Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆడదేహపు అత్తరు… శవసువాసన… ఈ పదాల్లాగే ఓ అబ్సర్డ్ సినిమా…

February 16, 2025 by M S R

.

Ashok Kumar Vemulapalli ….. పర్ ఫ్యూమ్ (…శవసువాసన) …. ఎంతోమంది అమ్మాయిలను హత్య చేసిన హంతకుడిని బహిరంగంగా ఉరి తీయడానికి సైనికులు తీసుకొస్తారు. అతని ఉరిని చూడడానికి చుట్టూ వందలమంది జనం..

న్యాయమూర్తి ఆదేశాలతో అతన్ని ఉరితీసే ప్రక్రియ ప్రారంభించగానే అతను తన జేబులోంచి కర్చీఫ్ బయటకు తీశాడు. అది మామూలు కర్చీఫ్ కాదు.. పర్ ఫ్యూమ్ పూసిన కర్చీఫ్.. దాన్ని జనాలకు చూపిస్తూ.. గాల్లోకి జనాల మీదికి విసురుతాడు..

Ads

ఆ కర్చీఫ్ నుంచి వచ్చిన సువాసన గాల్లో కలిసి జనాలందరి నాసికలకు తగులుతుంది.. అంతే వారందరిలోనూ కామోద్రేకం పెరుగుతుంది.. అక్కడ అతన్ని ఉరితీయమని ఆదేశించిన జడ్జిది అదే పరిస్థితి.. ఆడ, మగా అందరూ కామోద్రేకంతో అసలు తాము ఏం చేస్తున్నారో తెలీని స్థితిలో ఉంటారు..

అసలు ఉరికంబం మీద ఉన్న ముద్దాయి అలా నడుచుకుంటూ నవ్వుకుంటూ వెళ్లిపోతాడు.. అది అతని కర్చీఫ్‌లో ఉన్న పర్ ఫ్యూమ్ మ్యాజిక్ అది.. ఆ పర్ ఫ్యూమ్‌ని స్వయంగా తానే తయారు చేశాడు.. అది కూడా ఆడవారి శరీరాలతో..!!

అవును, యవ్వనంలో ఉన్న యువతులని కిడ్నాప్ చేసి వారిని చంపి.. వారి శరీరాలకు కొవ్వు పూసి కొద్దిరోజుల పాటు ఉంచి.. ఆ తర్వాత ఆ కొవ్వు మొత్తాన్ని అమ్మాయి శరీరం నుంచి తొలగించి.. దాన్ని వేడి చేసి వచ్చే ఆవిరి నుంచి తీసిందే ఈ పర్ ఫ్యూమ్.. ఇదే దర్శకుడు టాం టిక్వర్ తీసిన “పర్ఫ్యూం” అనే పూర్తి నిడివి జర్మన్ సినిమా..

పేట్రిక్ సుస్కిండ్ రాసిన జర్మన్ నవల “పర్వ్యూం” ఆధారంగా తీసినది.. చాలా ఏళ్ల క్రితం వచ్చిందీ పర్ ఫ్యూమ్ సినిమా.. ఒక విధంగా క్రైమ్ సినిమా.. ఇంకో విధంగా సైకిక్ సినిమా..ద ర్శకుడు ఎంచుకున్న కథాంశం, తీసిన విధానం నిజంగా సినిమా లవర్స్‌కి అద్భుతంగా అనిపిస్తుంది. మిగిలిన వాళ్లకి ఈ సినిమా నచ్చకపోవచ్చు..

నిజానికి ఇందులో హీరో పాత్రధారి (నిజానికి అతన్ని హీరో అనకూడదు).. పుట్టుక నుంచి సినిమా ప్రారంభమవుతుంది.. ఆ సీన్ ఎంతలా ఉంటుందంటే.. బహుశా ఆ తర్వాత వచ్చిన ఎన్నో సినిమాలకు ఇది ఇన్‌స్పిరేషన్ అయ్యి ఉండొచ్చు.

పద్దెనిమిదో శతాబ్దంలో ఫ్రాన్స్‌లో.. ఒక రద్దీగా వున్న, బురదగా వున్న చేపల మార్కెట్ నుంచి సినిమా ప్రారంభమవుతుంది.. అక్కడో గర్భవతి చేపలు అమ్మడానికి నిలబడి ఉంటుంది.. అంతలోనే ఆమెకు పురుటి నొప్పులు రావడంతో వెనుక గదిలోకి వెళ్లి అక్కడే పిల్లవాడిని కని.. తానే బొడ్డుతాడు కోసి, ఆ పసిగుడ్డును అక్కడే బురదలో వదిలేస్తుంది..

ఎందుకంటే, ఆవిడకు అంతకుముందు చాలామంది పిల్లలు పుట్టీపుట్టగానే చనిపోయారు.. ఈ బిడ్డ కూడా అలాగే చనిపోయాడనుకుని అక్కడే వదిలేస్తుంది. కాసేపటికి ఆ బిడ్డ నుంచికేర్ మని ఏడుపు వినిపిస్తే జనం లోపలికి వెళ్లి, ఆ పసిగుడ్డును చూసి, ఆమె తన బిడ్డను అలా చనిపోవడానికే వదిలేసిందని తీర్మానించి, ఆమెను పోలీసులకు అప్పజెప్పుతారు. ఆమెకు ఉరిశిక్ష పడుతుంది.

ఇక పుట్టిన ఆ బిడ్డ కనులు తెరిచి చూస్తూ చుట్టూ చేపల కంపుతో.. అత్యంత దారుణంగా ఉన్న బురద నుంచి వచ్చే మురుగు వాసనని ముక్కుతో పీలుస్తాడు. అతనికున్న ప్రత్యేకత అది.. అందరి మాదిరిగా కాకుండా అతని ముక్కు ప్రత్యేకతను కలిగి ఉంటుంది.. తర్వాత అనాథ శరణాలయానికి ఆ పసిబిడ్డను చేరుస్తారు..

అక్కడ కొద్దిగా పెరిగాక తోటి విద్యార్థులు అతన్ని చంపడానికి ట్రై చేస్తారు. కానీ వాడు చావడు.. అతను కాస్త పెద్దయ్యాక హోంలో చోటు లేదని అతన్ని ఒక చర్మకారునికి అమ్మేస్తారు. భయంకరమైన వాసనలు కలిగిన ఆ కర్మాగారంలో ఎవరూ ఎక్కువ బతకలేదు. ఈ కుర్రాడు జోఁ బేటిస్త గ్రేనవిల్ (బెన్ విషా) మాత్రం ఆ వాసనల్ని ఎంజాయ్ చేస్తాడు..

ఒక అందమైన పడుచు పిల్ల ఏవో పళ్ళు అమ్ముతూ వెళ్తుంటే ఆకర్షితుడై, రూపానికి కాదు, ఆమె పరిమళానికి, ఆమె వెంట వెళ్తాడు. ఆ పరిమళం అతన్ని ఎంత ఉన్మాదిని చేస్తుందంటే ఆమె వొళ్ళంతా వాసన చూడటానికి వేరే మార్గం లేక ఆమెను చంపేస్తాడు. తర్వాత బాల్టిని అనే పర్ ఫ్యూమ్ తయారు చేసే వ్యక్తి దగ్గర చేరి అద్భుతమైన సెంట్లను తయారు చేస్తాడు.. అక్కడే అతనికి పర్ ఫ్యూమ్ తయారు చేయడంపై గ్రిప్ పెరుగుతుంది.. తనకు మాత్రమే ప్రత్యేకమైన ముక్కుతో సువాసనల్ని పసిగట్టగలిగే అతని గుణంతో ఇది సాధ్యమవుతుంది.

డిస్టిలేషన్ కాకుండా వేరే పధ్ధతుల్లో సెంట్ తీయవచ్చా? సెంట్‌ను ఎక్కువకాలం భద్రపరిచేదెలా? ఇలాంటి సమస్యలు గ్రానువిల్‌వి. ఇవన్నీ తెలుసుకోవడానికి ఫ్రాన్స్‌లోని గ్రాస్ అనే ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ ఒక మహిళ నడుపుతున్న సెంట్ ఫేక్టరీలో పనికి కుదురుతాడు.

కొన్నాళ్ళకి వూరంతా భయాందోళనలకు గురవుతుంది. అందమైన కన్నె పిల్లలు మాయమవుతున్నారు, ఆ తర్వాత వాళ్ళ నగ్న దేహాలు నదిలోనో, వీధిలోనో దొరుకుతున్నాయి.. ఇక్కడి నుంచి సినిమా మరో మలుపు తిరుగుతుంది..

