Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తల్లీ రాముడు వదిలిన బాణం నేను… హనుమ ప్రయోగించిన ఆ యాస…

March 29, 2023 by M S R

హనుమ వినయం

రాముడు వదిలిన బాణం నేను

పిబరే రామరసం-1

Ads

“జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహా బలః,
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః,
దాసోహం కౌసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః,
హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః,
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్,
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రహః,
అర్ధ ఇత్వామ్ పురీం లంకాం అభివాద్యచ మైథిలీమ్,
సమృద్ధార్థో గమిష్యామి మిహతామ్ సర్వ రాక్షసాం”

వాల్మీకి రామాయణంలో సుందరకాండలో శ్లోకాలివి. చాలా ప్రసిద్ధం. మాలా మంత్రంగా అంటే జపం, పారాయణం చేసుకోదగ్గ మంత్రాలుగా వ్యాప్తిలో ఉన్నవి.

సందర్భం:-
సీతాన్వేషణలో భాగంగా హనుమంతుడు వంద యోజనాల సముద్రం దాటి లంకలో దిగుతాడు. ఒక్క అంగుళం వదలకుండా అంతా వెతుకుతాడు. కానీ, సీతమ్మ జాడ దొరకదు. అలసిపోతాడు. నిరాశపడతాడు. జటాయువు సోదరుడు సంపాతి సరిగ్గానే చూసి చెప్పాడు కదా? తీరా ఇంత దూరం వచ్చాక సీతమ్మ కనపడడం లేదేమిటి అని బాధపడతాడు. నైరాశ్యం నుండి బయటపడడానికి ఒక ఎత్తయిన పర్వతం ఎక్కి, గట్టిగా ఊపిరి పీల్చుకుని, ప్రశాంత చిత్తంతో రాముడిని, లక్ష్మణుడిని, సుగ్రీవుడిని, సీతమ్మను తలచుకుని మళ్లీ సీతాన్వేషణకు బయలుదేరతాడు. ఆ క్షణంలో ఈ ధ్యాన శ్లోకాలు పూర్తి కాగానే దూరంగా అశోక వనం, అందులో ఒక చెట్టు కింద సీతమ్మ కనపడుతుంది. ఏ కష్టమయినా తొలగిపోవాలంటే ఈ జయత్యతి బలో రామో పఠించాలని అప్పటినుండి ఆచారంగా మారింది.

అర్థం:-
బలవంతుడయిన శ్రీరాముడికి సదా జయం. పరాక్రమశాలి అయిన లక్ష్మణుడికి జయం. శ్రీరాముడికి విధేయుడై, కిష్కింధకు ప్రభువయిన సుగ్రీవుడికి జయం. అసహాయ శూరుడు, కోసల రాజ్యాధిపతి అయిన రాముడికి నేను బంటును. వాయుపుత్రుడిని. నా పేరు హనుమ.

శత్రు సైన్యాలను నామరూపాల్లేకుండా చేస్తాను. ఒకడేమిటి? వెయ్యిమంది రావణులు కలిసి ఒకేసారి వచ్చినా ఓడిస్తాను. రాళ్లతో, చెట్లతో రాక్షసులను మట్టికరిపిస్తాను. లంకానగరాన్ని నాశనం చేస్తాను. రాక్షసులు మౌన ప్రేక్షకులుగా చూస్తూ ఉండగా వచ్చినపని ముగించుకుని సీతమ్మను దర్శించి, నమస్కరించుకుని వచ్చినదారినే వెళ్ళిపోతాను.

మొత్తం రామాయణంలోనే హనుమ చెప్పే ఈ మాటలు చాలా గొప్పవిగా, ప్రభావవంతమయినవిగా ఆధ్యాత్మివేత్తలు చెబుతారు. నేను అంత, నేను ఇంత అని హనుమ ఎక్కడా చెప్పుకోలేదు. బయలుదేరడానికి ముందే యథా వినిర్ముక్తస్య రాఘవ బాణం . . . అని రాముడు వదిలిన బాణంలా వెళ్లివస్తాను అని క్రెడిట్ అంతా రాముడికే ఇచ్చాడు. వంద యోజనాల దూరం దాటి లంకలో ల్యాండ్ అయ్యాక హనుమ నుదుటిమీద చెమటచుక్కకూడా పట్టలేదన్నాడు వాల్మీకి. గోష్పదీ కృత వారాశీమ్ . . . ఆవు కాలి గిట్ట చేసిన గుంత దాటినంత అవలీలగా హనుమ సముద్రం దాటాడట.

