ప్రజా పాలనలో పెన్నులు గన్నులు ఐయ్యాయి… మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలానే ఉండేనా… అన్ని ఫ్లోర్ లు స్వేచ్చ గా తిరిగేవారు జర్నలిస్ట్ లు… విలేకరులకు ఎందుకు స్వేచ్ఛ లేదు సచివాలయంలోకి……. ఈ మాట అన్నది మాజీ మంత్రి, కేసీయార్ కుటుంబసభ్యుడు, బీఆర్ఎస్ ప్రధాన నేత హరీష్ రావు…
కొంతమేరకు ఆచితూచి, కాస్త మెచ్యూర్డ్‌గా మాట్లాడతాడని పేరున్న హరీష్‌ను కూడా ఓరకమైన ఫ్రస్ట్రేషన్ ఆవరిస్తున్నట్టుంది… నిజంగా తన విమర్శ చూసి జర్నలిస్టులందరూ నవ్వుకునేలా ఉంది… పెన్నులు-గన్నులు అనే వ్యాఖ్యను నవ్వుకుని వదిలేస్తే… విలేకరులకు స్వేచ్ఛ లేదట సచివాలయంలో… అన్ని ఫ్లోర్లూ స్వేచ్ఛగా తిరిగేవారట… సచివాలయం బీట్ చూసే ప్రతి ఒక్క విలేకరీ హాశ్చర్యపోయి, కిందపడిపోయి ఉంటారు ఈ విమర్శ విని, చదివి…
ఫ్లోర్లలో స్వేచ్ఛగా తిరగడం కాదు, కొత్త సెక్రెటేరియట్ కట్టాక అసలు జర్నలిస్టులకే ప్రవేశం లేకుండా చేశారు… సాక్షాత్తూ సీఎం కేసీయార్ ప్రెస్‌మీట్ పెడితే ఏ అర్ధరాత్రో, అపరాత్రో… ప్రశ్నలడిగే విలేకరుల మీద ఉల్టా దాడి చేసేవాడు, కించపరిచేవాడు, దబాయించేవాడు… విలేకరులే కాదు, ఆ ప్రెస్‌మీట్లు చూసిన వాళ్లందరికీ అది తెలుసు… ఎంతసేపూ రాహుల్ అనే జర్నలిస్టు పేరు తీసుకుని, పరోక్షంగా అందరినీ ఏవేవో అనేవాడు కేసీయార్… తల్కాయ ఉందావయా వంటి వ్యాఖ్యలు సరేసరి…
Ads
మరి ఇప్పుడు..? సచివాలయంలో ప్రవేశానికి ఆంక్షల్లేవు… నిజంగా జర్నలిస్టులు కాస్త స్వేచ్ఛ అనుభవిస్తున్నది ఇప్పుడే… సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఎవరైనా ప్రశ్నలడిగితే దాటవేయడమో, ఎదురు ప్రశ్నలు వేసి నోళ్లు మూయించడమో లేదు… మొన్న చిట్‌చాట్ ఏకంగా గంటన్నరసేపు నడిస్తే ఒక్క ప్రశ్ననూ రేవంత్ దాటవేయలేదు… అంతెందుకు..? తెల్లారిలేస్తే రేవంత్ మీద టన్నుల కొద్దీ విషాన్ని గుమ్మరించే బీఆర్ఎస్ అనుబంధ విభాగాలు నమస్తే తెలంగాణ, తెలంగాణటుడే, టీన్యూస్ ప్రతినిధులు కూడా ‘స్వేచ్ఛ’గా ప్రశ్నలడిగారు…
ఏమాటకామాట… సుప్రీంలో కేసు గెలిచిన తరువాత కూడా హైదరాబాద్ జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వకుండా వాళ్ల ఆశల్ని పాతరేసే ప్రయత్నం చేసింది కేసీయార్ కాదా..? నిన్నో మొన్నో ఒక అవార్డు ప్రదానం చేయడానికి వచ్చిన రేవంత్ ‘పాత్రికేయం ప్రతిపక్ష పాత్ర పోషించాలి’ అన్నాడే తప్ప… మాకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లకు మేం స్థలాలు ఎందుకివ్వాలి అని ఎటమటం వ్యాఖ్యలు చేయలేదు… అప్పటి సీఎం కేసీయార్‌లాగా..! రేవంత్ సీఎం అయ్యాక, సచివాలయంలోకి ప్రవేశించగలిగిన విలేకరులు సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేసుకున్నారు ఆనందంగా..! బహుశా హరీష్ చూసి ఉండడు అవి…
Glimpses from CM @revanth_anumula’s chit chat at @TelanganaCMO 6th floor of secretariat https://t.co/SPUuHLoG5T pic.twitter.com/ZY6xXrMBFW
— Naveena (@TheNaveena) March 6, 2024
పైన ట్వీట్ నవీన అనే లేడీ జర్నలిస్టుది… రెండు నెలల్లో అనేకమార్లు రేవంత్ ప్రెస్‌తో మాట్లాడాడు, ఈ వాతావరణం గత కొన్నేళ్లలో ఎప్పుడూ చూడలేదు అంటోంది… ఆ ఫోటోలు చూస్తూనే జర్నలిస్టులు రేవంత్‌కు ఎంత సన్నిహితంగా వెళ్లగలుగుతున్నారో అర్థమవుతోంది కదా… ఒక్కసారి ఈ వాతావరణాన్ని కేసీయార్ హయాంలో చూడగలిగామా..?
