.
A.Kishore Babu …… “క్లైమాక్స్ ఒక ‘అమృత’ కళశం!”
ఏ సినిమాకైనా పతాక సన్నివేశం (క్లైమాక్స్) అత్యంత కీలకం. దీనికోసం దర్శకులు చేయని కసరత్తులుండవు.. పడరాని ఫీట్లుండవు… దురదృష్టవశాత్తు ఈ మధ్య తెలుగు సినిమాలో చాలా వరకు క్లైమాక్స్ అంటే కోట్లు ఖర్చు పెట్టడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.
Ads
మేకింగ్ స్టైల్ లో ఎంత మనీ పెట్టామనే తప్ప అసలు మ్యాటర్ లో పట్టుందా లేదనేది గమనించడం లేదు. అవసరమున్నా లేకున్నా భారీ సెట్టింగులు వేసి, హీరోలతో అసహజమైన ఫీట్లు చేయించి, వీఎఫ్ ఎక్స్ ల హడావుడి మేళంతో గందరగోళం చేస్తున్నారు. ఇదే సినిమా సక్సెస్ మంత్రమని భావించి ప్రేక్షకులను భయపెట్టేస్తున్నారు.
ఒకటి రెండు సినిమాలకు ఈ ఫార్ములా పనికొస్తుందేమో కానీ అన్నిటికి కాదు. క్లైమాక్స్ ఎంత కాస్ట్లీగా తీస్తున్నామనే తప్ప కథ గురించి పట్టించుకోవడం లేదు. అందుకే చాలా సినిమాలు ఫట్ మంటున్నాయి. కథపైన దర్శకుడికి పట్టుండాలే కానీ ఏ మాత్రం ఖర్చు లేకుండానే క్లైమాక్స్‌ను అద్భుతంగా చిత్రీకరించి ప్రేక్షకుడ్ని కుర్చీలకు అతుక్కుపోయేలా చేయొచ్చు. గతంలో ఎంతోమంది దర్శకులు దీన్ని నిరూపించారు. అలాంటి వాటిలో ఓ అద్భుతమైన ఆణిముత్యం మణిరత్నం తీసిన అమృత సినిమా..
‘క్లుప్తంగా చెప్పాలంటే. ‘
శ్రీలంకలో ఎల్టీటీఈ, ప్రభుత్వం మధ్య జరుగుతున్న సివిల్ వార్ బ్యాక్ డ్రాప్‌లో తీసిన సినిమా. రామేశ్వరంలో శరణార్థిగా వచ్చి బిడ్డకు జన్మనిచ్చి ఆ పురిటి బిడ్డను వదిలేసి వెళ్లిన శ్యామల అనే తల్లి. ఆ బిడ్డను దత్తతు తీసుకున్న తల్లిదండ్రులు. ఆ బిడ్డకు 9ఏళ్ల ప్రాయం వచ్చాక ఈ నిజం చెప్తారు. అప్పుడా చిన్నారి తన తల్లి దగ్గరకు తీసుకెళ్లమని కోరుతుంది. అలా ఓ చిన్నారి తన తల్లిని వెతుక్కుంటూ మద్రాసు నుంచి శ్రీలంకలోని ఎల్టీటీఈ ప్రభావమున్న జాఫ్నాలోని మాంబళం ప్రాంతానికి వెళ్లడమే ఈ సినిమా కథ.
నిజానికి టైమ్ మ్యాగ్జైన్ లో వచ్చిన ఒక చిన్న వార్తే ఈ సినిమాకు ప్రేరరణ. ఒక అమెరికన్ జంట ఫిలిప్సైన్ బిడ్డను దత్తత తీసుకుంటుంది. చాలా ఏళ్ల తర్వాత ఆ దంపతులు ఆ బిడ్డకు ఈ నిజం చెప్తారు. అప్పుడా బిడ్డ తన సొంత తల్లిని చూడాలని కోరుతుంది. ఆ బిడ్డ కోరిక మేరకు ఆ తల్లిదండ్రులు ఆ తల్లిని వెతుక్కుంటూ ఫిలిప్పైన్స్ కు వెళతారు. తనను వెతుక్కుంటూ వచ్చిన ఆ బిడ్డపైన ఆ తల్లి ఎలాంటి ఆప్యాయత చూపించలేదు.
