Siva Racharla ………. నీ శత్రువే శాశ్వతం కానప్పుడు యుద్ధం, విజయం శాశ్వతం ఎందుకు అవుతుంది?. అంతిమ యుద్ధం అంటూ ఏమీ ఉండదు! రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు అని కాలం మళ్ళీ మళ్ళీ నిరూపిస్తుంది. ఫ్యాక్షన్ అన్న మాట రాయాలన్నా నాకు మనసు రాదు కానీ పశ్చిమ కర్నూల్ ప్రాంతంలో మూడు దశాబ్దాల ఫాక్షన్ లో ఎంతోమంది చనిపోయారు. కేవలం ఒక మండల నాయకుడు “కప్పట్రాళ్ల” వెంకటప్పయ్యనాయుడు నడిపిన ఫ్యాక్షన్ లో ఎంతమంది చనిపోయారో లెక్క లేదు. కేయి -కోట్ల వర్గం గొడవల్లో వెంకటప్పయ్య నాయుడు లాంటి వాళ్ళ యాక్షన్ ఎక్కువ.పత్తికొండ వైసీపీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య జరిగిన మే 2017లో “పంచ పాళంగా – పంచ హత్యలు” పేరుతో అక్కడి చరిత్రను రాశాను . ఈ కప్పట్రాళ్ల వెంకటప్పయ్య నాయుడు కూతురు బొజ్జమ్మ నిన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరింది. దీనితో వెంకటప్పయ్య నాయుడు కుటుంబానికి కేయి కుటుంబానికి రాజకీయ బంధం తొలిసారి తెగింది.
2019 అన్నకు ఒక ఓటు నాన్నకు ఒక ఓటు.. కోట్ల కుటుంబానికి కాంగ్రెస్తో ఉన్న దాదాపు వంద సంవత్సరాల బంధాన్ని విడిచి 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి & సుజాతమ్మ దంపతులు టీడీపీలో చేరారు. సూర్యప్రకాష్ రెడ్డి కర్నూల్ ఎంపీగా ,సుజాతమ్మ ఆలూరు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల ప్రచారంలో సూర్యప్రకాష్ రెడ్డి కొడుకు, కూతురు పత్తికొండ నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ “అన్నకో ఓటు నాన్నకో ఓటు” వేయండి అని అడగటంతో ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇక్కడ అన్న అంటే కేయి కృష్ణమూర్తి కొడుకు కేయి శ్యామ్ , పత్తికొండ టీడీపీ అభ్యర్థి. నాన్న అంటే సూర్యప్రకాష్ రెడ్డికి ఎంపీ ఓటు.
చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య జరిగే వరకు కోట్ల, కేయి కుటుంబాలు ప్రత్యక్ష ఫ్యాక్షన్ చేసింది లేదు. నారాయణరెడ్డి హత్యకు కేయి శ్యామ్ సూత్రధారి అని నారాయణరెడ్డి శ్రీమతి , ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీదేవి గారు ఆరోపించారు. శ్యామ్ మీద కేసు కూడా నమోదయ్యింది. అనేక మంది ఈ వర్గ గొడవల్లో చనిపోయారు. అందులో పత్తికొండ నియోజకవర్గం లో ఎక్కువగా నియోజక వర్గ పునఃవిభజన తరువాత ఆలూరు నియోజకవర్గంలో రెండు మండలాల్లో ఎక్కువ మంది ఉన్నారు.
Ads
చెరుకులపాడు నారాయణరెడ్డి కూడా కోట్ల వర్గమే. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీచేసి 32 వేల ఓట్లు సాధించి రాష్ట్రం మొత్తంలో కాంగ్రెస్ తరుపున ఎక్కువ ఓట్లు సాధించిన వారిలో మూడు స్థానంలో నిలిచారు. కోట్ల సుజాతమ్మ, కన్నా లక్ష్మీనారాయణ, రఘువీరా రెడ్డి తదితరుల కంటే నారాయణరెడ్డికే ఎక్కువ ఓట్లు వచ్చాయి.