ఆ హత్యలన్నీ చేసింది సదరు హీరోగా భావింపబడే గ్రేనియల్.. కేవలం సెంట్ తయారు చేయడానికే.. ఇలా అందమైన అమ్మాయిలను కిడ్నాప్ చేసి చంపేసి వారి మృతదేహాలకు కొవ్వు పూసి నిల్వ ఉంచి.. అమ్మాయిల శరీరంపై నిల్వ ఉంచిన కొవ్వును వేడి చేసి వచ్చే ఆవిరితో రకరకాల సెంట్లను తయారు చేశాడు.

కానీ తృప్తి కలగడం లేదు. ఇంతకన్నా ఏదో గొప్ప పర్ ఫ్యూమ్ తయారు చేయాలి.. ఆ పర్ ఫ్యూమ్‌తో ఈ లోకం మొత్తాన్ని తన వశం చేసుకోవాలి.. తాను తయారు చేసిన సెంట్ వాసన పీలిస్తే ఎంతటివారైనా ఎంతమందైనా తాను చెప్పింది చేయాల్సిందే.. ఇది ఒక విధంగా మాయా పర్ ఫ్యూమ్.. అందుకనే అమ్మాయిల శవాలతో సెంట్ తయారు చేస్తూనే ఉంటాడు..

ఒక అందమైన అమ్మాయి తన కుక్కపిల్లను తీసుకుని వీధుల్లోంచి నడుచుకుంటూ వెళ్తుంటే ఆమెను కిడ్నాప్ చేసి, హత్య చేసి, ఆమె శరీరంపై కొవ్వు పూసి, పైన గుడ్డ కప్పి తన గదిలో దాస్తాడు.. రెండ్రోజుల తర్వాత ఆమె శరీరంపై ఉన్న కొవ్వును తీసి, వేడి చేసి దానితో పర్ ఫ్యూమ్ తయారు చేస్తాడు.. అది ఒక విధంగా వశీకరణసెంట్ అన్నమాట..

అది ఎంతలా పని చేస్తుందంటే.. ఆ సెంట్‌ను తన ఒంటిపై పూసుకుంటే.. చనిపోయిన యువతి వెంట వచ్చిన కుక్క.. ఆ వాసన చూసి అతన్నే ఫాలో అవుతుంది. అతను చెప్పినట్టు చేస్తుంది.. అచ్చం చనిపోయిన తన యజమాని చెప్పినట్టుగా.. ఎందుకంటే ఆ కుక్క యజమాని అయిన ఆ అమ్మాయి శరీరంతో చేసిందే ఈ సెంట్ ..

ఆ తర్వాత కూడా చాలామంది అమ్మాయిలను చంపి వారి శరీరాలతో ఇలాగే సెంట్లు తయారు చేస్తాడు. చివరికి తాను అనుకున్న తాను కలలుకన్న అసలైన వశీకరణ సెంట్ తయారు చేస్తాడు. ఊళ్లో అమ్మాయిలంతా మాయం అవుతుండడం వారి నగ్న మృతదేహాలు దొరుకుతుండడంతో అలజడి మొదలవుతుంది..

చివరికి గ్రేనియల్ జనానికి దొరికి పోతాడు.. చితకబాదుతారు.. సైన్యం అతన్ని అదుపులోకి తీసుకుని విచారించి, అతనికి న్యాయస్థానం ఉరిశిక్ష విధిస్తుంది. అది కూడా జనాలందరూ చూస్తుండగా.. అతన్ని బహిరంగంగా ఉరి తీయాలనేది న్యాయమూర్తి ఆదేశం..