ఇది ఆ ఆర్టికల్ సారాంశం. దీన్ని ఆధారంగా తీసుకుని మణిరత్నం అమృత కథను అల్లాడు. తమిళంలో ఇది కన్నత్తిల్ ముత్తుమిట్టాల్ అంటే బుగ్గమీద ముద్దు అని అర్థం. ఈ సినిమా క్లైమాక్స్‌లో అమృత తన పెంపుడు తల్లి బుగ్గను ముద్దాడటంతోనే సినిమా ముగుస్తుంది.
ఈ సినిమా అంతా ఒక ఎత్తు అయితే.. ఈ సినిమాక్లైమాక్స్ ఒక ఎత్తు. ఒక రకంగా నవతరం దర్శకులకు ఒక పాఠం లాంటిది. అంతలా ఏముంటుంది ఈ సినిమా క్లైమాక్స్‌లో అంటే….
“ఏమీ లేదు.. కానీ చాలా ఉంది”
14 నిమిషాలు.. ఈ సినిమా క్లైమాక్స్ నిడివి. కేవలం ఆరుగురు నటులు. వాళ్లెవ్వరికీ మేకప్పులేవు. ఒక్క ఫైటింగు లేదు, ఛేజింగులు లేవు, సస్పెన్స్, థ్రిల్లర్లు ఏమీ లేవు. సెట్టింగులేమీ లేవు. భారీ భారీ డైలాగులుండవు. మరి ఇవన్నీ లేకుండా ఇంకేముంది అంటే ప్రతి ఫ్రేములో ఆర్థ్రత ఉంటుంది, ఆవేదనుంటుంది, ప్రేమ ఉంటుంది, అభిమాముంటుంది, గుండెలను పిండేసే భావోద్వేగముంటుంది. అవి ప్రేక్షకుడి మనుసును కన్నీటితో తడిచి ముద్ద చేస్తాయి.
“మొత్తం క్లోజప్ షాట్లే”
ఈ క్లైమాక్స్‌లో మణిరత్నం మాయాజాలమంతా కేవలం క్లోజప్ షాట్లే.. 14 నిమిషాల క్లైమాక్స్‌లో కేవలం 7 లాంగ్ షాట్స్ మాత్రమే ఉంటాయి, అవి కూడా కడ రెప్పపాటులో ఇలా వచ్చి అలా మాయమవుతాయి. మిగిలిన భాగమంతా క్లోజప్ షాట్లతోనే ముగించేస్తారు. ముగింపు ఫ్రేమ్ కూడా క్లోజప్ షాట్‌తోనే ముగుస్తుంది. ప్రతి ఫ్రేములోనూ నటుల హావభావాలు ప్రేక్షకుడ్ని బావోద్వేగపరుస్తాయి.
ఇక క్లైమాక్స్‌లో మాటలు (డైలాగులు) గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ప్రతి మాట ఎంతో ఖచ్చితంగా తూకం వేసినట్లు ఉంటుంది. ఎక్కడా కూడా అనవసరమైన మాటనేది కనిపించకుండా జాగ్రత్తగా ఉపయోగించారు. ఈ క్లైమాక్స్ తీయడానికి కోట్లు ఖర్చు చేయకపోవచ్చు కానీ, మణిరత్నం ఆయన బృందం రోజుల తరబడి మాత్రం పెద్ద కసరత్తే చేసుండాలి. లేకపోతే అంత బాగా ఈ క్లైమాక్స్‌ను తీయలేరు.
“ఏమిటీ క్లైమాక్స్”
పురిటి బిడ్డను అనాథగా వదిలేసి ఉద్యమ బాటను వెతుక్కుంటూ వెళ్లిపోయిన ఓ తల్లి
దేశం కానీ దేశంలో ఆ తల్లిని వెతుక్కుంటూ వచ్చిన ఓ బిడ్డ….
ఇద్దరూ మొదటి సారి ఒకరికొకరు ఎదురుగా తారసపడే సన్నివేశమే ఈ క్లైమాక్స్. అంతకు మించి ఏమీ ఉండదు.
సాధారణంగా ఇలాంటి సన్నివేశం మరే ఇతర దర్శకుడి చేతిలో పడ్డా అనవసరమైన నాటకీయతా, చెత్తా చెదారం అంతా కలబోసి విసుగెత్తించేవారే. కానీ మణిరత్నం తన సృజనాత్మకతనంతా ఈ సన్నివేశంలో రంగరించి చూపించారు.
ఈ సన్నివేశంలో మొదటి సారి కలుసుకున్న తల్లీ, కూతురు మధ్య మౌనం బద్ధలవ్వడం (ఐస్ బ్రేకింగ్) ఒక పెద్ద సమస్య.
బిడ్డను చూడగానే తల్లి పరుగెత్తికెళ్లి హత్తుకోవడం…తల్లిని చూడగానే బిడ్డ పరుగెత్తుకెళ్లి అమ్మాని ఆలింగనం చేసుకోవడం మూస సినిమాల్లో కనిపించేవే..
కానీ ఈ క్లైమాక్స్‌లో అలాంటి నాటకీయత ఉండదు.
పురిటిలోనే తాను వదిలేసిన బిడ్డ తనను వెతుక్కుంటూ వస్తే ఆ బిడ్డ కళ్లలోకి సూటిగా చూడలేక సతమతమవుతుంది ఆ తల్లి. చూడలేక, చూడకుండా ఉండలేక, మాట్లాడలేక, మాట్లాడకుండా ఉండలేక మనసులో నరకయాతన పడుతుంది. ఆ హావభావాలను నందితాదాస్ ఎంతో సహజంగా పండించారు. అలా అనడం కంటే ఆమె ఆ పాత్రలో జీవించారనే చెప్పాలి.
తల్లి సరే, మరి బిడ్డ పరిస్థితీ.. ఆమెదీ అంతే..
ఎన్నో ఏళ్ల తర్వాత తాను వెతుక్కుంటూ వచ్చిన తల్లి ఎదురు పడితే ఎగిరి గంతులేసి ఆమెను హత్తుకునే పరిస్థితి కాదు తనది.
తనపై ఏమాత్రం కనికరం కూడా లేకుండా పురిటిలోనే వదిలేసి వెళ్లిన ఆ వింత జంతువు తన తల్లి ఈమేనా అని వింతగా, రోతగా, అసహ్యంగా చూస్తుంది
నిజానికి అమ్మను చూడాలన్న కోరిక కాదు తనది. తనను అనాథలా వదిలి ఎందుకు వెళ్లిందో ఆ తల్లిని నిలదీయాలనేది ఆమె అసలు అంతరంగం…
ఒకటి కాదు రెండు కాదు..
20 ప్రశ్నలు..
గుండెల్లో దాచుకుని మద్రాసు నుంచి మోసుకొస్తుంది
వాటికామె వద్ద సమాధానముందా? చూద్దాం…
“నన్నెందుకు వదిలేసి వెళ్లారు?”
చిన్నారి మొదటి ప్రశ్న.
ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? అంతుబట్టని ధైన్యం ఆ తల్లిది. గుండెల్లో సూటిగా గుచ్చుకునే ఆ ప్రశ్నతో ఆమె మనసు అల్లకల్లోలమవుతోంది. వేదనతో మౌనంగా శూన్యంలో తలదాచుకుంటుంది. కాసేపు తర్వాత మౌనాన్ని భారంగా చీల్చుకుంటూ..
“ఆనాటి పరిస్థితి అది.. బోటులో శరణార్థిగా వచ్చాను. తిరిగి వెళ్లాల్సిన అవసరం వచ్చింది. వేరే దారిలేదు..” అని ముక్తసరిగా చెప్తుంది.
అక్కడ ఎవరి కారణం వారికుంది. అందులో ఎవర్నీ తప్పు పట్టలేం. పరిస్థితులే సిసలైన దోషులు
.
“మా నాన్న ఎవరు? నే చూడకూడదా?” రెండో ప్రశ్న
చెప్పలేదు. శ్రీలంక సైన్యం ఆయన్ను పొట్టనబెట్టుకుందనే నిజాన్ని ఈ చిన్నారికి చెప్పి చిత్రవధ చేయలేదు.
“నేను పుట్టినప్పుడు నన్ను ఎత్తుకున్నారా? నేను ఏడ్చానా? నవ్వానా?” మూడో ప్రశ్న
దీనికి ఏం చెప్పాలో దిక్పకుతోచని పరిస్థితి…మళ్లీ కాసేపు మౌనమే శరణ్యం. ఏం చెప్తే ఆ పసి మనసు ఎలా అర్థం చేసుకుంటుందో, ఆ పసి మనసు ఇంకెంత గాయపడుతుందో.. మనసులో ఒక్కటే సంఘర్షణ.. కాసేపటికి తనే మౌనాన్ని భారంగా చీల్చుకుంటూ
“నిన్నుకన్న తక్షణమే నేను వెళ్లిపోయాను. ఒకే ఒక్కసారి ఒక వేలితో నిన్ను తాకాను. అంతే.”
అని ముక్తసరిగా ముగిస్తుంది…
ఆ తర్వాత ప్రశ్న…
ఏముంటుంది… ఏమీ లేదు…
అంత కాఠిన్యంగా తనను వదిలేసి వెళ్లిన ఆ తల్లిని ఇంక అడిగేదేముంటుంది ఆ బిడ్డకు. అడగాల్సిన అవసరమేముంటుంది.
కన్నీటితో తన తల్లిని ఒక అసహ్యకరమైన చూపు చూస్తుంది ఆ బిడ్డ…
తన పెంపుడు తల్లి ఒడిలో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది..
“అడుగురా” అంటూ బిడ్డను ప్రోత్సహిస్తుంది పెంపుడు తల్లి..
అడగటానికి ఇంకేం ప్రశ్నలుంటాయి? ఒకవేళ ఉన్నా అవన్నీ వేస్టే..
మూడో ప్రశ్న వద్దే ఆమె ప్రశ్నల వర్షం ఆగిపోతుంది
భావోద్వేగాల వర్షం ఆరంభమవుతుంది.
ఏ బంధానికైతే లొంగకూడదనుకుని పురిటి బిడ్డను వదిలి శ్రీలంక తమిళుల సాయుధ పోరాటంలోకి వెళ్లిపోయిందో
ఆ తల్లి చివరకు తన బిడ్డను చూసి నిలువెల్లా కరిగిపోతుంది. తన కన్నీటి వర్షంలో బిడ్డను గుండెలకు హత్తుకుని బావురమని విలపిస్తుంది. తన బిడ్డను ఇంత అల్లారుముద్దుగా పెంచిన పెంపుడు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుకుంటుంది.
“మీరూ నాతో రండి..లేదా నన్ను మీతో తీసుకెళ్లండి” అని అర్థిస్తుంది ఆ చిన్నారి..
కానీ ఆ తల్లి అటు వెళ్లలేదు.. ఇటు బిడ్డను రమ్మనలేదు.
అటు ఇటు కానీ ఒక సందిగ్ధ సంఘర్షణ ఆమెది..
“ఏదో ఒకరోజు ఇది యుద్ధం లేని భూమిగా మారుతుంది…స్వేచ్ఛ ఉదయిస్తుంది..ఆ రోజు నువ్వు రా”
అని బిడ్డను కోరుతుంది..
