నిజంగా సాక్షిని చూస్తే జాలేస్తోంది… విపరీతంగా..! ఫాఫం జగన్ అనాలనిపిస్తోంది… తప్పేమీ లేదు… తెల్లారిలేస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, దుష్టచతుష్టయం, మన్నూమశానం, వీళ్ల దుంపతెగ, వీళ్లు నాశనమైపోను, ఈ మారీచ మీడియా భ్రష్టుపట్టిపోతే ఎంత బాగుండు అన్నట్టుగా తెగ శాపనార్థాలు పెడుతుంటాడు కదా… పాపం, కొన్ని విషయాల్లో ఈనాడుకన్నా ఘోరంగా తప్పులు చేసే తన సాక్షి పరిస్థితి ఏమిటో ఒక్కసారైనా ఆలోచించాడా..? అది ఏ దారిలో నడుస్తున్నదో సమీక్షించుకున్నాడా..? జనం ఎంత నవ్వుకుంటున్నారో అర్థమైందా..?
ఏపీలో ఎలాగూ డప్పు తప్పదు… కేసీయార్ కోసం తెలంగాణలో డబుల్ డప్పు తప్పదు… ఆ పొలిటికల్ లైన్ గురించి కాదు… పత్రిక ప్రొఫెషనల్ కేరక్టర్ గురించి..! ఒకప్పుడు ఛాందస, గ్రాంథిక భాషలో ఉండే పత్రికాభాషను వర్తమాన వ్యవహారంలోకి దింపిన ఈనాడు సగటు జనం ప్రశంసల్ని పొందింది… ఇప్పుడు అదే ఈనాడు క్షుద్ర అనువాద పదాలతో, తెలుగును ఖూనీ చేస్తూ, భాషను చిత్రవధ చేస్తున్నది… సగటు తెలుగు అభిమానికి ఆ బాధ ఎలాగూ ఉంది… ఈనాడు ఎలాగూ మారదు… తను చేసేదే కరెక్టు అనే ఓ అతిక్షుద్ర భావనల్లో బతికే పత్రిక అది…
మరి ఓ ఆల్టర్నేట్ వాయిస్‌గా జనంలోకి వచ్చిన సాక్షి కూడా అదే బాటలో ఎందుకు నడవాలి..? ఎందుకు నడుస్తోంది..? ఎందుకంటే..? దానికంటూ ఓ కేరక్టర్ లేదు గనుక… భాషను కుళ్లబొడవడంలో అది ఈనాడును మించిపోతున్నది గనుక… వ్యవహారిక భాష అంటే దానికి అర్థం తెలియదు గనుక… ఫాఫం జగన్ అనుకునే ఓ చిన్న ఉదాహరణ చూడండి…
Ads
ఈ బిట్‌ను కాస్త అర్థమయ్యేలా చెప్పేవాళ్లకు… తెలంగాణలో కష్టం గానీ, ఏపీలో ప్రత్యేక ప్రభుత్వ అవార్డులు ఇప్పించబడును… ఆ అభిసరణం ఏమిటో… అపసరణ ఏమిటో… ద్వీపవక్రతల సృష్టి ఏమిటో… పర్వతోద్భవనం ఏమిటో… అగ్నిపర్వత ప్రక్రియ అనగా ఏమిటో… సరిగ్గా వివరించగలిగితే… అవార్డులేం ఖర్మ… నేరుగా పీహెచ్‌డీ ఇచ్చేయవచ్చు…. పాపం శమించుగాక… భాషాహంతక ఈనాడు కూడా సిగ్గుపడేలా ఉంది… తనకు ఈ రేంజ్ హత్య చేతకానందుకు..!!
కాలం మారుతోంది… కడుపులు చేత్తో పట్టుకుని ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు వెళ్లిన కుటుంబాల పిల్లలకు తెలుగు రాదు, చదవడం రాదు, రాయడం రాదు… అసలు మాట్లాడటమే రాదు… ఇంగ్లిషు లిపిలో చదువుకుని కష్టమ్మీద అర్థం చేసుకుంటున్నారు… ఈ స్థితిలో తెలుగు భాషాపరిరక్షణ ఈ క్షుద్రత్వంతో కాదు… చాలా సరళీకృతం కావడం..! ఐనా ఇంత లోతుగా సమస్యను అర్థం చేసుకుని ఆచరణలో పెట్టే సోయి ఎక్కడిది..? ఎంతసేపూ యెల్లోమీడియాను తిట్టడం, జగన్ డప్పు కొట్టడం… ఇదేనా సాక్షి పుట్టుకకు పరమార్థం..!? సరే, అలాగే చేయనివ్వండి… మరి తెలుగును ఇలా కుళ్లబొడవడం దేనికి..? ఒక్కరైనా ఆలోచించేవాళ్లున్నారా అక్కడ..?! ఈ భాష పలకల అభిసరణం, అపసరణ గండాల నుంచి తెలుగును రక్షించు దేవుడా…!!
Share this Article