Plight-Flight: న్యూయార్క్ నుండి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఏది మూత్రశాలో? ఏది పొరుగు ప్రయాణికురాలి సీటో? తెలియనంతగా తప్ప తాగిన వ్యక్తి చేసిన పాడు పని గురించి ఇంగ్లీషు మీడియాలో చాలా చర్చ జరుగుతోంది. అంతర్జాతీయ విమాన ప్రయాణాల్లో మద్యం ఉచితం. అసలే గాల్లో తేలేవారికి…లిక్కర్ కిక్కు కూడా తోడయితే… ఇక చుక్కలు కూడా సిగ్గు పడాల్సిందే. బిజినెస్ క్లాస్ సీట్లలో తాగిన మత్తులో ఒళ్లు తెలియని ఒకానొక హై ప్రొఫైల్ ప్రయాణికుడు తోటి ప్రయాణికురాలి మీద మూత్రం పోశాడు.
ఈ సిగ్గుచేటు పని తరువాత అతడు విమానం దిగి బయటికి హాయిగా వెళ్లిపోతే… సామాజిక మాధ్యమాల్లో జనం దుమ్మెత్తి పోస్తే… అప్పుడు అరెస్ట్ చేశారు. ఎయిర్ ఇండియా అధిపతి కూడా వివరణ ఇచ్చుకున్నారు. తమ సిబ్బంది ఈ సందర్భానికి తగినట్లు వ్యవహరించలేదని క్షమాపణ చెప్పారు. వెంటనే ఆమెకు మార్చుకోవడానికి బట్టలు ఇచ్చామని… సిబ్బంది చెబుతున్నా… ఖాళీగా ఉన్న సీటుకు మార్చండి అని ఆమె ఎంతగా అభ్యర్థిస్తున్నా… పైలట్ అనుమతి కావాలి అని చాలాసేపు ఇబ్బంది పెట్టిన మాట నిజమని ప్రత్యక్షసాక్షి బహిరంగంగా మీడియాలో చెబుతున్నారు.
Ads
తప్పించుకుని బెంగళూరులో తలదాచుకున్న అతడిని చివరికి అరెస్ట్ చేశారు. బహుళ జాతి కంపెనీలో అతను చేస్తున్న ఉన్నతోద్యోగం ఊడిపోయింది. విమాన ప్రయాణాల్లో ఇలాంటి ఎన్నో ఉదంతాలు ఇప్పుడు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. రావాలి కూడా. జాతీయ మీడియాలో దీనిమీద చర్చోపచర్చలు జరుగుతున్నాయి. వాటి సారాంశం ఇది:-
1. ఒక భారతీయుడు మరో భారతీయురాలి మీద ఒక భారత విమానయానంలో మూత్రం పోశాడు కాబట్టి బతికిపోయాం. అదే ఒక భారతీయుడు ఒక ఫ్రాన్స్ మహిళ మీదో, ఒక పాకిస్థాన్ మహిళ మీదో మూత్రం పోసి ఉంటే… ఏమయ్యేదో ఊహించుకోండి. పోయకూడని చోట పోసిన ఒక మూత్రమే మూడో ప్రపంచ యుద్ధానికి అగ్గి రాజేసిన ఆత్రమయ్యేది.
2. విమానాల్లో ఉచితంగా మద్యం పోస్తారు కాబట్టి… లీటర్లకు లీటర్లు తాగేవారు… మూత్రం పోసుకోవడానికి వాష్ రూముల పక్కనే సీట్లు కేటాయించాలి.
3. చిన్న అలికిడిని కూడా పసిగట్టగలిగే సిసి కెమెరాలను సీట్ల మీద అమర్చి ఉంటారు కాబట్టి… ఇలాంటివారిని మానిటర్ చేయడానికి ప్రత్యేక ఏర్పాటు ఉండాలి.
4. సీటు బెల్ట్ పెట్టుకోమన్నందుకు, సీటు ముందుకు జరపమన్నందుకు, టేకాఫ్ ల్యాండింగ్ సమయాల్లో కిటికీ తెరవమన్నందుకు సిబ్బందితో గొడవపడే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలి. తప్పు రుజువయితే విమాన ప్రయాణాలకు అనర్హులుగా ప్రకటించాలి.
5. డిమాండును బట్టి ప్రయాణికులను పిండుకోవడానికి ఆరాటపడే విమానయాన సంస్థలు ప్రయాణికులకు సమస్యలు వచ్చినప్పుడు పట్టించుకోవడం లేదు.
6. ఇలాంటి నీచమయిన సందర్భాల్లో అయినా బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోకపోతే ప్రయాణికుల గౌరవానికి, ఆత్మాభిమానానికి విలువేముంటుంది?
7. దేశంలో పేరున్న సెలెబ్రిటీలు అంతర్జాతీయ విమాన యానాల్లో దేశం పరువును గాల్లో కలిపి… మన మానం గోచీ వస్త్రాన్ని అంతర్జాతీయ యవనికమీద ఆరేసిన వీడియోలను బయటపెట్టాలి.
8. ఏయే ఆంతర్జాతీయ విమానయాన సంస్థలు భారత్ ప్రయాణికులంటే భయపడి చస్తున్నాయో… సగటు భారతీయులు తలదించుకుని అయినా తెలుసుకోవాలి.
-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com
Share this Article