.
తండ్రి ఒక సుప్రసిద్ధ నటుడు… మాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ మోస్ట్ హీరో… ప్రాంతాలకతీతంగా పేరు సంపాదించిన వెర్సటైల్ ఆర్టిస్ట్… అలాంటి నటుడి కొడుకు సాధారణంగా నటుడే అయ్యే అవకాశాలే ఎక్కువ. వారసత్వ రాజకీయాలు, వారసత్వ ఉద్యోగాలెలాగో.. వారసత్వ నటన కూడా మనం చూస్తున్నదే.
అయితే, తానూ తండ్రిలాగే మంచి నటుడు. బాలనటుడిగా అవార్డ్సూ సాధించాడు. తాజాగా కూడా ఓ పెద్ద హిట్ ఇచ్చిన హీరో. కానీ, ఇంతవరకే అయితే… అతడి గురించి మనం ఇంతగా మాట్లాడుకోం. చాలామంది నాన్నలు, అన్నలు, తల్లిదండ్రుల నుంచి అందివచ్చిన వారసత్వంతో ఎదిగినవారిలా తాను పరిమితమైపోతే కూడా పెద్దగా మాట్లాడుకోవాల్సిన, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన జాగా ఉండేది కాదు.
Ads
కానీ, అతనో భిన్నమైన క్యారెక్టర్. తండ్రి సినిమా తెరపై మాత్రమే భిన్నమైన క్యారెక్టర్స్ పోషిస్తే… తాను నిజజీవితంలోనే అలాంటి ఓ వైవిధ్యమైన క్యారెక్టర్. అందుకే అతడి గురించి ఈ మన ముచ్చట!
అతనే ప్రణవ్. మళయాళ స్టార్ హీరో మోహన్ లాల్ తనయుడు. తండ్రి సంపాదించిన ఆస్తి.. వారసత్వంగా అందివస్తూ తన ప్రతిభ కూడా తోడై హిట్టవుతున్న సినిమాలు.. సంఘంలో పేరు… ఇవన్నీ సరే. అందులోనే తేలలేనంత మునిగిపోవచ్చు. అంత బిజీ ఇండస్ట్రీ అది.
కానీ, ప్రణవ్ మోహన్ లాల్ ఓ వెర్సటైల్ పర్సనాలిటీ. ప్రయాణాలంటే ఇష్టపడతాడు. తనకు ఛాన్స్ దొరికింది కదా.. తండ్రి ఇండస్ట్రీలో పీక్స్ లో ఉన్నాడు.. గోల్డెన్ స్పూన్ పుట్టుక.. కాబట్టి అవకాశం ఉండగానే దున్నిపడేయాలన్న ఆశ లేదు.. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చింత అంతకన్నా అవసరం లేదు.
అందుకే ఇప్పుడు స్పెయిన్ బాట పట్టాడు. ఎక్కడో స్పెయిన్ లో ఓ పొలంలో పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడూ గొర్ల కాపరి అవతారమెత్తుతుంటాడు. గుర్రాలు, మేకలు కాస్తూ పశులపాపడైపోతాడు. క్వైట్ ఇంట్రెస్టింగ్ కదా…?
జస్ట్ లైక్ IN TO THE WILD సినిమా తరహాలోనే సాగుతోంది ప్రస్తుతం ప్రణవ్ జీవితం.
తన జీవితాన్ని తాను పోషించుకునేందుకు వ్యవసాయ క్షేత్రాల్లో వ్యవసాయ కూలీ పనులు చేస్తున్నాడు ప్రస్తుతం ప్రణవ్. తన స్టార్ నటుడి కొడుకని, తానూ ఓ స్టార్ నటుడేనన్న సంగతి స్పెయిన్ లో ఎందరికి తెలుసు..?
అందుకే, చెప్పిన పని చేస్తే భోజనం పెట్టి షెల్డర్ ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. అలా, డబ్బు తీసుకుని పని చేయడం కాకుండా.. work away ప్రోగ్రాంలో భాగంగా పని చేస్తే షెల్టర్ దొరికి, భోజనం పెట్టే చోట.. మేకలు, గుర్రాలు కాస్తున్నాడు. కానీ, ఒంటరి ప్రణవ్ కు స్నేహితులూ ఎక్కువే. పుస్తకాలు, గిటార్ పై కాసింత సంగీతం అవే అతగాడి స్నేహితులు!
2002లో బాలనటుడిగా ఒన్నమన్ లో తొలిసారి నటనలోకి ప్రవేశించాడు. తండ్రి నటనా వారసత్వం… అతడికి ఇండస్ట్రీలోకి రావడానికి ఓ గ్రీన్ కార్డ్ ఎంట్రీ. 2003లో పునర్జని అనే సినిమాలో నటించాడు. ఉత్తమ బాలనటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డ్ అందుకున్నాడు. 2018లో హీరోగా మొట్టమొదటి సినిమా ఆదితో అలరించాడు.
