ఎలివేషన్, ఎలివేషన్, ఎలివేషన్…. ఐ డోన్ట్ లైక్ ఎలివేషన్… బట్ ఎలివేషన్ లైక్స్ మి… సో, ఐ కాన్ట్ అవాయిడ్ ఎలివేషన్….. ఇంకా తెలుగు ఇండస్ట్రీలో కొందరు హీరోలు ఇవే మైకంలో ఉన్నట్టున్నారు… త్వరత్వరగా దెబ్బతినబోయేది కూడా వాళ్లే… ప్రత్యేకించి గోపీచంద్, రామ్ వంటి హీరోలు… వాళ్ల బిల్డప్పులు, హీరోలుగా వాళ్ల ఎలివేషన్ మంచి కంటెంట్, మంచి దర్శకత్వం, ప్రేక్షకుడిని చప్పట్లు కొట్టించగల కొత్తదనం ఉంటేనే వర్కవుట్ అవుతాయి…
తెర మీద హీరో మొహం కనిపించగానే, అర్థంపర్థం లేని నాలుగు వైర్ల ఫైట్లు చూడగానే విజిళ్లు వేసే రోజులు కావు ఇవి… పైగా అడ్డగోలు టికెట్ రేట్లతో వాచిపోతున్న రోజులివి… ఏమాత్రం నచ్చకపోయినా బయటికి రాగానే ఛీత్కరించేస్తాడు… ఆ మౌత్ టాక్ దెబ్బ మామూలుగా ఉండదు… ఎన్ని ఫేక్ రివ్యూలు రాయించుకున్నా, ఎన్ని డప్పు వీడియోలు యూట్యూబ్‌లో పెట్టించుకున్నా మౌత్ టాకే సినిమాను దెబ్బతీయాలన్నా… హిట్ చేయాలన్నా..! వారియర్ అనే పోతినేని రాముడి తాజా సినిమా బాపతు ఫార్ములా రివ్యూ కాదు ఇది… మన హీరోలు ఇంకా ఆ మూస పోకడల నుంచి బయటపడలేకపోతున్నారనే నిజం చెప్పుకోవడం… జాలిపడటం…
ఐనా ఇంకా ఈ సూపర్ పోలీస్ కథలు అల్లుతారురా నాయనా… జస్ట్, అలా సీన్ కట్ చేయగానే ఓ డాక్టర్ ఐపీఎస్ అయిపోయి, ఏకంగా డీఎస్పీ పోస్టింగుతో వస్తాడట… రాగానే విలన్‌తో డిష్యూం డిష్యూం… ఏ కాలంలో ఉన్నారో ఈ కథకులు, ఈ దర్శకులు… (గొప్ప విలన్లు ఎప్పుడూ పోలీసులతో వ్యక్తిగత వైరానికి, పోలీస్ వ్యవస్థతో ఘర్షణకు దిగరు… వాడుకుంటారు… ఐపీఎస్‌ల దుస్తులకు కూడా ఎప్పుడూ దుమ్ము అంటదు… అసలు సర్వీస్ రివాల్వర్ వాడే అవసరం 90 శాతం మంది ఐపీఎస్‌లకు తమ కెరీర్ మొత్తంలోనే రాదు…) ఈ సినిమా వార్తల కవరేజీలో ఆహా లింగుస్వామి, ఓహో లింగుస్వామి అంటూ మస్తు బిల్డప్ ఇచ్చారు కానీ అసలు తనకున్న హిట్ సినిమాల రీసెంట్ ట్రాక్ రికార్డు ఏముందని..?
Ads
మాస్, మస్తు ఎనర్జీ అనే డొల్ల మాటలు కూడా వినిపించాయి… మాస్ అంటే డిష్యూం డిష్యూం కాదురా బాబూ… మాస్ అంటే రిక్లెయిన్ కేటగిరీ దగ్గర నుంచి బెంచీ ప్రేక్షకుడి దాకా అందరినీ కనెక్టయ్యే సినిమా… ఊరమాస్ అంటే దంచికొట్టుకునే సీన్లు కాదు, తాగి ఐటమ్ సాంగుల్లో ఊగే హీరోయిజం కాదు… హీరో ఎనర్జీ అనే పదానికి అర్థం లేదు… గ్రాఫిక్స్, వైర్ ఫైట్ల గురించి ఇవ్వాళ చిన్న పోరడిని అడిగినా చెబుతాడు.. ఫాఫం, లింగుస్వామికి ప్రజెంట్ ట్రెండ్ అర్థమైనట్టు లేదు… ఈ ఎనర్జిటిక్ ఫైట్లు సంపూర్ణేష్ బాబు కూడా చేయగలడు…
ఈరోజుల్లో ప్రేక్షకుడు థియేటర్‌కు రావాలంటే ఏదైనా కొత్తదనం కావాలి, కథలో లేదా కథనంలో… వైవిధ్యం కావాలి… మంచి బీజీఎం కావాలి… కథలో లాగ్ ఉండొద్దు… కథనం గ్రిప్పింగ్‌గా ఉంటే కొన్ని లాజికల్ లోపాలున్నా కొట్టుకుపోతాయి… అంతేతప్ప హీరోయిజం ఎలివేట్ చేసే బిల్డప్పులు, బిల్డప్పులు, బిల్డప్పులు కావు… సీటుకు కట్టిపడేసే డ్రామా కావాలి…
తెలుగు సినిమా ఫార్ములా మాస్ కమర్షియల్ సినిమా అనగానే ఓ క్రూరుడైన విలన్, మొదట తను దెబ్బతిని, తరువాత తాను చితక్కొట్టే హీరో… సినిమా కాబట్టి పాటల కోసం ఓ అందమైన హీరోయిన్… హీరో హీరోయిన్ల లవ్వు… లింగుస్వామికి అర్థమైంది ఇంతే… ఇలాంటి దర్శకులను నమ్ముకుని పోతినేని రాముడే కాదు, ఆది పినిశెట్టి కూడా దెబ్బతిన్నాడు… ఫాఫం, ఒకప్పుడు దేవిశ్రీప్రసాద్ అంటే అదో ఆకర్షణ… వారియర్‌లో తన బీజీఎం చూస్తే ఫాఫం అనిపిస్తుంది…
కొన్ని సీన్లు హఠాత్తుగా ఆగిపోతాయి… కొన్ని పాత్రలు మస్తు బిల్డప్ ఇచ్చి, ఇంకేం చేయాలో అర్థంగాక మాయమవుతాయి… కొన్ని తెలియని అరవ మొహాలు కనిపిస్తాయి… ఆది, రామ్ తప్ప ఇంకెవరికీ స్క్రీన్ స్పేప్ లేదు, నటనకు స్కోప్ లేదు… థియేటర్ బయటికి వచ్చాక ఏదైనా ఒక పాట పల్లవిని, ఓ మంచి డైలాగ్‌ను చెప్పమని ప్రేక్షకుడిని అడిగి చూడండి… బ్లాంక్ ఫేస్ పెడతాడు… అదే ఈ సినిమా భవిష్యత్తు…!! ఏమాటకామాట… ఆదిలో అదరగొట్టగల నటుడున్నాడు… కానీ ఈరోజుకూ సరిగ్గా మన సినిమాల్లో వాడుకోబడలేదు… అవును గానీ రాముడూ… సక్సెస్ టూర్లు, సూపర్ కలెక్షన్ల వార్తలు వెంటనే స్టార్ట్ చేస్తున్నారా లేదా..?!
Share this Article