ఒక్కో దేశంలో ఒక్కో తీరు… కొన్ని దేశాలు మన చావు మనల్ని చావనిస్తాయి… అక్కడి చట్టాలు అడ్డుపడవు… బహుశా కారుణ్య మరణం అనాలేమో దీన్ని… నయం కాని రోగాలు, తీవ్రంగా అవస్థ పెడుతున్న వ్యాధులు, పీక్కు తింటున్న జబ్బులు, వృద్ధాప్య సమస్యలతో సతమతం అయ్యే వాళ్లు ఒకవేళ ‘ఇక మేం ఈ లోకాన్ని విడిచిపెడతాం, మాకు విముక్తి కావాలి’ అని బలంగా నిర్ణయం తీసుకుంటే…
డాక్టర్లే అధికారికంగా ‘హతమారుస్తారు’… విషపు ఇంజక్షన్లు ఇచ్చి, ప్రభుత్వం ఇచ్చే అనుమతిని పరిశీలించి, తమ పర్యవేక్షణలో ఈ ‘విముక్తి పర్వాన్ని’ అమలు చేస్తారు… ఒక జీవికి నరకయాతన తప్పిస్తారు… నిజంగా మంచి చట్టం, మంచి దేశం… మన దేశంలో మన చావు మనల్ని చావనివ్వరు… మరీ కార్పొరేట్ హాస్పిటళ్లయితే ఆస్తులు అమ్మించి, అప్పులు చేయించి, ఐనవాళ్లను ఐనకాడికి పీక్కుతిన్నాక ఇక వదిలేస్తారు… నీ చావు నువ్వు చావుపో అని… లేదంటే నీ పేరిట ఉన్న మెడికల్ ఇన్స్యూరెన్స్ పరిమితి పూర్తయ్యేవరకు నీకు బెడ్డు, ఆక్సిజెన్, సెలైన్… అంతే…
కారుణ్య మరణాన్ని అనుమతించే దేశాల్లో న్యూజిలాండ్ కూడా ఒకటి… ఎవరైనా మేం చస్తాం అని కాల్ చేస్తే చాలు, ఓ పోర్టబుల్ సూసైడ్ పాడ్ (యంత్రం) లేదా మృత్యుపేటిక ఇంటికి వస్తుంది… జస్ట్, 20 డాలర్ల ఖర్చు… మీరు అందరికీ టాటా చెపి, అందులో పడుకుంటే చాలు… అందులో దాగున్న యమభటుడు మీపైకి పాశం విసురుతాడు… మీ ప్రాణాలు కాసేపట్లో వెళ్లిపోతాయి… మీకు ఈ ఇహలోక యాతనల నుంచి విముక్తి లభిస్తుంది… మీ ఫోటో గోెడపైకి చేరుతుంది… మీరు ఓ జ్ఞాపకంగా మిగిలిపోతారు… అంతే…
Ads
సార్కో కేప్సుల్… ఇది కొద్దినెలల్లో అందుబాటులోకి వస్తుంది… మరణాన్ని చౌకగా, సౌకర్యవంతంగా అందించే ఈ స్పేస్ ఏజ్ తరహా పరికరాన్ని విరాళాలతో రూపొందించారు… మీరు అందులో పడుకోగానే సెకండ్లలోనే ఆక్సిజెన్ 21 శాతం నుంచి 0.05 శాతానికి పడిపోతుంది… ఆ తరువాత మరణం మిమ్మల్ని కౌగిలించుకుంటుంది… లాస్ట్ రిసార్ట్ ఆర్గనైజేషన్ దీన్ని నిర్వహిస్తుంది… లీగల్ కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు, చాలామంది దీన్ని వాడుకోవడానికి క్యూ కడతారు చూడండి’ అంటున్నాడు దాని సీఈవో ఫ్లోరియన్ విలెట్…
ఇది వాడుకోవాలంటే… ముందుగా అన్నిరకాల బంధాలనూ తెంచుకోవాలి… అప్పగింతలు పూర్తి చేసుకోవాలి… మానసికంగా సిద్ధం కావాలి… మానసిక సన్నద్ధతను ఓ సైకియాట్రిస్టు నిర్ధారించాలి… ఒకసారి లోపల పడుకున్నాక కూడా కొన్ని ప్రశ్నలు వస్తాయి, మీరే బటన్లు నొక్కుతూ జవాబులు చెప్పాలి… ఇక ఆ తరువాత అది మూసుకుపోతుంది… ఆత్మ పైకి లేచి ఎగిరిపోతుంది… ఒక దేహానికి పర్మినెంట్ ఎటర్నల్ స్లీప్…
దీన్ని వాడుకోవాలంటే కనీస వయోపరిమితి 50 ఏళ్లు… అయితే సీరియస్ వ్యాధులతో అవస్థపడేవాళ్లు 18 ఏళ్లు దాటి ఉంటే చాలు… దీని రూపకల్పన సమయంలో కొన్ని నైతిక ప్రతిఘటనలు ఎదురయ్యాయి… దీని రూపకర్త చట్టం అనుమతించిన కారుణ్య మరణమే ఇది కూడా అని వాదించాడు… స్వచ్చంద మరణాన్ని డీమెడికలైజ్ చేయడమే అన్నాడు… ఇప్పటివరకూ మనుషులపై గానీ, జంతువులపై గానీ ఇంకా ప్రయోగించలేదు… మొదటి మరణాన్ని గోప్యంగా నిర్వహించాలని భావిస్తున్నారు… అన్నట్టు మరణశిక్షలకు మాత్రం దీన్ని అస్సలు ఉపయోగించబోమని సదరు లాస్ట్ రిసార్ట్ నిర్వాహకులు చెబుతున్నారు..!!
Share this Article