నిజానిజాలు ఎలా ఉన్నా సరే… రాజకీయ కారణాల మీద చర్చ జరుగుతుంది… అది సహజం… అదసలే ఏపీ… రెండు దుర్ఘటనల నేపథ్యంలో జగన్ ప్రభుత్వం రోడ్ షోలను రద్దు చేసింది… సమస్యాత్మక మీటింగులకు అనుమతించకూడదని నిర్ణయించింది… జీవో విడుదల చేసింది… దీని మీద కుప్పంలో చంద్రబాబు మీటింగుకు సంబంధించి రచ్చ రచ్చ జరిగింది… ఇదే నేపథ్యంలో బాలయ్య, చిరంజీవి ప్రతిష్టాత్మకంగా పోటీపడుతున్న రెండు సినిమాల ప్రిరిలీజ్ ఫంక్షన్లకు కూడా ప్రభుత్వం అనుమతి నిరాకరించింది… ఒకటి వాల్తేరు వీరయ్య, రెండు వీరసింహారెడ్డి…
ఈ రెండు సినిమాల మీద కూడా బాగా హైప్ క్రియేటై ఉంది… భారీగా ఖర్చు పెట్టారు… భారీ రేట్లకు అమ్ముడుబోయాయి… ఈ నేపథ్యంలో బాలయ్య ప్రిరిలీజ్ ఫంక్షన్ ఒంగోలులో జరగాల్సి ఉంది… కానీ తొక్కిసలాట సాకుతో ప్రభుత్వం అనుమతి నిరాకరించింది… ఎనిమిదిన వైజాగ్‌లో వీరయ్య ఫంక్షన్ జరగాలి… (టైటిల్‌లోనూ వాల్తేరు పదం కలదు)… ఆ వీరయ్యకు ఇవ్వబడని అనుమతి ఈ వీరయ్యకు ఎందుకివ్వబడును..? బడదు…
నిజానికి అవేమీ రోడ్ షోలు కావు, సభల్లా ఆర్గనైజ్ చేస్తారు… ఫ్యాన్స్ హడావుడి ఉంటుంది కాబట్టే, తొక్కిసలాట జరగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు… ఐనా సరే, జగన్ ప్రభుత్వం నో అనేసింది… దీనికి రాజకీయ కారణాలు ఏమిటా అనే చర్చ మొదలైంది… బాలయ్య ఎలాగూ జగన్ పార్టీకి ప్రత్యర్థే… ఇండస్ట్రీ మొత్తం టికెట్ రేట్ల మీద జగన్‌ను కలిసినా సరే బాలయ్య మాత్రం వెళ్లలేదు… అలాగే రీసెంట్ అన్‌స్టాపబుల్ షోలో కూడా ప్రభుత్వంపై విసుర్లకు దిగాడు… తనెలాగూ బాబు క్యాంపు ముఖ్యుడు, జగన్‌కు ఎలాగూ పడదు… పైగా బాలయ్య జగన్‌కు పడని పవన్ కల్యాణ్‌ను అన్‌స్టాపబుల్ షోకు పిలిచి ఫుల్లు ప్రచారాన్ని కల్పించాడు… ఇంకా రానుంది…
Ads
సీన్ కట్ చేస్తే… చిరంజీవికి ఒక దశలో మస్తు ప్రాధాన్యం ఇచ్చాడు జగన్… టికెట్ రేట్లపై జగన్ దగ్గరకు వెళ్లిన బృందానికి కూడా చిరంజీవి నాయకత్వం వహించాడు… తరువాత పలు సందర్భాలలో పవన్ మీద అమితమైన ప్రేమను కురిపిస్తూ వ్యాఖ్యలు చేశాడు… ఏదో ఒకరోజు తమ్ముడు అత్యున్నత స్థానంలోకి వస్తాడనీ చెప్పుకొచ్చాడు…
సో, రెండు సినిమాల ఫంక్షన్ల అనుమతి నిరాకరణకు సంబంధించి పవన్ కల్యాణ్ సెంటర్ పాయింట్… ఒకటి అన్‌స్టాపబుల్… రెండు అన్నాదమ్ముల ప్రేమ… కిం కర్తవ్యం..? జగన్ వినడు… ఈ ఇద్దరికీ ఏపీలో ప్రిరిలీజ్ ఫంక్షన్లే ప్రధానం… ఎందుకంటే, సంక్రాంతిని ఘనంగా జరుపుకునేది ఏపీలోనే… తెలంగాణలో దసరాలాగే… ఇప్పడిక ఏం చేయుట..? హైదరాబాద్‌లోనే ఫంక్షన్లు జరుపుకొనుట… ఎన్టీయార్ కొడుకుగా కేసీయార్‌కు బాలయ్య ఇష్టుడు, రాంచరణ్ ఎలాగూ కేటీయార్ దోస్త్… ఇక అనుమతులు ఎంతసేపు..?!
అవునూ, ఇంతకీ ఈ రెండు సినిమాల కథలేమిటి..? వీరయ్యేమో హేపీగా బతికే మత్స్యకారుడట… ఏదో టాస్క్‌లో మలేషియా నుంచి ఓ విలన్‌ను పట్టుకొచ్చే పనిలో వెళ్తే, తనకూ లింకున్న కథ ఏదో బయటపడుతుందట… వీరసింహారెడ్డి డబుల్ యాక్షన్… కొడుకు ఇస్తాంబుల్‌లో ఉంటాడట… తండ్రి ఇక్కడ సీమను ఉద్దరిస్తూ ఉంటాడట… జస్ట్, ఆయా సినిమాల బేసిక్ స్టోరీ లైన్లు ఇవేనట… ఫుల్లు యాక్షన్… మాస్… ఎటొచ్చీ ఈ యాక్షన్ జగన్ ఏదీ పడనివ్వడం లేదు..!!
Share this Article