.
ఒక వార్త… ఒక ఫోటో… కాబోయే ఏపీ ముఖ్యమంత్రిగా ఇప్పటికే కీర్తించబడుతున్న, ప్రొజెక్ట్ చేయబడుతున్న, ప్రమోట్ కాబడుతున్న లోకేష్ తన తాత ఎన్టీయార్ వర్దంతి సందర్శంగా ఎన్టీయార్ ఘాట్ వద్దకు వెళ్లి నివాళ్లు అర్పించాడు…
గుడ్, మంచిదే… చంద్రబాబు అక్కడికి ఎన్నిసార్లు వెళ్లాడో తెలియదు గానీ… బాలకృష్ణ, జూనియర్ ఎన్టీయార్ తదితరులు ఏటా రెండుసార్లు వెళ్తుంటారు… పర్లేదు… కానీ ఈసారి లోకేష్ బాబు సారు గారికి మస్తు కోపం వచ్చిందట…
Ads
ఘాట్ దరిద్రపు నిర్వహణ మీద ఆగ్రహించాడట… గోడలు, పైకప్పు పెచ్చులు ఊడిపోయినా ఎవరూ పట్టించుకోలేదట… సరే గానీ లోకేష్ బాబు సారు గారూ… తమరు ఎప్పుడో ఓసారి వస్తారు, ఎన్టీయార్ లెగసీ కావాలి కాబట్టి వస్తారు, ఆ పేరు వాడుకోవాలి కాబట్టి వస్తారు… వచ్చినప్పుడు మాత్రమే ఈ పెచ్చులు కనిపిస్తాయి మీకు…
గత ఏడాది బాలకృష్ణ వచ్చాడు, తనకు ఈ పెచ్చులు, దరిద్రపు నిర్వహణ కనిపించలేదు, జస్ట్, జూనియర్ ఫ్లెక్సీలు కనిపించాయి, వెంటనే తీసేయండని తన చుట్టూ ఉన్నవారికి పురమాయించాడు, కాదు, ఆదేశించాడు… దానిపై బోలెడు విమర్శలు… జూనియర్ ఆ సీనియర్ ఎన్టీయార్ రక్తం కాదా..? పోనీ, ఓ అభిమానిగా వస్తాడు, తప్పేముంది..?
ప్రచారానికి మాత్రం జూనియర్‌ను వాడుకోవాలి, అంతేతప్ప ఎన్టీయార్ ఘాట్‌లో ఫ్లెక్సీలు పెట్టొద్దట… ఐనా బాలయ్య ఎవరు ఆదేశించడానికి..? తనేమైనా హెచ్‌ఎండీఏ అధికారా..? సరే, ఈ విమర్శలు పక్కన పెడితే తనకు మాత్రం దరిద్రపు నిర్వహణ కనిపించలేదు…
నిజంగా ఎన్టీయార్ ఘాట్ నిర్వహణ మీద అసంతృప్తి ఉంటే… ఎప్పుడో ప్రభుత్వానికి చెప్పి, నిర్వహణను తాము తీసుకోవల్సింది కదా… అది కదా మీ ప్రేమ ఏమిటో చెప్పేది..? సరే, తెలంగాణ ప్రభుత్వాలకు వైఎస్ మీద, ఎన్టీయార్ మీద ప్రేమ ఉండదు, దానికి సవాలక్ష కారణాలు ఉంటాయి,.. (నిజమైన తెలంగాణవాదులకు ఆంధ్రా నేతల విగ్రహాలు చూస్తేనే కోపం, మిలియన్ మార్చ్ వేళ కనిపించింది కదా…) ప్రభుత్వాలు ఆ ఘాట్ నిర్వహణను పట్టించుకోవు సరే, మరి ఇన్నేళ్లూ మీరేం చేస్తున్నారు..?
ఇప్పుడు కనిపించిందా దరిద్రపు నిర్వహణ… కోటి సభ్యత్వాల హుషారులో ఉన్న పార్టీకి తమ వ్యవస్థాపకుడి స్మృతి పట్టలేదా..? పైగా ఎవరిని నిందిస్తున్నారు..? హైదరాబాదులోనే బోలెడు మంది ఎన్టీయార్ అభిమానులు, పాత తెలుగుదేశం ప్రముఖులు ఉన్నారు కదా, ఎవరికైనా పట్టిందా..? ఎప్పుడైనా వెళ్లారా..?
ఎన్టీయార్ పేరు, ఫోటోల్ని వాడుకోవడం మాత్రమే కాదు… వెన్నుపోటు అనంతరం ఫోటోకు దండేసి దండం పెట్టడం మాత్రమే కాదు… అలా వాడుకుంటున్నప్పుడు కనీసం ఆ స్మృతుల్ని గౌరవించాలి కదా…!!
Share this Article