ఖస్ ఖస్ అంటారు హిందీలో… తెలుగులో గసగసాలు… ఇంగ్లిషులో పాపీ సీడ్స్… మన ఈతరం వంటగత్తెలు, వంటగాళ్లు మరిచిపోయారు దాని వాడకం… ప్రత్యేకించి పెద్ద పెద్ద చేతులు తిరిగిన చెఫులకూ గసగసాల వాడకం తెలియదు… మిలియన్ల వ్యూస్ ఉన్న, వేయి వంటల వీడియోలు చూస్తే ఒక్క దాంట్లోనూ గసగసాలు వాడుతున్నట్టుగా లేదు… నిజానికి వేల ఏళ్లుగా గసగసాలు లేక భారతీయ వంటశాల లేదు… అనేక వంటల్లో అవి పడాల్సిందే… ఇప్పుడేమో కిరాణా సామగ్రి జాబితా నుంచి మాయమైపోయింది పాపం…
అయితే గసగసాల మోతాదు, దేనిలో వాడాలో చాలామందికి తెలియదు… చాలా వంటకాల్లో ఇంగువ వేస్తారు, ఎంత..? కాస్త…! వేసీవేయనట్టుగా… అంతే… గసగసాలు కూడా అంతే… ఎస్, నల్లమందు కాయల నుంచి తీసిన సన్నని గింజలే ఇవి… సో వాట్..? చెప్పుకున్నాం కదా ముందే… భారతీయం ఎప్పుడూ గసగసాల్ని ఓన్ చేసుకుంది… పండుగలొస్తే గసగసాలతో భంగు తయారు చేసుకుని ఇంటిల్లీపాదీ ఎంజాయ్ చేస్తారు… ప్రత్యేకించి నార్త్ ఇండియన్ స్టేట్స్…
జాగ్రత్త… చాలా దేశాలు గసగసాలను నార్కొటిక్స్‌గా పరిగణిస్తాయి… అంతర్జాతీయ విమానాల్లో తీసుకెళ్లకండి… శిక్షలు పడే ప్రమాదం ఉంది… ప్రత్యేకించి గల్ఫ్ వెళ్లే ప్రయాణికులు వీటి జోలికి వెళ్లకండి… ఈమధ్య కొందరు ప్రబుద్ధులు ఏదో మత్తు ఆయిల్ తయారు చేస్తున్నారట… దాంతో మన అధికారులు గసగసాలపైనా కసి పెంచుకున్నారు… అంతేకదా… ప్రభుత్వ అధికారి అంటేనే బుర్ర పనిచేయొద్దు కదా… గుడుంబా ఆగాలంటే బెల్లం మీద పడతారు… ఒరేయ్, నాన్నా నాలుగు పల్లీల ముద్దలు చేసుకుంటాం అన్నా సరే, దుకాణాల్లో అమ్మనివ్వరు… మరి గుడుంబా నానా రకాల చెత్తా సరుకులతో కూడా తయారు చేస్తారు కదా అని అడిగితే వినేవాడు దొరకడు… తనకు తెలియకపోతే కదా…
Ads
ఇక వంటల విషయానికొద్దాం… ఓ బెటర్ ఉదాహరణ కావాలా..? అరిశెలు అందరికీ తెలిసిన నోరూరించే డిషే కదా… ఇప్పుడంటే వాటిపై నువ్వులు అద్దుతున్నారు… వాటి రుచే చెడిపోతోంది… నిజానికి అద్దాల్సింది కాస్త వేయించిన గసగసాలు… అసలు అరిశెలు అంటేనే అవి… మీరు నూనెలో గోలిస్తారా..? నెయ్యి వాడతారా..? మీ ఇష్టం… కానీ మంచి ఫ్లేవర్, టేస్ట్, ఫినిషింగ్ టచ్ మాత్రం ఈ గసగసాల అద్దకంతోనే…
కొన్ని రాష్ట్రాల్లో గసగసాలతో కూడా కూరలు చేసుకుంటారు… పచ్చళ్లు కూడా… ఉదాహరణ కావాలా..? మహారాష్ట్రలో Khus Khus Khobaryachi Aamti… గసగసాలు, ఎండుకొబ్బరితో చేస్తారు… జొన్న, మక్క, గోధుమ రొట్టెలకు భలే కాంబినేషన్… కానీ ఆ కూర వండటం ఎలాగో తెలియాలి… నాలుగుసార్లు భంగపడితే తప్ప భంగు వంటి కూర అనుభవంలోకి రాదు… సరే, హైదరాబాద్‌కు వద్దాం… మీరు వెజ్, నాన్‌వెజ్ బిర్యానీలు ఎంత కష్టపడి వండినా సరే… ఎన్ని మసాలాలూ నూరినా సరే… వండుతుంటేనే ఆ ఫ్లేవర్ వీథి చివరి వరకూ గుప్పుమన్నా సరే… అంచుకు ఏం పెట్టుకుంటున్నామనేది, ఏం కలుపుకుని తింటున్నామనేది ముఖ్యం…
అంటే పెరుగు రైతా… లేదా గ్రేవీ… షోరువా అంటారు లెండి… నిజానికి ఎంత కష్టపడి ఎంత ఘుమఘుమలాడే బిర్యానీ… అదీ హైదరాబాదీ బిర్యానీ చేసుకున్నా సరే… ఈ గ్రేవీ, ఈ షోరువా, ఈ రైతాలు కాదు… మిర్చికా సాలన్ ఉండాలి పక్కన… బిర్యానీ టేస్ట్ డబుల్ అయిపోతుంది… ష్, కొన్నిసార్లు ట్రిపుల్ కూడా…! ఉత్త బిర్యానీ తింటాం అంటారా..? అది మీ ఖర్మ… మిర్చికా సాలన్ తయారీ కూడా బిర్యానీ వంటలాగే… కాస్త శ్రద్ధ కావాలి… కాదు, ప్రేమ కావాలి…
గసగసాల మాట పక్కన పడేసి, ఈ బిర్యానీ, మిర్చికాసాలన్ ఏంటీ అంటారా..? ఉంది… పల్లీలు, నువ్వులు, ఎండుకొబ్బరి వంటివి ఎన్ని వేసినా సరే, అందులో గసగసాలు కూడా పడితేనే మిర్చికాసాలన్‌కు టేస్ట్ అబ్బేది… అద్దబడేది… ధనియాల పొడి, జిలకర పొడి, మెంత పొడి, చాట్ మసాలా, పసుపు, ఎండుకారం, ఉప్పు, ఆవాాలు… ఇలా ఏమైనా వేసుకొండి… ఒక్కమాట… మిర్చికా సాలన్ సరిగ్గా, రుచిగా వండటం తెలిసినవాళ్లు ప్రపంచంలోని ఏ డిష్షయినా అలవోకగా ఇట్టే వండేయగలరు… ష్యూర్… సేమ్, గసగసాల వాడకం తెలిసినట్టే…!!
Share this Article