రాముడయినా వినాల్సింది రామకథే
అంతా రామమయం
మన బతుకంతా రామమయం
పిబరే రామరసం-2
Ads
ఒక దేశానికి , జాతికి సొంతమయిన గ్రంథాలు ఉంటాయి . మనకు అలాంటిది రామాయణం . ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ రాముడు మనవెంట నడిచిన దేవుడు . మనం విలువల్లో , వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన ఆదర్శ పురుషుడు . మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన అద్దం రాముడు . ధర్మం పోత పోస్తే రాముడు . ఆదర్శాలు రూపుకడితే రాముడు . అందం పోగుపోస్తే రాముడు . ఆనందం నడిస్తే రాముడు . వేదోపనిషత్తులకు అర్థం రాముడు . మంత్రమూర్తి రాముడు . పరబ్రహ్మం రాముడు . లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు రాముడు .
ఎప్పటి త్రేతా యుగ రాముడు ? ఎన్ని యుగాలు దొర్లిపోయాయి ? అయినా మన మాటల్లో , చేతల్లో , ఆలోచనల్లో అడుగడుగడుగునా రాముడే .
చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట – శ్రీరామరక్ష సర్వజగద్రక్ష . బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన పాట – రమాలాలి – మేఘశ్యామా లాలి . మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు – శ్రీరామ రక్ష – సర్వ జగద్రక్ష . మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట – అయ్యో రామా . వినకూడని మాట వింటే అనాల్సిన మాట – రామ రామ . భరించలేని కష్టానికి పర్యాయపదం – రాముడి కష్టం . తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే – రాముడు . కష్టం గట్టెక్కే తారక మంత్రం – శ్రీరామ . విష్ణుసహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట – శ్రీరామ శ్రీరామ శ్రీరామ . అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట – అన్నమో రామచంద్రా ! వయసుడిగిన వేళ అనాల్సిన మాట – కృష్ణా రామా !
తిరుగులేని మాటకు – రామబాణం . సకల సుఖశాంతులకు – రామరాజ్యం . ఆదర్శమయిన పాలనకు – రాముడి పాలన . ఆజానుబాహుడి పోలికకు – రాముడు . అన్నిప్రాణులను సమంగా చూసేవాడు – రాముడు .
రాముడు ఎప్పుడు మంచి బాలుడే . చివరకు ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా – రామా కిల్డ్ రావణ ; రావణ వాజ్ కిల్డ్ బై రామా .
ఆదర్శ దాంపత్యానికి – సీతారాములు . గొప్ప కొడుకు – రాముడు . అన్నదమ్ముల అనుబంధానికి – రామలక్ష్మణులు . గొప్ప విద్యార్ధి – రాముడు (వసిష్ఠ , విశ్వామిత్రులు చెప్పారు ) . మంచి మిత్రుడు – రాముడు (గుహుడు చెప్పాడు ). మంచి స్వామి రాముడు (హనుమ చెప్పారు ). సంగీత సారం రాముడు (రామదాసు , త్యాగయ్య చెప్పారు ). నాలుక మీదుగా తాగాల్సిన నామం రాముడు ( పిబరే రామ రసం – సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు ). కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం – రాముడు . నోరున్నందుకు పలకాల్సిన నామం – రాముడు . చెవులున్నందుకు వినాల్సిన కథ – రాముడు . చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు – రాముడు . జన్మ తరించడానికి – రాముడు , రాముడు , రాముడు .
రామాయణం పలుకుబళ్లు
మనం గమనించంగానీ , భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ , ప్రతిఫలిస్తూ , ప్రతిబింబిస్తూ ఉంటుంది . తెలుగులో కూడా అంతే .
ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే – రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని అడిగినట్లే ఉంటుంది . చెప్పడానికి వీలుకాకపోతే – అబ్బో అదొక రామాయణం . జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే – సుగ్రీవాజ్ఞ , లక్ష్మణ రేఖ . ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే – అదొక పుష్పకవిమానం . కబళించే చేతులు , చేష్ఠలు కబంధ హస్తాలు . వికారంగా ఉంటే – శూర్పణఖ . చూసిరమ్మంటే కాల్చి రావడం (హనుమ ). పెద్ద పెద్ద అడుగులు వేస్తే – అంగదుడి అంగలు .
మెలకువలేని నిద్ర – కుంభకర్ణ నిద్ర . పెద్ద ఇల్లు – లంకంత ఇల్లు . ఎంగిలిచేసి పెడితే – శబరి . ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే – ఋష్యశృంగుడు .అల్లరి మూకలకు నిలయం – కిష్కింధ కాండ . విషమ పరీక్షలన్నీ మనకు రోజూ – అగ్ని పరీక్షలే . పితూరీలు చెప్పేవారందరూ – మంథరలే . యుద్ధమంటే – రామరావణ యుద్ధమే . ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ – రావణ కాష్ఠాలే) కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది (ఇది విచిత్రమయిన ప్రయోగం ).
సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు .బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు . ఒక ఊళ్లో పడుకుని ఉంటారు . ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు . ఒక ఊళ్లో నీళ్లు తాగి ఉంటారు . ఒంటిమిట్టది ఒక కథ . భద్రాద్రిది ఒక కథ . అసలు రామాయణమే మన కథ . అది రాస్తే రామాయణం – చెబితే మహా భారతం .
-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com
9989090018
Share this Article