ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వాలట… బీజేపీ అరివీర భీకర డిమాండ్ అట… ఎందుకు..? కేసు మన చేతుల్లోకి వస్తుంది కాబట్టి… రేవంత్ పాత కేసీయార్ బాగోతాలన్నీ తవ్వుతూ, ఎక్కడేం జరిగిందో చెబుతుంటే, సీబీఐకి ఇవ్వాలి, సీబీఐకి ఇవ్వాలనే ఓ తర్కరహిత డిమాండ్ తప్ప బీజేపీ నుంచి వేరే స్పందనే కనిపించదు…
చాలా విచిత్రమైన రాష్ట్ర నాయకులు… ఒకవైపు కేసీయార్ యాంటీ బీజేపీ కూటమికి డబ్బులిస్తుంటాడు, ఇటు కవితను కాపాడుకోవడానికి ఏకంగా బీజేపీ కేంద్ర నాయకులనే బుక్ చేసి అరెస్టు చేసి తీసుకురమ్మని ప్రత్యేక విమానాల్లో పోలీసులను పంపిస్తుంటాడు… రామజన్మభూమి, శూర్పణఖ జన్మభూమి అని ఎద్దేవా చేస్తుంటాడు… మోడీని బూతులు తిడుతుంటాడు…
ఐనా ఇన్నేళ్లుగా సోయి లేదు, స్టేట్ బీజేపీకి… సోయికన్నా మరో పదం వాడితే బెటరేమో… ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు వివరాలు బయటపడుతూ ఉంటే సెంట్రల్ ఇంటలిజెన్స్‌కు చురుకుపట్టి ఆరాలు తీస్తోందట, సీబీఐకి ఇవ్వాలట… నిఘా, ట్యాపింగ్ పరికరాలు ఎక్కడ కొన్నారు, అనుమతులు తీసుకున్నారా వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుంటారట ఇంటలిజెన్స్ అధికారులు…
Ads
ఒకవైపు జడ్జిల ఫోన్లను కూడా ట్యాప్ చేశారంటే… ఫోన్ కాల్స్ రికార్డు చేసి నానా అరాచకాలకూ పాల్పడుతుంటే… సెంట్రల్ బీజేపీ నేతల మీదే కుట్రలు సాగుతుంటే… మరి సెంట్రల్ ఇంటలిజెన్స్ ఇన్నేళ్లూ ఏం చేసిందట..? ఇన్నేళ్లూ ఏమీ తెలుసుకోలేని వైఫల్యం నిజమే అయితే వీళ్ల నుంచి దేశరక్షణ ఎలా ఊహించేది..?
పెగాసస్ వంటి ఇజ్రాయిలీ ట్యాపింగ్ పరికరాల్ని, సాఫ్ట్‌వేర్‌ను బీజేపీయే ప్రయోగిస్తుందనేది ఆరోపణ… అది కాకపోతే మరొకటి… ప్రతి రాష్ట్రమూ, కేంద్రం అధికారికంగానో, అనధికారికంగానే తమంటే పడనివాళ్ల ఫోన్లను ట్యాప్ చేస్తుంది, రికార్డ్ చేస్తుంది, అవసరమైతే హ్యాక్ చేస్తుంది… ఇవన్నీ కేంద్రంలోని ఐబీ, రా, మిలిటరీ ఇంటలిజెన్స్ వంటి వ్యవస్థలకు తెలియవా..?
ఇజ్రాయిలీ టెక్నాలజీ, పరికరాల కొనుగోలు కేసే కదా అక్కడి ఏబీ వెంకటేశ్వరరావును బలి తీసుకుంది… కేసీయార్ అంతకుమించిన హైఎండ్ ట్యాపింగ్ వ్యవస్థను వాడుతున్న విషయం ఇన్నేళ్లూ ఇక్కడ బీజేపీ వాళ్లకు తెలియదా…? ఇప్పుడు ఏదో కొత్తగా తెలిసినట్టు డిమాండ్లు, ప్రకటనలు…
అన్ని రాష్ట్రాల నేతలకు, జడ్జిలకు, సీఎంలకు, కీలకమైన పదవుల్లో ఉన్నవాళ్లందరికీ ఎమ్మెల్యేల కొనుగోలు వీడియోలు పంపించినప్పుడు కూడా కేసీయార్ ఏం చేస్తున్నాడో తెలియనంత అజ్ఞానంలో ఉండిపోయిందా బీజేపీ..? ఇవన్నీ జనం కళ్లుగప్పడానికి… ఏదో మాయ… ఈరోజుకూ కేసీయార్ రహస్య స్నేహితులదే కదా హవా… మద్యం స్కాం కేసు నమోదు నుంచి కవిత అరెస్టు దాకా, సగటు పార్టీ కార్యకర్తకు కూడా అర్థం కాని ఏదో పిచ్చి వ్యూహం, పిచ్చి అడుగులు…
ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్రం సీరియస్ అనే వార్త చదివాక ఇదంతా గుర్తొచ్చింది… పోనీ, రేవంత్ సర్కారేమైనా సీరియస్ ఎఫర్ట్ స్టార్ట్ చేసిందా..? అదీ లేదు… నిజానికి కేసీయార్ అడ్డగోలుగా పసాయించే స్కోపున్న కేసు అది… అందుకే నాకేం తెలుసు, నాకేం సంబంధం అని మాట్లాడుతున్నాడు…
ఒకవైపు విద్యుత్తు, విత్తనాలు, రాష్ట్ర గీతం, చిహ్నాల మీద బీఆర్ఎస్ గాయిగత్తర లేపుతూ పుంజుకుంటోంది… జనంలోకి వెళ్తోంది… చంపేసుకున్న తెలంగాణ ఆత్మను మళ్లీ ఆవాహన చేసుకునే ప్రయత్నం చేస్తోంది… ఖచ్చితంగా బీఆర్ఎస్ రియాక్టివేట్ మోడ్‌లోకి వచ్చింది… కానీ రేవంత్ సర్కారు చేతిలో ఉన్న ఆయుధాల్ని కూడా దాచుకుని, చోద్యం చూస్తోంది…
Share this Article