్ ఓన్లీ రెవిన్యూ… అన్ని శాఖలూ అలాగే తగలడ్డాయి… కానీ రెవిన్యూ యంత్రాంగం కీలకం కాబట్టి ప్రజల మీద వాళ్ల స్వారీ తీవ్రత ఎక్కువ…
కుర్చీ ఎక్కిన ఏ పాలకుడూ… ఏ రాష్ట్రంలో కూడా ఏమీ చేయలేకపోయిన వ్యవస్థ అది… ఏసీబీలు ఉత్త జుజుబీ.,.. నానాటికీ మరింత బలపడి… ప్రతిచోటా భూముల రేట్లు పెరుగుతూ… రియల్ ఎస్టేట్ ఎక్కడికక్కడ విషవృక్షాల్లా ఊడలు దిగుతున్న… దిగిన కాలమిది… ఇంకేముంది..? తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి చేయదగిన అధికారం చేతిలో ఉన్న రెవిన్యూ వ్యవస్థ ఊరుకుంటుందా..? చెలరేగిపోతోంది…
Ads
ఇక వార్త విషయానికి వస్తే… కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం తహసీల్దార్ గెడ్డం రవీంద్రనాథ్… తను డిప్యుటేషన్ మీద పి.గన్నవరం తహసిల్దార్‌గా మంగళవారం బదిలీ అయ్యాడట… ఇంకేముంది..? ఇన్నేళ్లు సదరు రియల్ పాలకుడు వెళ్లిపోతున్నాడమో అనే సమాచారం క్షణాల్లో పాకిపోయింది… ప్రజలు దీపావళి జరుపుకున్నారు… బాణాసంచా కాల్చారు… స్వీట్లు పంచుకున్నారు… ఇది సరైన ప్రజాభిప్రాయ ప్రకటన… అంటే, సదరు తహసిల్దార్ ఎంత ప్రజాకంటకుడిగా మారాడో అర్థమవుతోందిగా…
ఇది పరోక్షంగా అవినీతి నిరోధం మీద శ్రద్ధ లేని పాలకుల మీద కూడా ఓ అసంతృప్తి సూచికే… అరెరె, అప్పుడే అయిపోలేదండీ… సదరు తహసిల్దార్‌కు ఏమైంది..? ఇప్పుడిక సదరు గన్నవరం ప్రజల మీద పడింది పిడుగు… అక్కడ జగన్ ఉంటేనేం..? చంద్రబాబు ఉంటేనేం..? రేపో మాపో మళ్లీ ఎంచక్కా అదే అమలాపురం వస్తాడు… ఆల్‌రెడీ సారు గారు ఎమ్మెల్యే గారిని కలిశారట… కలెక్టర్ కూడా భరోసా ఇచ్చారట, దాంతో సారు గారు గన్నవరం తహసిల్దార్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించాడట…
సదరు కలెక్టర్ గారికి సదరు తహసిల్దార్‌లో నిజాయితీ కనిపించవచ్చు… అసలు సమస్య అది కాదు… ఏసీబీ ఫెయిల్యూర్… ఏసీబీని పరుగులు పెట్టించి, ప్రజల్లో కాస్త భరోసా నింపడంలో ప్రభుత్వ వైఫల్యం… పంచిపెట్టడం వేరు- పాలన సమర్థత వేరు… సరే, అవన్నీ వదిలేయండి… అమలాపురం ప్రజలు దీపావళి చేసుకున్నారు సరే, మరి గన్నవరం ప్రజలు ఏం చేయాలి పాలకా..? రెవిన్యూ మీద నిప్పులు గక్కి చివరకు తనే చల్లారిపోయి కేసీయారే సైలెంట్ అయిపోయాడు… మరి మీకేమైనా ఐడియా ఉందా..?!
Share this Article