ఎవరినైనా చంపాలనేంత కోపంగా ఉందా..? చంపేయాల్సిందేనా..? ఓసారి అన్నపూర్ణ స్టూడియోస్‌కు గానీ, జీతెలుగు హెడ్డాఫీసుకు గానీ ఫోన్ చేయండి… సతీ త్రినయని సీరియల్ స్క్రిప్టు రైటర్ నెంబరు గానీ, దర్శకుడి నంబరు గానీ అడగండి… వాళ్లు మీకు ఓ కెమికల్ పేరు చెబుతారు… దాన్ని ఏదైనా పూల బొకే మీద స్ప్రే చేసి, మీ టార్గెట్ నివసించే రూంలోకి చేర్చండి… ఫినిష్… అది పీల్చీ పీల్చీ వాడే చస్తాడు మూడునాలుగు రోజుల్లో…! మీ చేతికి ఏ మట్టీ అంటదు…… ఏమిటీ క్రిమినల్ ఆలోచనలు అంటారా..? మరేం చేస్తాం… తెలుగు టీవీ సీరియళ్లు అలా తగలడ్డాయ్…
ఇదే చానెల్లో వచ్చే ప్రేమ ఎంత మధురం అనే సీరియల్ కామన్ సెన్స్‌కు ఎన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉందో… అందులో మోస్ట్ క్రియేటివ్ పిసుకుడు బాంబుల ప్రహసనం ఏమిటో నిన్న చెప్పుకున్నాం కదా… సేమ్, కామన్ సెన్స్ లెస్ ప్రతి సీన్లోనూ తాండవించే సీరియల్ త్రినయని… నిజానికి ఈ సీరియల్ ప్రజెంట్ చేసే అక్కినేని నాగార్జునకు శిక్ష వేయాలనిపిస్తే… తన కళ్ల రెప్పలు కొట్టకుండా క్లిప్పులు పెట్టి, నిర్బంధంగా ఓసారి అదే సీరియల్ చూపిస్తే సరి… ఇక జన్మలో టీవీ సీరియళ్లు తీయడు… (సీరియల్ ఇలా ఉంటేనే మహిళా ప్రేక్షకులు చూస్తారోయ్, అందుకే అలా తీస్తున్నాం అంటాడేమో కొంపదీసి… పాయింటే సుమీ…)
Ads
ఇక ఈ సతీ త్రినయని అనబడు సతీసక్కుబాయి నాటి కథాకాలానికి వస్తే… అందులో అన్నీ ఎడ్డి కేరక్టర్లే… ఎవడెప్పుడు ఎందుకు ఎలా బిహేవ్ చేస్తారో ఎవరికీ తెలియదు… సగటు తెలుగు టీవీ సీరియల్ అవలక్షణాలన్నీ పోతపోసుకున్న సీరియల్… అందుకేనేమో ఈసారి జీతెలుగు వాడి సీరియళ్లలో టాప్ వన్… ఈ సీరియల్ బొక్కలు వెతికితే కొన్ని గ్రంథాలు రాయొచ్చు గానీ మచ్చుకు నిన్నటి ఎపిసోడ్ చూద్దాం…
సేమ్, పిసుకుడు బాంబుల్లాగే ఇందులో ‘చంపే పూలు’ కాన్సెప్టు… పూల బొకేలపై కెమికల్ చల్లేసి, హీరో రూంలో పెడుతుంది ఓ లేడీ విలన్… పేరు జాస్మిన్… విచిత్రమేమిటంటే… నేను హీరోను పెళ్లిచేసుకున్నాక, ఈ పద్ధతిలో చంపేస్తాను అని తమ్ముడికి చెబుతుంది… కానీ పెళ్లి ఎటూ తేలకుండానే బొకేలు పెట్టడం స్టార్ట్ చేస్తుంది… అది హీరోయిన్ పసిగడుతుంది… కామన్ సెన్స్ ఉండాలి కదా… చంపితే గింపితే పెళ్లయ్యాక కదా హీరోను ఆ కెమికల్ పూలతో చంపాల్సింది… ఏమిటో అంతా తిక్కమేళం… ఇదీ మన టాప్ వన్ సీరియల్ పోకడ…
హీరో ఓ చిల్లర నల్కా కేరక్టర్… అమెరికాలో చదివి వచ్చాడని చెబుతారు… తన కేరక్టరైజేషన్‌లో బేసిక్ సెన్స్ కూడా ఉండదు… సరే, ఈ ఎపిసోడ్ వరకే పరిమితం అవుదాం… జాస్మిన్‌తో పెళ్లి ఏ పరిస్థితిలోనూ జరగొద్దు అని హీరోయిన్ చూస్తూ ఉంటుంది… ఆమె అత్త ఆత్మ కూడా చెబుతుంది ఆమెతో పెళ్లి వద్దని… ఎవడో గుడిలో కనిపించి నీ మొగడికి రెండో పెళ్లి చేయాలి అని చెప్పగానే ఈమె రెడీ అయిపోతుంది… జాస్మిన్ మాత్రం వద్దు అట… మళ్లీ తనే అన్నలా భావించే ఓ ఇన్స్పెక్టర్కు చెబుతూ ఉంటుంది… వచ్చేవారమే పెళ్లి అని… ఎవరితో వద్దని పోరాడుతుందో అదే జాస్మిన్‌తో అట… అందుకే తిక్క మేళం అనేది…
ఇదే ఇన్స్పెక్టర్ చెల్లెలు ఆత్మ ఓసారి ఇదే హీరోయిన్‌కు బాట మధ్యలో కనిపించి, మంటల్లో పడి మరణించినట్టుగా ఏదో చెబుతుంది… మళ్లీ ఇప్పుడేమో తనను కెమికల్ చల్లిన పూలను ప్రయోగిస్తూ చంపేశాడు అన్నట్టుగా చెబుతుంది… నీ మొగడిని కూడా అలాగే చంపుతారు, జాగ్రత్త, పూల్‌లో చావువాసన ఓసారి చూడు అని హెచ్చరిస్తుంది… ఇది మరో తిక్కమేళం…
ఇలా… అంతా సదరు కథా రచయిత దయ, మన ప్రాప్తం… తను కూడా ఈ సీరియల్ పాత్రల్లాగే… ఎప్పుడేం రాస్తాడో ఎవరికీ తెలియదు… పాపం, హీరోయిన్ ఆషిక పడుకోన్… నాలుగైదు కిలోల బరువు తక్కువగా, నాలుగైదు ఇంచుల పొడవు ఎక్కువగా ఉంటే… టాప్ వన్ పొజిషన్లో ఉండేది… మంచి నటి… కానీ అప్పట్లో కథలో రాజకుమారి అనే మరో పిచ్చి సీరియల్‌కు బలైంది.,. ఇప్పుడు ఈ సతీ త్రినయని అనే మరో సూపర్ బంపర్ సీరియల్‌కు ఆమె మెరిట్ మంటగలిసిపోతోంది పాపం… ఇక ఇక్కడ ఆపేద్దాం… లేకపోతే ఆ క్రియేటివ్ పూల కెమికల్‌కు బలయిపోతాం…
Share this Article