2019 ఎన్నికల్లో బొజ్జమ్మ మాత్రం కేయి శ్యామ్ కు మాత్రమే పనిచేశారు, కోట్లకు కానీ, ఆలూర్ లో సుజాతమ్మకి కానీ పనిచేయలేదు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత టీడీపీలోనే ఉన్న బొజ్జమ్మకు కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్ గన్ మెన్ సౌకర్యాన్ని కల్పించారు .
బొజ్జమ్మకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా?.
బొజమ్మకు వైసీపీలో చేరటం ఇష్టం లేదు కానీ ఆ పార్టీ నేతలే ముఖ్యంగా PK team రిపోర్ట్స్ వలన బొజ్జమ్మకు ఆలూరు ఎమ్మెల్యే సీట్ ఇస్తామని పార్టీలో చేర్చుకున్నారని ఆవిడ వర్గం ప్రచారం చేస్తుంది. అల్లూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్న గుమ్మనూరి జయరాంను ఈసారి కర్నూల్ ఎంపీగా పంపిస్తారని ప్రచారం జరుగుతుంది. నిన్న బొజ్జమ్మ వైసీపీలో చేరిన సమయంలో జయరాం కూడా ఉన్నారు. కానీ జయరాం ఆలూరు ఎమ్మెల్యే టికెట్ వదులుకుంటారని నేను అనుకోను.
టీడీపీ తరుపున జడ్పీటీసీగా ఉన్న జయరాంకు 2009లో ప్రజారాజ్యం టికెట్ ఇచ్చింది. టీడీపీ తరుపున మిత్రపక్షమైన సిపిఐ రామకృష్ణకు టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ తరుపున ఈమధ్య చనిపోయిన నీరజారెడ్డి పాటిల్ కు టికెట్ ఇవ్వగా, కోట్ల సుజాతమ్మ కజిన్ సీనియర్ కాంగ్రెస్ నేత హాలాహరి కేశవరెడ్డి రెబల్ గా పోటీ చేశారు. హోరాహోరి పోరులో జయరాం కేవలం 1900 ఓట్ల తేడాతో నీరజారెడ్డి మీద ఓడిపోయారు.
జయరాం రాజకీయ ప్రస్థానం
బోయ సామాజిక వర్గానికి చెందిన జయరాంకు సామాజిక బలం ఎక్కువ. జయరాం సోదరుడు(పెద్దమ్మ కొడుకు ) నాగేంద్ర బళ్లారిలో సీనియర్ నాయకుడు. మొన్న జరిగిన ఎన్నికల్లో బళ్ళారి రూరల్ నుంచి శ్రీరాములును ఓడించి మంత్రి అయ్యారు. నాగేంద్ర మద్దతు జయరాంకు అదనపు బలం. రాహుల్ జోడో యాత్ర సమయంలో కూడా జాతీయ కాంగ్రెస్ నాయకులు జయరాం ఇంటికి వెళ్లారు.
వైసీపీ తరుపున 2014, 2019లో గెలిచిన జయరాం మంత్రి అయినా తరువాత వ్యతిరేకత పెరిగింది. సొంత కులంతో పాటు సామాన్యుల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. అనేక భూఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని జయరాంను ఎంపీగా పంపించి బొజ్జమ్మ కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది.
జయరాం కాకుంటే ఆయన ఇంట్లో మరొకరికి ఎమ్మెల్యే టికెట్ అడుగుతాడు కానీ బొజ్జమ్మ టికెట్ ఇవ్వటానికి ఒప్పుకోడు ,ఒకవేళ ఆవిడకు టికెట్ ఇచ్చినా సహకరించరు. బొజ్జమ్మ బలం ఇప్పుడు చాలా పరిమితం, ఒక ఐదు ఆరు ఊర్లలో మాత్రమే వారి వర్గం మిగిలింది. వెంకటప్పనాయుడు బోయ కానీ అయన చనిపోయిన తరువాత ఒక ఇంటర్వ్యూ లో తాము “పాల ఏకిర్ల” మని ఆమె చెప్పింది. ఆవిడ భర్త కదిరికి రామచంద్రనాయుడు కూడా పాల ఏకీరనే . దీన్ని స్థానిక బోయలు ఎలా తీసుకుంటారో చూడాలి.
