వివిధ పార్టీల నుంచి కేసీయార్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను లాగేసే క్రమంలో… ఎవరినిపడితే వారిని, చివరకు తెలంగాణ ద్రోహులుగా ముద్రపడిన వారిని కూడా తీసేసుకుంటున్న క్రమంలో… ఒకే మాటతో తనను సమర్థించుకునేవాడు… రాజకీయ శక్తుల పునరేకీకరణ…
ప్రస్తుతం ప్రజాప్రతినిధులకు సిద్ధాంతాలు, రాద్ధాంతాలు, విధేయతలు, నైతికతలూ మన్నూమశానం జాన్తా నై… ఎటు గాలి వీస్తే అటు కొట్టుకుపోవడమే… అఫ్‌కోర్స్, దేశమంతా అలాగే ఉంది… పైగా కొత్తదేమీ కాదు, ఆయారాం, గయారాం, ఇండియన్ పాలిటిక్సులో పెద్ద విశేషం కూడా ఏమీ కాదు… కాకపోతే ప్రస్తుతం ఏం జరుగుతోంది అనేదే ప్రశ్న…
కేసీయార్ ఓటమికి కారణాలను కాసేపు పక్కన పెడదాం… గులాబీ శిబిరం చెప్పుకున్నట్టు తను ఓటమి ఎరుగని గొప్ప వ్యూహకర్త ఏమీ కాదు, కాకపోతే పదీపదిహేనేళ్లుగా తనకు ఏదో మహర్దశ కలిసొచ్చింది… అప్పట్లో మహాకూటమి తరఫున పోటీచేసి, ఫలితాలతో నిరాశకు గురై అజ్ఞాతంలో ఉన్నప్పుడు వైఎస్ హెలికాప్టర్ పైకి లేవడం, పావురాలగుట్టలో మాయమైపోవడం, ఇక్కడ కేసీయార్ జాతకంలోకి శుక్రుడు ప్రవేశించడం జరిగినట్టుంది…
Ads
ఇప్పుడు..? కేసీయార్ మళ్లీ అజ్ఞాతంలోకి… ఓటమి తరువాత నల్గొండ మీటింగు తరువాత అసలు పట్టించుకున్నదే లేదు… పార్టీ కార్యక్రమాలన్నీ కేటీయారే పర్యవేక్షిస్తున్నాడు… తోడుగా హరీష్ రావు… కేసీయార్ పత్తాజాడా లేదు… కీలకమైన లోకసభ ఎన్నికల్లో చేదు ఫలితాలు వస్తే పార్టీ మనుగడకు మరింత ప్రమాదం… ఈ స్థితిలో సహజంగానే బీఆర్ఎస్ నాయకులు తలో దారి చూసుకుంటున్నారు… తమకు అనువైన పార్టీలోకి జంపుతున్నారు…
ఏమున్నాయి ఆప్షన్స్..? ఐతే బీజేపీ లేదంటే కాంగ్రెస్.,. కాంగ్రెస్‌లో పోటీ ఎక్కువ, ప్రతి సీటుకూ బోలెడు మంది పోటీదారులు… పైగా ఢిల్లీలో రకరకాల లెక్కలు, ఈక్వేషన్లు… ఈ నేపథ్యంలో మళ్లీ మోడీ ప్రభుత్వం వస్తుందనే నమ్మకంతో ఎంపీలు కావాలనుకుంటున్న బీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి వస్తున్నారు… ఇప్పటికే ఇద్దరు సిట్టింగులు వచ్చేయగా, వాళ్లకు బీజేపీ టికెట్లు కూడా ఇచ్చింది… మరో ఇద్దరు కూడా వస్తారని అంటున్నారు… ఒకవేళ బీజేపీ ఈ లోకసభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తే… ఇక తెలంగాణలో ఈ రాజకీయ శక్తుల ధృవీకరణ (పోలరైజేషన్) ఇంకా పెరుగుతుంది…
మరోవైపు రేవంత్ పావులు కదుపుతున్నాడు… రాష్ట్రంలో తను బలపడాలి… ఉన్న మెజారిటీ తక్కువ… మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ నేతలే టార్గెట్… ఆల్ రెడీ చాలామంది తనతో టచ్‌లోకి వచ్చారు… ఇంకా రేవంత్ ఎఫర్ట్స్ సాగుతాయి… సో, బీఆర్ఎస్ నుంచి బీజేపీ, కాంగ్రెస్ వైపు నేతల పయనం కొనసాగే సూచనలే ఉన్నాయి… వరుసగా బయటపడుతున్న కేసీయార్ ప్రభుత్వ అవినీతి, అక్రమ, అరాచకాలు ఇప్పటికే జనంలో ఉన్న వ్యతిరేకతను మరింత పెంచుతున్నాయి…
ఈ దశలో పార్టీ కేడర్‌లో నమ్మకాన్ని ఎలా నిలబెట్టాలో కేటీయార్‌కు, తోడుగా ఉన్న హరీష్‌కు అర్థం కావడం లేదు… మేడిగడ్డకు పయనం వంటి లోపభూయిష్ట వ్యూహాలు మరింత నష్టమే తప్ప ఫాయిదా లేదు… అసలే కాలేశ్వరం మీద నెగెటివ్ చర్చ జరుగుతూ ఉండగా, బీఆర్ఎస్ మేడిగడ్డ ఎపిసోడ్ ఆ చర్చలో మరింత పెట్రోల్ పోసి, మరింత చర్చకు సహకరించడమే… తెలంగాణ భవన్ నుంచి నమస్తే తెలంగాణ దాకా బీఆర్ఎస్ అనుబంధ విభాగాలన్నింటిలోనూ బాగా ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది…
రేవంత్ అంత తేలికగా బీఆర్ఎస్ మెయిన్ లీడర్లను వదిలే రకం కాదు… ఐతే జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు, పావులు కదుపుతున్నాడు… ఈ స్థితిలో లోకసభ ఎన్నికల తరువాత మరిన్ని కుదుపులు ఉంటాయేమో తెలంగాణ రాజకీయాల్లో..!! ఏమో చెప్పలేం, మళ్లీ మరేమైనా కాలం కలిసొచ్చే పరిణామం ఏదైనా జరిగితే కేసీయార్ మళ్లీ బలంగా తెరపైకి పరుగెత్తుకురావచ్చు కూడా..! బీజేపీ పొత్తు గట్రా ఏవేవో ఊహాగానాలు సాగినా మోడీ పెద్దగా సానుుకూలంగా స్పందించినట్టు లేదు…
ప్రస్తుతం బీజేపీ నుంచి 9 సీట్లు ప్రకటించారు… ఇంకొన్ని సీట్ల మీద నిర్ణయాలు లేవు… బహుశా బీఆర్ఎస్ నుంచి వచ్చే ఇద్దరు ముగ్గురి కోసం వెయిటింగ్ కావచ్చు… డీకే ఆరుణ, సోయెం బాపూరావు తదితరుల అభ్యర్థిత్వాలపై సస్పెన్స్ కొనసాగుతోంది… బహుశా బీజేపీ రెండో జాబితాలో మొత్తం సీట్ల అభ్యర్థిత్వాల ఎంపిక, ప్రకటన పూర్తి కావచ్చు…!!
Share this Article