రాముడు చాలా గొప్పవాడు, లక్ష్మణుడు పరాక్రమశాలి. మా ప్రభువు మంచివాడు. సీతమ్మకు నమస్కారం. ఇలాంటివారి నీడలో రాముడి బంటునయిన నాకు పరాజయం ఎందుకుంటుంది? లంకలో ఒక్కొక్కరిని ఆడుకుంటాను- అని తనబలం తనుకాదు, తన వెనకున్నవారే అని నమ్మకంగా, వినయంగా చెప్పుకున్నాడు. భాషలో, భావంలో వాల్మీకి ప్రయోగాలు, చమత్కారాలు చెప్పీ చెప్పకుండా ఉంటాయి. మొదటి మాట జయతి- అంటే ఎప్పటికీ జయం కలుగుతూనే ఉంటుంది అని. Present perfect continuous tense వాడాడు. అలాగే అందరూ గొప్పవాళ్లే అయినా – రామస్య క్లిష్ట కర్మణః అన్నాడు. చాలా కష్టమయినపనులను అవలీలగా, హేలగా, సునాయాసంగా చేసే రాముడట. అలాంటి రాముడి బంటునయిన నాకు ఎదురేముంది? అని తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు. ఉత్సాహం నింపుకున్నాడు. కార్యం సాధించాడు. తోకకు నిప్పుపెడితే లంకను కాల్చి, సముద్రంలో తోకను చల్లబరుచుకున్నాడు. ఈ సందర్భంలో పుట్టిందే – చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్లు – సామెత.

హనుమ విశ్రాంతి తీసుకుని- జయత్యతి బలో రామో – అని ధ్యానించిన ఎత్తయిన కొండ ఇదే అని శ్రీలంక పర్యటనలో నువార ఎలియా నుండి క్యాండీ పట్టణానికి వెళ్లే మార్గమధ్యంలో మాకు చూపించారు. చిన్మయ మిషన్ వారు ఈ కొండమీద పెద్ద హనుమ విగ్రహం ప్రతిష్ఠించి గుడి కట్టారు.
జయత్యతి బలో రామో చదువుకుని మా కష్టాలు, అడ్డంకులు తొలగించు స్వామీ! అని నమస్కారం పెట్టుకుని కొలొంబో దారి పట్టాము.

హనుమంతుడి మాటల నేర్పు

ఎక్కడ , ఎవరితో , ఏమి , ఎలా , ఎందుకు మాట్లాడుతున్నామో స్పృహ కలిగి ఉండడం చాలా అవసరం. రామాయణమంతా వేద సారం. మంత్రమయం. అందులో సుందరకాండ మరీ ప్రత్యేకం.

హనుమ నవ వ్యాకరణ పండితుడు . సూర్యుడి దగ్గర శిష్యరికం చేసినవాడు . తపస్వి . సుగ్రీవుడి మంత్రి . భక్తుడు . సేవకుడు . రాయబారి . కార్యసాధకుడు . యోధుడు . పరాక్రమశాలి . అన్నిటికీ మించి వినయ సంపన్నుడు . గొప్ప వాక్కు అలంకారంగా కలిగినవాడు – వాగ్విదాం వరం – అని వాల్మీకి పొంగిపోయాడు .

పదినెలల అశోకవనవాసం సీతమ్మను ఎంత కుంగదీసిందంటే – హనుమ రావడం రెండు నిముషాలు ఆలస్యమయితే ఆత్మహత్య చేసుకునేది . అలాంటి సంక్షుభిత ఉద్విగ్న సమయాల్లో హనుమ మాట్లాడిన తీరు అనన్యసామాన్యం . బహుశా అలా మాట్లాడాలంటే దేవుడే దిగి రావాలి .