ఒక్కసారి ఈ ఫోటో చూడండి… రేవంత్ చుట్టూ ఉన్న జర్నలిస్టులు… తడబాట్లు, విసుగు వంటివి లేకుండా అందరికీ సమాధానాలు ఇస్తున్నాడు… పరిస్థితి ఇలా ఉంటే… హరీషేమో పెన్నులు- గన్నులు- స్వేచ్ఛ అనే విచిత్రమైన పదాలు వల్లెవేస్తున్నాడు… రాజకీయాల్లో గెలుపోటములు ఉంటాయి, సహజం… ఓటమిని అంగీకరించాల్సిందే, పాత తప్పుల దిద్దుబాటు జరగాల్సిందే… కానీ హరీష్ దానికి భిన్నంగా ఏదేదో మాట్లాడేస్తున్నాడు… అదీ వింతగా ఉంది… రేవంత్ పాలన, జర్నలిస్టుల పట్ల సాదరవైఖరి ఇలాగే ఉండాలని కోరుకోవడమే కాదు, సగటు జర్నలిస్టు మళ్లీ ఆ పాత నిర్బంధాల కాలం రావొద్దని కోరుకోవడంలో ఆశ్చర్యం ఏముంది..?
ఇక్కడ మరొకటి గుర్తుచేసుకోవాలి… తను సీఎం కాకముందు పీసీసీ అధ్యక్షుడిగా ఇలాగే కొందరు మీడియా వ్యక్తులతో చిట్‌చాట్ చేస్తున్నాడు, అయిపోయేముందు ఓ ఇంగ్లిష్ విలేకరి శశిధరూర్ మీద ఏదో అడిగాడు… రేవంత్ సహనం కోల్పోయి శశిధరూర్ మీద ఏదో నెగెటివ్ వ్యాఖ్య చేశాడు… దాన్ని సదరు విలేకరి రికార్డు చేసి, మరో ఇంగ్లిష్ మిత్రుడికి పంపిస్తే, ఆయన కేటీయార్‌కు పంపిస్తే, కేటీయార్ దాన్ని ట్వీట్ చేసి ఏవో వ్యాఖ్యలు చేశాడు… నిజానికి చిట్‌చాట్ రికార్డు చేయకూడదు… అది మీడియా నైతికత… చివరకు రేవంత్ శశిధరూర్‌కు అపాలజీ చెప్పుకోవాల్సి వచ్చింది… దానికి తను సందేహించలేదు, అది వేరే సంగతి…
అలా అనైతికంగా చిట్ చాట్ రికార్డు చేస్తున్నారనే సంగతి తెలిసీ రేవంత్ ఎప్పుడూ జర్నలిస్టుల మీద నెగెటివిటీ ఏమీ ప్రదర్శించలేదు… ఎలాగూ మొబైల్స్ బయట పెట్టి పోవాలి, కానీ నిన్న సీఎంగా చిట్‌చాట్ సమయంలో కూడా సెక్యూరిటీ సిబ్బంది కొందరు జర్నలిస్టుల పెన్నుల్ని తీసేసుకుంటే… వెంటనే సీఎంపీఆర్వో సెక్యూరిటీ వాళ్ల నుంచి ఆ పెన్నులు వాపస్ చేయించాడు… బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకునే హరీష్ రావు పెన్నులు- గన్నులు అనే వ్యాఖ్యలు చేసి ఉంటాడు… ఏదైనా స్థూలంగా పరిశీలించాలనే వివేచన హరీష్ వ్యాఖ్యల్లో లోపించింది…!!
Share this Article