ఆ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా కూడా ఆది సినిమా రికార్డులకెక్కింది. అయితే, ఒకవైపు సక్సెస్ సినిమాలు చేస్తూ.. అదే స్థాయిలో ఆఫర్స్ వస్తూ… తను కింద పడిపోయినా లేపడానికి తండ్రి మోహన్ లాల్ రూపంలో బలమైన బేస్ మెంట్ ఉన్నా… ఇవేవీ ప్రణవ్ ను అంతగా ఆకట్టుకోనట్టున్నాయి.
తన లోకం వేరు. తన ఆలోచనలు వేరు. అందుకే, ఇవేవీ అడ్డుకోలేకపోయాయి. కట్ చేస్తే ప్రణవ్ ఇప్పుడు స్పెయిన్ లో ఉన్నాడట. అక్కడ గొర్లను కాస్తాడు.. వ్యవసాయం చేస్తాడు.. తన బతుకేదో తాను బతుకుతాడు… తన పుస్తక స్నేహితులను మాత్రం వెంట పెట్టుకుని ఎప్పటికప్పుడు చదువుతుంటాడు. తన వెంట పెట్టుకునే గిటార్ పై లైట్ మ్యూజిక్ తో.. ప్రకృతిలో ఒదిగిపోతాడు.
ఇవన్నీ ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో ప్రణవ్ తల్లి… మోహన్ లాల్ సతీమణి సుచిత్ర పంచుకోవడంతో వెలుగులోకొచ్చిన విషయాలు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుంటూ తమ తర్వాత తరం కూడా తమలాగే ఉండేలా వారసులను నటులు చేస్తున్నవారు, రాజకీయాల్లోకి తీసుకొస్తున్నవారు, కంపెనీల్లో సీఈవోలగా కూర్చోబెడుతున్నవారెందరో!
అలాంటి అవకాశం ఉండీ కూడా ప్రణవ్ విభిన్నమైన… వైవిధ్య జీవనాన్ని కోరుకుంటూ బహుదూరపు బాటసారిలా ఓ పర్యాటకుడై పచార్లు వేస్తుండటం విశేషం.
ప్రణవ్ తన మాట వింటాడనే భావన… పెడచెవిన పెట్టడనే నమ్మకం చాలామందిలో ఉందని.. తన కజిన్స్ కూడా పదే పదే చెబుతుంటారని చెబుతోంది సుచిత్ర. అయితే, అది నిజమేనని.. కానీ, తాను నమ్మిన విషయాలకు కట్టుబడే మనస్తత్వం కూడా ప్రణవ్ లో కనిపిస్తోందంటోంది.
తన కొడుకు మొండివాడేం కాదు.. అవునంటే వద్దనీ.. వద్దంటే అవునని వారించే బాపతు అంతకన్నా కాదు… కానీ, తాను సరైందని నమ్మినదాన్ని మాత్రం ఆచరించి తీరుతాడని చెప్పుకొచ్చారావిడ.
ప్రణవ్ చివరగా 2024లో వర్షాగల్కు శేషం అనే సినిమాలో నటించాడు. ఆ తర్వాత అతడి ప్రాజెక్టేంటన్న ఒకింత ఎదురుచూపులు అటు మోహన్ లాల్ అభిమానుల్లోనూ.. సహజంగానే, మోహన్ లాల్ వంటి స్టార్ నటుడి కొడుకుగా ఏర్పడ్డ ప్రణవ్ అభిమానుల్లో ఉన్నా.. అలాంటి ప్రాజెక్టేదీ ఇప్పటివరకూ ప్రకటనకు నోచుకోలేదు. ప్రణవ్ తరపున తాను స్క్రిప్ట్స్ వింటున్నాని.. కానీ, ప్రస్తుతం ప్రణవ్ మాత్రం సినిమాపై అంతగా ఆసక్తిగా లేడని… తనకు నచ్చినదారిలో తాను వెళ్తున్నట్టు చెప్పుకొచ్చింది సుచిత్ర.
2022లో విడుదలైన హృదయం సినిమాతో అద్భుతమైన విజయాన్ని సాధించిన ప్రణవ్.. 2016లో ఒకసారి మాతృభూమి పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు అతడి అంతరంగాన్ని బహిర్గతం చేసేవి. రీల్ లైఫ్ లో జీవించాలనుకునేంతగా తనను ఇప్పటివరకూ ఏ స్క్రిప్టూ ఆకర్షించిన దాఖలాల్లేవంటూ ప్రణవ్ చెప్పిన మాటల్లోని ఫిలాసఫీ.. అతడు నటులను మించిన క్యారెక్టర్ అనేది మాత్రం పట్టిచూపించేది…. (రమణ కొంటికర్ల)
Share this Article