తెల్లవారక ముందే రావణుడు వచ్చి నానా మాటలు అని వెళ్ళాడు . పక్కనే నరమాంస భక్షకులయిన ఆడ రాక్షసుల గుండెలు గుచ్చుకునే మాటలు మరో వైపు .

ఇంతదాకా సంస్కృతంలో రావణుడు అఘోరించి వెళ్ళాడు – కాబట్టి సంస్కృతంలో మాట్లాడితే మళ్ళీ రావణుడి మాయలే అనుకుంటుంది . అనేక భాషలు తెలిసినవాడే భాష ఎంపిక గురించి ఆలోచించగలడు . సీతమ్మ సొంత ఊరు మిథిలా నగరవాసులు అయోధ్యలో మాట్లాడే ప్రాకృత అవధి భాషలో వారి యాసతోనే మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు . అంటే సీతమ్మ మెట్టినింటి భాష నేర్చుకుంది . కానీ మిథిల యాస పోలేదు. ఒకరకంగా తమిళనాడులో స్థిరపడ్డ తెలుగువారు మనం కనిపిస్తే తమిళయాసలో తెలుగు మాట్లాడినట్లు అనుకోవచ్చు . పూర్తిగా మన ఊరివారెవరో మాట్లాడుతున్నారని మొదటి మాటకే ఆమె ఉపశమనం పొందాలి . ఆతరువాత ఏమి చెబితే ఆమె ఇంకా నమ్ముతుంది ? శాంతిస్తుంది ? రామకథనే ఎంచుకున్నాడు . అంతే తన మాండలికంలో రామకథను వినగానే సీతమ్మకు పోయిన ప్రాణం తిరిగివచ్చింది .

క్షేమంగా ఉన్న రాముడు నీ క్షేమం అడగమన్నాడు – అన్నాడు హనుమ . అంటే ఆమె అడగకుండానే రాముడు క్షేమంగా ఉన్నాడని , ఆయనే తనను పంపాడని విన్నవించాడు . నువ్వెక్కడున్నావో తెలిసింది ఇక వెంటనే రాముడు వస్తాడు – అని అభయమిచ్చాడు .

ఏమో నువ్వంటే రాగలిగావు కానీ , ఇంత దూరం , ఇంత దుర్భేద్యమయిన లంక – అని సీతమ్మ నిట్టూరుస్తుంది .
తల్లీ పోస్టు మ్యాన్ పనికి అందరిలోకి చిన్నవాడిని , ఏమీ చేతగానివాడిని ఎంపిక చేస్తారు . అలా నన్ను నీ దగ్గరికి పంపారు . మా సుగ్రీవుడి దగ్గర అందరూ నాకంటే గొప్పవారు , నాతో సమానులే ఉన్నారు తల్లీ – సందేహించకు అని వినయంగా వివరణ ఇచ్చాడు . ఆపై రాముడి ఉంగరమిచ్చాడు . ఆమె శిరసు మాణిక్యం తీసుకున్నాడు . మిగిలిన కథ తెలిసిందే .
———-

హనుమ స్థానంలో మనం ఉంటే – అవునమ్మా రాముడు సుగ్రీవులకు చేతకాక నన్ను పంపారు . అబ్బో ఎంత శ్రమ పడ్డానో నిన్ను కనుక్కోవడానికి , అలసిపోయాను ఒక గ్లాసు కాఫీ ఇవ్వు తల్లీ అర్జంటుగా – అంటాం .
గోష్పదీ కృత వారాశిమ్ – వంద యోజనాలు దాటాక ఆవు కాలి గిట్ట చేసిన చిన్న గుంత దాటినంత సునాయాసంగా ఉన్నాడు హనుమ . కనీసం ఆయన నుదిటి మీద చెమట బిందువు కూడా లేదన్నాడు వాల్మీకి . ఎందుకంటే యథావినిర్ముక్తస్య రాఘవ – అంటూ రాముడు వదిలిన బాణంలా నేను లంకకు వెళుతున్నాను అనుకున్నాడు హనుమ . బాణం బాగా వేశారు అంటారు కానీ , బాణం బాగా పడింది అని ఎవరూ అనరు .

వినయం విజ్ఞానం –
అవినయం అంధకారం, అహంకారం .

-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions