.
అధికారాంతమున చూడవలె అయ్యవారి సౌభాగ్యముల్!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల బాడీ లాంగ్వేజ్ టీవీల్లో పరిశీలించిన తర్వాత నాకు వారిలో అధికారానికి ముందు.. అధికారం తర్వాత కొట్టొచ్చిన మార్పు కనిపించింది !
Ads
అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఒక మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు నవ్వుకు దూరమైనట్టు కనిపిస్తుంది. ఎప్పుడూ కూల్ గా ఉండే ఆయన మాటల్లో ఇప్పుడు అసహనం తొంగి చూస్తుంది. మొట్టమొదటిసారిగా తల్లో తెల్ల వెంట్రుకలు.. నెరిసిన గడ్డం కనిపించింది
ఫేస్ రీడింగ్ చూస్తే చాలా డల్ గా అనిపిస్తుంది. పరాజయం తాలూకు నిస్పృహ ముఖంలో బయటపడిపోతుంది. ముఖంలోనే కాదు చేతల్లో కూడా కనిపిస్తుంది. అసెంబ్లీకి వెళ్లాలనిపించకపోవడం .. ఎక్కువ సమయం ఇంటికే పరిమితం అవ్వడం.. అప్పుడప్పుడు హాల్లోకొచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడి వెళ్ళిపోవడం ఇత్యాది మార్పులు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
ఇప్పటికీ జనంలోకి వెళ్తే ఈయనకు బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. అదే ఉత్సాహంతో జనంలోకి వెళ్ళి ప్రజల సమస్యలపై ప్రభుత్వంతో పోరాటం చేస్తే జననేతగా మిగిలిపోతారు. ఐదేళ్ల తర్వాత అధికారానికి మార్గం సుగమం అవుతుంది.
వైస్ వెర్సా గా ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన ఆయనలో కూడా అధికారం దక్కక ముందు ఇంచుమించు ఇలాటి నిస్పృహలే కనిపించాయి. ఎప్పుడూ హుందాగా కనిపించే ఆయన ఎన్నికల ముందు ఎండిపోయి పీక్కుపోయిన వాడిలా కనిపించారు.
ఎంతటి పరిస్థితుల్లో అయినా నిబ్బరంగా ఉండే ఆయన ఆఖరికి ప్రెస్ మీట్లో ఏడ్చారంటే ఎంత ఫ్రస్టేట్ అయ్యారో తెలుస్తుంది. భార్యని ట్రోల్ చేసినందున ఏడ్చేంత సున్నిత మనస్కుడు కాదు ఆయన. (గతంలో కూడా ఇంతకంటే ఎక్కువగా ఆయన కుటుంబాన్ని ట్రోల్ చేశారు)
మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ముఖంలో పూర్వపు కళ వచ్చింది. అరుదుగా నవ్వే మనిషి అప్పుడప్పుడు నవ్వుతున్నారు. ఇదంతా పవర్ మహత్యం…
ఇక ఇంకో మాజీ ముఖ్యమంత్రి అయితే ఏకంగా అస్త్ర సన్యాసం చేసి ముఖమే కనిపించకుండా సుదూరంగా ఫామ్ హౌస్ లో కాలక్షేపం చేస్తున్నారు. గతంలో కేవలం ఇద్దరు ఎంపీలతో పార్లమెంట్లో తెలంగాణా వాయిస్ సమర్థవంతంగా వినిపించిన చరిత్ర ఈయనకు ఉంది.
పదవిలో ఉన్నప్పుడు ప్రగతి భవన్ లో ఈయన ప్రెస్ మీట్ల కోసం విలేకరులతో పాటు జనం కూడా ఎదురుచూసేవారు. అంతటి వాక్ చాతుర్యం ఉన్న వక్తగా ఆయనకు పేరు. అలాంటిది ఆయన ప్రెస్ మీట్లు లేవు, అసలు కనిపించడమే లేదు.
కాంగ్రెస్ వాళ్లు వాళ్లలో వాళ్ళు తన్నుకుని అధికారం కోల్పోతే నన్ను లేపండి.. అప్పుడు వస్తా జనంలోకి అన్నట్టుగా ఉంది ఆయన పరిస్థితి.
రెండు రాష్ట్రాల్లో నాయకులు ప్రతిపక్ష నాయకుని పాత్ర సమర్థవంతంగా పోషించాలనీ.. తద్వారా ప్రజా సమస్యలపై పోరాటం చేసి ప్రజల పక్షాన నిలబడాలనే ప్రాథమిక సూత్రాలను పెద్దగా పట్టించుకున్నట్లు లేదు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం సమర్థవంతమైన పాత్ర పోషించినప్పుడే చక్కటి పాలనను రాబట్టగలం అన్న విషయం వాళ్ళకి తెలియంది కాదు.
రాజకీయాల్లో శాశ్వత విజయాలు.. శాశ్వత పరాజయాలు ఉండవని కూడా వారికి తెలుసు. అయినా అధికారం అప్పగిస్తేనే పని చేసి చూపిస్తాం.. అనుకుంటూ ప్రతిపక్ష పాత్రను నామమాత్రంగా నిర్వహించటం ఎంత వరకు సబబు ?
ఒక్క ఐదేళ్లు అధికారం లేకపోయినంత మాత్రాన ఆర్దికంగా వారికొచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ ప్రజాస్వామ్యంలో సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషించకపోతే అంతిమంగా నష్టపోయేది ప్రజలే!
కాబట్టి ఇకనైనా ఇరువురు నేతలు పూర్తిస్థాయిలో ప్రతిపక్ష పాత్రను పోషించడమే కాకుండా అసెంబ్లీలో కూడా తమ గళాన్ని వినిపిస్తారని ఆశిద్దాం !
పీఎస్: నాయకులు పూర్తి స్థాయిలో సమర్ధవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని కోరుకుంటూ పెట్టిన పోస్టు ఇది.. ఇందులో ఏ ఒక్కరి మీద అభిమానం కానీ ద్వేషం కానీ లేవు.. (అందుకే వ్యక్తిగతంగా పేర్లు పెట్టలేదు) నా పరిశీలన అందరికీ నచ్చాలని లేదు.. ఇందులో కూడా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు…. పరేష్ తుర్లపాటి
Share this Article