అదే క్రమంలో జనాలందరిముందూ అతన్ని నిల్చోబెట్టి.. ఉరి తీస్తుండగా తాను తయారు చేసిన సెంట్ బాటిల్ బయటకు తీసి కర్చీఫ్‌కు పూసి ఆ పర్ ఫ్యూమ్ వాసన మొత్తం జనాల ముక్కులకు తగలగానే.. వాళ్లంతా తెలీని మైకంలోకి, అది కూడా కామమైకంలోకి వెళ్లిపోతారు. అక్కడే బహిరంగంగా ఒకరితో మరొకరు సంభోగిస్తుంటారు. ఆఖరికి అతనికి ఉరి శిక్ష విధించిన జడ్జి, ఉరిశిక్ష అమలు చేయడానికొచ్చిన సైనికులు అందరూ అదే పని.. గ్రేనియల్ మాత్రం చాలా కూల్‌గా నవ్వుకుంటూ అలా అలా వెళ్లిపోతుంటాడు.

ఒక దశకు వచ్చాక తన జీవితం అంతా గుర్తొస్తుంది.. తన పుట్టుక, తాను పెరిగిన విధానం, తాను చేసిన హత్యలు, మొదట్లో తాను ఇష్టపడిన అమ్మాయిని తానే హత్యచేసిన వైనం.. అన్నీ గుర్తొస్తుంటాయి.. తాను చేసిన తప్పులకు తానే సెల్ఫ్‌గా శిక్ష వేసుకోవాలనుకుంటాడు..

చేపల మార్కెట్లో బురదలో పుట్టిన అతను తిరిగి అక్కడికే వెళ్తాడు.. అక్కడ జనాలందరూ చూస్తుండగా తన ఒంటిపై తాను తయారు చేసిన పర్ ఫ్యూమ్ పూసుకుంటాడు.. ఆ సెంట్ వాసన అక్కడ రోడ్డు మీద వెళ్తున్న జనాలకు, కూర్చొన్న జనాలందరి ముక్కులను తాకుతుంది..

అంతే … ఏదో తెలీని మైకంలో.. వాళ్లంతా అతని చుట్టూ చేరతారు.. చేతులు పట్టుకుని కొందరు.. కాళ్లు పట్టుకుని కొందరు వాసన చూస్తుంటారు.. మొత్తంగా అందరూ అతని మీద పడి అతని శరీరాన్ని పీక్కు తింటారు.. అది అతను తన జీవితంలో చివరగా తయారు చేసిన అత్యంత ప్రమాదకమైన సెంట్.. అది ఎవరి శరీరంమీద పూసుకుంటారో ఆ శరీరాన్ని మిగిలిన జనం అంతా అలా పీక్కు తినాల్సిందే..

చివరికి అక్కడ అతని ఒంటిపై ఉన్న చిన్న గుడ్డముక్క తప్ప ఇంకేమీ మిగలదు.. దానితో సినిమా ముగిస్తాడు డైరెక్టర్ టాంట్వింకర్.. ఇదొక సైకిక్ సినిమానే.. ఒక విధంగా హీరోని సైకోగానే భావించాల్సి ఉంటుంది.. ఆ పాత్రలోబెన్ విషా నటన అంతా అలా ఉన్మాది మాదిరిగానే ఉంటుంది..

ఎప్పుడూ ఏదో మైకంలో ఉండే వ్యక్తిగా.. సువాసనను పసిగట్టగలిగే వ్యక్తిగా అతని నటన అద్భుతంగా ఉంటుంది.. ఇక తనను ఉరితీయడానికి తెచ్చినపుడు సీన్ మాత్రం సినిమా మొత్తానికి హైలెట్ అనే చెప్పాలి. వందలమందితో ఆ షాట్ షూట్ చేశారు…

(సున్నిత మనస్కులు ఈ సినిమా చూడొద్దు.. క్రైమ్, నగ్నత్వం రెండు ఉంటాయి.. కానీ సినిమా ముగిశాక ఏదో తెలీని మైకంలోకి మనం కూడా వెళ్లిపోతాం. నిజానికి అలాంటి పర్ ఫ్యూమ్‌లు ప్రపంచంలో ఎక్కడా లేవు.. కానీ నిజంగా ఉన్నాయేమోనని భయపడతాం, భ్రమపడతాం.. ఇలా పర్ ఫ్యూమ్‌తో ఎదుటివారిని కంట్రోల్ చేయొచ్చనేది కొత్త పాయింట్.. అలాగే అమ్మాయిల శరీరంపై కొవ్వు పూసి దానితో సెంట్ తయారు చేయడం మరో పాయింట్.. లాజిక్కులు వెతక్కుండా.. సినిమాను సినిమాగా చూస్తే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions