Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ వార్త చదువుతుంటే… నాలుగేళ్ల నాటి ఆ వెటర్నరీ డాక్టర్ల గోస యాదికొచ్చింది…

January 9, 2024 by M S R

ఒక వార్త… విషయం ఏమిటంటే..? తెలంగాణను నయా హైదరాబాద్ సంస్థానంలాగా, తను ఓ నయా నిజాం నవాబులాగా, ప్రగతిభవన్ ఒక నయా ఫలక్‌నామా ప్యాలెస్‌లాగా… అంతా నయా నయా రాజరికం నడిచింది కదా… ఆ ప్యాలెస్‌లో కుక్కల షెడ్డుకు 12 లక్షలు పెట్టారని ఆ వార్త… అంతేనా..? బ్యాడ్మింటన్ కోర్టుకు 2 కోట్లట, నిర్వహణకు 2.5 కోట్లట… ఆ ప్యాలెస్‌కు 60 కోట్ల ఖర్చు అంచనాలు వేస్తే చివరకు 200 కోట్లు పెట్టారట… ఇటలీ నుంచి 25 కోట్ల ఫర్నీచర్ తెప్పించారట…

ఇవి చదివేకొద్దీ నోరు అలా హాశ్చర్యంగా ఏమీ తెరుచుకోలేదు, ఎందుకంటే పెద్ద పెద్ద తిమింగిలాలే పోయాయి ఈ పిత్తబరిగెలు ఎంత..? అప్పట్లో దాశరథి అన్నట్టుగా… కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని, తీగలను తెంపి అగ్నిలో దింపినావు, నా తెలంగాణ కోటి రతనాల వీణ… ఇదీ పాలన, ఇదీ వైభోగం… అలాంటి ప్రగతిభవన్‌లో నాలుగు సౌధాలు… అదొక రాజకోట… మరి బాంబులన్నాడు, పేల్చాలన్నాడు, రేవంత్ ఏం చేశాడు అంటారా..? ఒకటి భట్టికి, మరొకటి సీతక్కకు, ఒకటి స్కిల్ డెవలప్‌మెంట్‌కు, ఇంకొకటి ప్రజావాణి ఫిర్యాదుల స్వీకరణ కేంద్రం… ఖతం…

kcr

Ads

సరే, సబ్జెక్టు డీవియేషన్ వద్దు గానీ… ఇక్కడ ఇట్టే మన దృష్టిని పట్టేసేది కుక్కల షెడ్డుకు 12 లక్షలు… అదీ పెద్ద విశేషమేమీ కాదు… వందల పోలీస్ బలగాలతో ట్రాఫిక్ అడ్జస్టుల దగ్గర నుంచి భవన్ కాపలా దాకా… అంత రక్షణ వ్యయం, బలగం ఉన్నప్పుడు కుక్కలు ఎందుకనేదీ ప్రశ్న కాదు… అవి పెంపుడు కుక్కలేమో… మరి రాజుగారి కుక్కలు అన్నాక ఆమాత్రం వైభోగం ఉండాలి కదా… స్టేటస్ మెయింటెనెన్స్ సమస్య అన్నమాట… ఇవి చదువుతుంటే ఒకప్పటి వార్త గుర్తొచ్చింది… సంక్షిప్తంగా చెప్పుకుందాం…

సెప్టెంబరు 10, 2019… ప్రగతిభవన్‌లోని ఒక పెంపుడుకుక్క… పేరు హస్కీ… మరణించింది… దాని వయస్సు 11 నెలలు… మరి రాజుగారి కుక్క మరణిస్తే ఎంత అరిష్టం, ఎంత నష్టం… రాజుగారికి మస్తు కోపమొచ్చింది… పోలీసులకు ఫిర్యాదు చేయబడింది… ఏమని..? ఏదో స్వల్ప అనారోగ్యం ఉంటే, దాన్ని బంజారాహిల్స్ వెటర్నరీ క్లినిక్‌లో చేర్చామనీ, కానీ డాక్టర్ రంజిత్, లక్ష్మిల నిర్లక్ష్యం, బాధ్యతారహిత వైద్యం కారణంగా హస్కీ కన్నుమూసిందని ఫిర్యాదు సారాంశం…

మరి రాజుగారి ఫిర్యాదు కదా… వెంటనే పూర్వాపరాలు, నిజానిజాలు అక్కర్లేకుండా పోలీసులు కేసు పెట్టేశారు… ఐపీసీ 429 సెక్షన్ 11 (4) పెట్టేశారు… క్షమార్హం గాని నేరంగా తేల్చేశారు… ఇది జంతువుల పట్ల క్రూరత్వానికి సంబంధించిన సెక్షన్… అప్పటి విపక్ష నేతలు దొరవారి దోస్తులే కదా, ఎవరూ మాట్లాడలేదు, మీడియా ఎలాగూ పెద్ద సారు పాదాల దగ్గర పాకేవే కదా… అమాయకులైన వెటర్నరీ డాక్టర్లకు సపోర్టే దొరకలేదు… చివరకు ఇండియన్ వెటర్నరీ అసోసియేషన్ తమ డాక్టర్లకు సపోర్టుగా వచ్చి, కేసీయార్‌కు ఓ లేఖ రాసింది…

పెంపుడుకుక్క మరణంపై పశువైద్యులపై పెట్టిన క్రిమినల్ కేసును ఎత్తేయాల్సిందిగా కోరింది… పోస్ట్‌మార్టం చేయిస్తే సహజమైన అనారోగ్యంతో అది మరణించింది తప్ప వైద్యుల నిర్లక్ష్యం ఏమీ లేదని చెప్పింది… దీన్నిలాగే గోకితే జాతీయ స్థాయిలో బదనాం అవుతామని అనుకున్నారో ఏమో కేసు వాపస్‌కు నిర్ణయం జరిగిపోయింది… కేసు ఉపసంహరించుకుంటున్నట్టు స్థానిక కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు… అలా ఆ డాక్టర్లు బతికిపోయారు… సో, కుక్కల షెడ్డుకు 12 లక్షలు ఖర్చు చేశారంటే పెద్ద వింతేం ఉంది… బ్యాడ్మింటన్ కోర్టుకు 2 కోట్లు, నిర్వహణకు 2.5 కోట్లు కూడా సహజమే… అక్కడ బంగారు బ్యాట్లతో వెండి బంతులతో ఆడేవారేమో…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions