నో, నో, టీవీలో నటించడమా..? నావల్ల కాదు బాబూ… నాకు పెద్ద తెర మాత్రమే ప్రధానం…… అని ఇంకా ఎవరైనా ఎచ్చులు, చిన్నతనం ఫీలవుతుంటే… పదే పదే నిర్మాతల చుట్టూ, దర్శకుల చుట్టూ, ఫైనాన్షియర్ల చుట్టూ చిన్న పాత్ర ఇప్పించండి సార్ అని ప్రదక్షిణలు చేస్తుంటే… వాళ్లు అర్జెంటుగా ఓసారి పోసాని కృష్ణమురళితో మాట్లాడటం బెటర్… ట్రెండ్ ఏమిటో, సుస్థిర ఆదాయం ఏమిటో కాస్త క్లారిటీ ఇస్తాడు…
నిజం… తను సినిమాల్లో చాలా సీనియర్… అనేకమందికి తనే పాత్రలు ఇచ్చాడు… దర్శకుడు, నటుడు, నిర్మాత, డైలాగ్ రైటర్, కథా రచయిత… అయితేనేం, కాలం మారేకొద్దీ తను మారుతూ వస్తున్నాడు… ఎవరు పిలిచి ఏ చిన్న పాత్ర ఇచ్చినా సరే కాదనకుండా చేస్తున్నాడు… ఒకప్పుడు మా తాతలు నేతులు తాగారు, మేం మూతులు కడుక్కోం అంటే కుదరదు… ఫీల్డ్‌లో ఉండాలంటే కాలాన్ని బట్టి నడుచుకోవాలి…
నిజానికి పోసాని కృష్ణమురళి టీవీ సీరియళ్లలోకి వచ్చేయడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది… ఎందుకంటే, తనకు ఇప్పటికీ సినిమా చాన్సులు వస్తూనే ఉంటాయి… విలన్, సైడ్ విలన్, కమెడియన్, కేరక్టర్ ఆర్టిస్ట్… ఏదో ఓ పాత్ర… అప్పుడప్పుడూ టీవీ షోలలో కనిపిస్తుంటాడు… ఈటీవీలో ఏదో షోకు జడ్జిగా వస్తుంటాడు తరచూ… ఐనా ఏకంగా సీరియళ్లలోకే వచ్చేయడం విశేషమే…
Ads
నిజానికి పెద్ద పెద్ద స్టార్లే టీవీల్లో షోలు చేస్తున్నారు… అమితాబ్‌కు ఏం తక్కువ..? కేబీసీ చేస్తూనే ఉన్నాడు ఏళ్లుగా… సల్మాన్, కమల్, నాగార్జున, సుదీప్ తదితరులు బిగ్‌బాస్ హోస్టింగ్ చేస్తుంటారు… జూనియర్ ఎన్టీఆర్ తెలుగు కేబీసీ చేశాడు… తమన్నా వంటల పోటీ జడ్జిగా చేసింది… బాలయ్య అన్‌స్టాపబుల్ అని చెలరేగిపోతున్నాడు… అనిల్ రావిపూడి ఆహా ఓటీటీలో కామెడీ షో హోస్ట్ చేస్తున్నాడు… 10 కోట్ల గాలోడు కూడా నేల మీదే కుదురుగా నిలబడి టీవీ షోలకు హోస్టింగ్ చేస్తున్నాడు… ఇలా బోలెడు మంది… ఇప్పుడు సినిమాలు టీవీలకన్నా పెద్ద పాపులర్ ఏమీ కాదు… ఇంటింటికీ పరిచయం చేసేది టీవీ… టీవీ తారలకు పాపులారిటీ కూడా తక్కువ కాదు…
ప్రేమ ఎంత మధురం సీరియల్లో పోసాని తాజాగా ఎంట్రీ ఇచ్చాడు… తన రేంజ్, తన పరిచయాల కారణంగా చాలా సీరియళ్లలో కనిపించవచ్చు ఇకపై… ప్రేమ ఎంత మధురం సీరియల్ దర్శకత్వలోపాలు, కథనలోపాల కారణంగా ఘోరంగా రేటింగ్స్ కోల్పోతోంది… చేసే ప్రయోగాలన్నీ ఎదురు తంతున్నాయి… ఈ స్థితిలో విలన్‌కు సాయపడే ఓ లాయర్ పాత్రలోకి పోసాని ఎంట్రీ ఇచ్చాడు… సరే, ఆ సీరియల్ మీద చర్చ శుద్ధ దండుగ కానీ… ఒక్క పోసాని మాత్రమే కాదు, చిన్నా చితకా పాత్రల నటీనటులు చిన్న తెర వైపు చూడటం టీవీకి మంచిది… వాళ్లకూ మంచిది..!!
Share this Article