“ఏ రోజు..” అని బిడ్డ ప్రశ్నిస్తుంది…
దానికి సమాధానం ఉందా? ఆమె దగ్గర లేదు. దర్శకుడి వద్ద లేదు. ప్రేక్షకుల వద్ద లేదు..పాలకుల వద్ద లేదు..ప్రభుత్వాల వద్ద లేదు
అదొక సమాధానం దొరకని ప్రశ్న.
భారమైన హృదయంతోనే ఆ తల్లి తన కూతరు నుంచి కన్నీటి వీడ్కోలు తీసుకని మళ్లీ ఉద్యమ పథంలోకి వెళ్లిపోతుంది..
ఆ బిడ్డ మళ్లీ తన పెంపుడు తల్లిదండ్రుల సంరక్షణ గొడుగు కిందకే చేరుకుంటుంది.
పెంపుడు తల్లి బుగ్గను ప్రేమగా ముద్దాడుతుంది…
ప్రేమ…ప్రపంచాన్ని ప్రేమే జయిస్తుంది…
“మరుమల్లెల్లో ఈ జగమంతా మురియగా”
“ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా…”
అంటూ సాగే ఏఆర్ రెహ్మాన్ బ్యాగ్రౌండ్ సాంగ్‌తో ఈ సన్నివేశం ముగుస్తుంది..
14 నిమిషాల ఈ క్లైమాక్స్‌లో ప్రతి ఫ్రేము అత్యద్భుతంగా కనిపిస్తాయి. ప్రేక్షకుడి కళ్లు చెమ్మగిల్లేలా చేస్తాయి.
ఫొటోగ్రఫీ, స్క్రీన్ ప్లే, షాట్ డివిజన్, ఫ్రేమింగ్..డైలాగ్ డెలవరీ, యాక్టింగ్ ఇలా ఒక్కటేమిటీ అన్నీ సమపాళ్లలో వేటికవే తమ ప్రత్యేకతను చాటిన క్లైమాక్స్ ఇది.
ఈ సినిమాకు ఏ ఆర్ రెహ్మాన్ అందించిన నేపథ్య సంగీతమంతా ఒక ఎత్తు…
ఈ క్లైమాక్స్ సన్నివేశానికి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఒక ఎత్తు
ఏ మాత్రం వాయిద్యాల హోరు లేకుండా, సన్నగా, లీలగా సాగే సన్నటి సంగీతం.
గుండెలను పిండేసేలా వచ్చే కోరస్ సంగీతం ప్రేక్షకుడి గుండెను బరువెక్కించి కంటతడమి చేస్తాయి
మణిరత్నం దీన్ని ఎంత జాగ్రత్తగా చిత్రీకరించారంటే
ఒక కుంచె పట్టుకుని శ్రద్దగా ఒక బొమ్మను గీసినంత శ్రద్ధగా తీశారు.
14 నిమిషాల నిడివిగల క్లైమాక్స్ లో ఆ బిడ్డ తన తల్లిని 12వ నిమిషం వద్ద మాత్రమే అమ్మా అని పిలుస్తుంది.
ఒకవేళ అంతకంటే ముందుగానే
ఆ అమ్మాయి తన తల్లిని అమ్మా అని పిలిస్తే ఏమవుతుంది
ఏమవుతుంది…అదో మామూలు మూస సినిమా అవుతుంది..
ఇన్నేళ్ల తర్వాత కూడా చర్చించుకునే అవసరం లేని చెత్త సినిమా అవుతుంది..
మణిరత్నంకు అలాంటి చెత్త సినిమాలు తీయడం తెలీదు.
అమృత ను వెండితెరపై ఒక అమృత కళశంగా నిలబెట్టాడు…
వెండితెర ఉన్నంతకాలం ఈ సినిమా…
ప్రత్యేకించీ ఈ క్లైమాక్స్ వెలుగులీనుతూనే ఉంటుంది. .
-ఎ. కిశోర్‌బాబు
విజయవాడ
Share this Article