కోట్ల సోదరులు
ఒక వేళ బొజ్జమ్మకు టికెట్ ఇస్తే కోడుమూరు ఇన్ చార్జి కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. కోట్ల హరిచక్రపాణి రెడ్డి ఏ పార్టీలో లేకుండా వైసీపీలో చేరటం కోసం ఎదురుచూస్తున్నాడు. కోట్ల వర్గం తరుపున కప్పట్రాళ్ల వెంకటప్పయ్య నాయుడుతో పోరాడింది హర్షవర్ధన్ రెడ్డి మరియు హరిచక్రపాణి రెడ్డి. 2014 ఎన్నికల్లో హరిచక్రపాణి రెడ్డి వైసీపీ తరుపున పత్తికొండ నుంచి పోటీచేసి ఓడిపోయారు. తనను ఓడించటానికే తన అన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చెరుకులపాడు నారాయణ రెడ్డిని పోటీకి పెట్టాడని ఆరోపించాడు. 2019 ఎన్నికల్లో మాత్రం సూర్యప్రకాష్ రెడ్డి కి మద్దతుగా పనిచేశాడు.
బోయేతర బిసిల పరిస్థితి ఏంటి?
వైసీపీ తరుపున చేనేత వర్గానికి చెందిన బుట్టా రేణుక గారికి 2014లో డాక్టర్ సంజీవ్ కుమార్ గారికి 2019లో ఎంపీ టికెట్ ఇచ్చింది, ఇద్దరు గెలిచారు. ఇప్పుడు 2024లో సంజీవ కుమార్ ను తప్పించి జయరాంకు ఇస్తే చేనేతలకు ఎక్కడ టికెట్ ఇస్తారు?. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టికెట్ మీద బుట్ట రేణుక ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే కేశవరెడ్డి దాదాపు 80 సంవత్సరాల వయస్సు రావటంతో ఆయనకు టికెట్ రాదనీ ప్రచారం జరుగుతుంది. ఎమ్మిగనూరులో చేనేత వర్గం దాదాపు 25 వేల ఓట్లు ఉండటం వలన ఈసారి ఎమ్మిగనూరు టికెట్ చేనేత వర్గానికి ఇస్తారని అంచనా.
పశ్చిమ కర్నూల్లో బోయల తరువాత కురబలు ఎక్కువ. ముఖ్యంగా పత్తికొండ నియోజకవర్గంలో కురుబలు ఎక్కువ. కాంగ్రెస్ తరపున కురుబ సామాజికవర్గానికి చెందిన కే వి నర్సప్ప 1962,1972 & 1978లో పత్తికొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రి కూడా అయ్యారు. హిందూపూర్ ఎంపీ కురుబ సామాజిక వర్గానికి చెందిన గోరంట్ల ఎంపీ మాధవ్ కు ఈసారి పత్తికొండ ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఒక దశలో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
కర్నూల్ జిల్లాలో బోయలకే అవకాశాలు వస్తున్నాయని మిగిలిన బీసీ కులాల ఆరోపణ. మంత్రి జయరాం, ఎమ్మెల్సీ Dr.మధుసుధన్ , మేయర్ బి.వై . రామయ్య, గ్రంధాలయ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ ఇలా అనేక పదవులు బోయలకే ఇచ్చారని కురుబ, చేనేత, యాదవ వర్గాల నుంచి ఆక్షేపణ ఉంది .
మొన్న ఎమ్మెల్సీ పదవుల్లో అనంతపురం నుంచి బోయ మంగమ్మకు ఎమ్మెల్సీ ఇచ్చారు, కర్నూల్ నుంచి కూడా బోయ మధుసూదన్ కు ఇవ్వటం మీద ఇతర బీసీ కులాల అలక . కర్నూల్ ఎంపీ జయరాంకు ఇస్తే అనంతపురం ఎంపీ బోయ సామాజిక వర్గానికే చెందిన తలారి రంగయ్య సార్కు మరోసారి టికెట్ ఇస్తారో లేదో చూడాలి. మొత్తంగా జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న సోషల్ ఇంజినీరింగ్ ఫలితాలను ఇస్తుందా లేదా ఉన్న సమీకరణాలను డిస్ట్రబ్ చేస్తుందా చూడాలి?
Share this Article