యూట్యూబ్‌లో అనుకోకుండా ఓ సినిమా పాట లిరికల్ సాంగ్ అని కనిపించింది… ఇలా విడుదల చేయడం, ప్రమోషన్ కోసం పరిపాటే కదా… హఠాత్తుగా దృష్టి గీత రచయిత కాసర్ల శ్యాం అని కనిపించింది… ఈమధ్య తెలంగాణ జీవితాన్ని, సంస్కృతిని ప్రతిబింబించే పాటలు వస్తున్నాయి కదా తన కలం నుంచి… ఓపెన్ చేశాను…
వివరాల్లోకి వెళ్తే… టీసీరీస్ తెలుగు నిర్మాణం అట, హీరో ఎవరో యువచంద్ర కృష్ణ అని కనిపించింది… వర్ధమాన నటుడు అయి ఉంటాడు… పేరెప్పుడూ వినలేదు… కాస్త ఇంట్రస్టింగ్ అనిపించింది ఈ సాంగ్ పాడింది రాహుల్ సిప్లిగంజ్… గతంలో బిగ్‌బాస్ ఫేమ్, తరువాత ఆస్కార్ సాంగ్ నాటునాటు ఫేమ్… పబ్బులు, అమ్మాయిలు గట్రా ఏవేవో గాసిప్స్ కూడా చదివినట్టు గుర్తు…
కాకపోతే ఓ పూర్ బ్యాక్ గ్రౌండ్ నుంచి పాట మీద మక్కువతో ఎదిగాడు, ఈమధ్య సూపర్ సింగర్ షో చూస్తుంటే కూడా తనొక్కడే జడ్జిగా సరైన రీతిలో జడ్జ్ చేస్తున్నట్టు అనిపించింది… ఈ పాట కాస్త భిన్నమైన గొంతుతో పాడాడు… బాగుంది… ట్యూన్ కూడా బాగుంది… శేఖర్ చంద్ర అట సంగీత దర్శకత్వం… వీటన్నింటికీ మించి హీరోయిన్ అనన్య నాగళ్ల పేరు విశేషంగా కనిపించింది… మంచి మెరిట్, అందం ఉన్నా సరే ఆమె పరుగు జోరుగా లేదు ఎందుకో మరి…
Ads
సరే, తీరా పాట చూస్తుంటే ఇన్ని విశేషాలతో సంబురం అనిపించిన నాకు ఒక్కసారిగా నీరసం ఆవహించినట్టయింది… ఒకసారి ఆ లిరిక్ చదవండి, తరువాత చెబుతా…
వవ్వారే వారే వవ్వా
మెల్లంగా పోద్దిడిశే
పొయ్యి లోన పన్న పిల్లి లేవక పాయే
కాపోల్ల బాయి కాడ ఆడోళ్లొచ్చి నిలిశే
శాంతాడు బొక్కెన గూడ ఎండి పాయే
ఏడ సూసిన ఒకటే తండ్లాటే ఆయే
దారి పొడుగున మొలిశే తుమ్మ ముండ్లాయే
జగమొక జగమొక జగమొక రాయి టిక టిక సప్పుడు కొట్టిందా
బుగ బుగ బుగ బుగ బుగ బుగ మంటూ సుట్టకు నిప్పే పెట్టిందా
వవ్వారే పచ్చా పచ్చగ మెరిసేటి నా ఊరే
ఇయ్యాల మసకల మసకల పొగనే చూరే
సచ్చినోడు బతికిపోయినాడు
బతికినోడు ఈడ సస్తాండు
దొంగల్లో ఎవడు దొర లేడు
దొరల్లో దాగే దొంగోడు
నోరు లేని ఈ జీవాలన్నీ మొత్తుకుంటాయా
ఊరుకోక పొద్దుగాల్ల లేస్తే సాలు ఏదో చిక్కు
ముద్ద లేకపోతె ఏంది మన్ను బుక్కు
బండరాయి లెక్క అయ్యిపోయే బతుకు
బండలాంటి బాలమ్మే ఊరికి దిక్కు
గోశి గొంగడేశినా ముల్లుగర్ర తీశినా
కొండలెక్కి జూశినా దుమ్ము దూళి దులిపినా
అంబటాల్ల దాటినా సందె పొద్దు గూకినా
ఆడేది ఎప్పటాటేనా టుర్ ..
వవ్వారే పల్లె మల్ల తెల్లారేదెప్పటికో
కాలేటి కడుపులు సల్లారేది ఎపుడో
చూస్తే బొచ్చెడు మంద
తోక బెత్తెడు రా
గాల్లో దీపం బెట్టి మొక్కర ఎలమంద
జగమొక జగమొక జగమొక జగమొక సిందులు తొక్కర జజ్జనక
చక చక చక చక చక చక చక చక తేలదు ఈ లెక్క
ఊరిలో కరువు కావచ్చు, గత్తర కావచ్చు, ఇంకేదైనా విపత్తు కావచ్చు… పల్లె మసకబారిన దురవస్థకు అద్దం పట్టే పాట… మల్ల ఎప్పుడు తెల్లారుతదో అని రచయిత బాధపడతాడు ఇందులో… అందుకే ఏడ సూసిన ఒకటే తండ్లాటే ఆయే, దారి పొడుగున మొలిశే తుమ్మ ముండ్లాయే వంటి మంచి పదాలు పడ్డయ్ పాటలో… కానీ దర్శకుడు ఏం చేశాడు..?
ఏవో పిచ్చి గెంతులు వేయించాడు నటుడితో… పోనీ, అదైనా ఇంప్రెసివ్ ఉందా అని చూస్తే అదీ లేదు… ఆ పాటలో ఆత్మ ఏంటి..? దర్శకుడికి అర్థమైంది ఏమిటి..? జనానికి చూపించింది ఏమిటి..? చూడబోతే తనకు గోరటి పాట ‘పల్లె కన్నీరూ పెడుతుందో’ పాటను అప్పగించినా సరే గిట్లనే షూట్ చేసేటట్టున్నడు… సో, పాట కంటెంటు, పాడిన గొంతు, మోగిన ట్యూన్ ఎలా ఉంటేనేం..? ఇలా ఆ పాటను హత్యచేశాక… ఫాఫం పొట్టేల్..!!
Share this Article