సిట్టింగులందరికీ టికెట్లు ఇచ్చి కేసీయార్ చేతులు కాల్చుకున్నాడు… 2018లోనే అందులో చాలామందిపై ప్రజల్లో వ్యతిరేకత ఉండేది… వాళ్లకు అప్పుడూ టికెట్లు ఇచ్చి, మళ్లీ మొన్న టికెట్లు ఇచ్చి స్థూలంగా తనే దెబ్బతినిపోయాడు… వైనాట్ 175 అని కలలు కంటూ మురిసిపోతున్న జగన్‌కు తత్వం బోధపడింది… కళ్లు తెరిచాడు… మరి నా సంగతేమిటని ఆలోచించాడు…
స్థానికంగా ప్రజల ఆదరణ చూరగొనలేని, వ్యతిరేకత పెంచుకున్న నాయకులకు మళ్లీ అవకాశాలు ఇస్తే పరిస్థితులు ఎదురు తిరుగుతాయని గ్రహించాడు… సర్వేలకు పూనుకున్నాడు… పైగా మంచైనా చెడైనా తన వెంట వచ్చేవాళ్లను అలాగే ఉంచుకోవడానికి తనేమీ వాళ్ల నాన్నలాగా వైఎస్ కాదు… ఎక్కడ ఏమాత్రం సందు దొరికినా చంద్రబాబు దూరిపోతాడని తెలుసు… ఏపీ విభజన వేళ కూడా గెలుపు మీద మస్తు ధీమాతో ఉంటే మధ్యలో చంద్రబాబు తన్నుకుపోయిన చేదు అనుభవం ఉందిగా…
సర్వేల్లో వీక్ అని తెలిసిన నాయకుల్ని మార్చేయాలనే నిర్ణయానికి వచ్చాడు… కొందరికి హింట్స్ కూడా అందాయి… తనకు టికెట్టు రాదు అని తేల్చేసుకున్న ఫస్ట్ వికెట్ మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి… పార్టీని, పదవిని విడిచిపెట్టేశాడు… వెంటనే జగన్ అక్కడ ఓ బీసీ నాయకుడిని ఇన్‌చార్జిగా ప్రకటించేశాడు… ఇంకొన్ని వికెట్లు పడొచ్చు కూడా… నిన్న పలు నియోజకవర్గాల ఇన్‌ఛార్జులను కూడా మార్చేశాడు… ఎన్నికలు రాబోతున్నయ్ కదా… పార్టీపరంగా ఈ మదింపు, మార్పుల్లో ఇంకా వేగం ఉంటుంది…
Ads
అవునూ, నిజంగానే పార్టీ సిట్యుయేషన్ ఏమిటి..? వైనాట్ 175 అని కలలు గనే పరిస్థితి ఉందా..? అంతటి కేసీయారే మొన్నటి ఎన్నికల్లో బోల్తాకొట్టాడు… మరి ఏపీలో జగన్ పరిస్థితి ఏమిటి..? 2.57 లక్షల శాంపిళ్లతో తాజాగా జరిగిన సర్వే ఒకటి చెప్పుకుందాం… దాని ప్రకారం వైఎస్సార్సీపీ దక్కించుకోబోయే వోట్ల శాతం 50.10 శాతం… టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తే వాటికి దక్కేది 43.12 శాతం… బీజేపీ, కాంగ్రెస్ ఎట్సెట్రా కలిపి 2.08 శాతం వోట్లు సాధిస్తే, ఇంకా అటూఇటూ తేలనివి 4.70 శాతం వోట్లు…
సో, ఈ లెక్కన వైసీపీ కంఫర్ట్‌గా 113 సీట్లను గెలుచుకోగలదు… 16 సీట్లలో టఫ్ ఫైట్ ఉండొచ్చు… 46 సీట్లను ప్రత్యర్థులకు వదిలేస్తుంది… ఐతే షెడ్యూల్, నోటిఫికేషన్ జారీ తరువాత, పోలింగ్ నాటికి వోట్ల శాతాలు మారొచ్చు కూడా… కాకపోతే జగన్ ను ఇప్పటికిప్పుడు కుర్చీ దింపేంత వ్యతిరేకత లేదు అనేది ఈ సర్వే చెబుతోంది… ఐతే ప్రభుత్వ వ్యతిరేకత మాత్రం ఉంది… మునుపు 151 గెలిచినంత సానుకూలత ప్రస్తుతానికి లేదు…
26 మంది సిట్టింగులు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు…
ఏమో, జగన్ పరిగణనలోకి తీసుకుని, మార్పులకు దిగిన సర్వే మరొకటి కావచ్చు కూడా..! ఐతే విధేయతలకన్నా గెలుపు సమీకరణాలు, సర్వే ఫలితాలను బట్టే టికెట్లు… తనకు దగ్గరి బంధువులైనా సరే టికెట్లు దక్కకపోవచ్చు… టీడీపీ, జనసేనలను తను తేలికగా తీసుకోవడం లేదు… స్థూలంగా చూస్తే గ్రామసచివాలయాలు, రూపు మారిన స్కూళ్లు, వివిధ వర్గాలకు పంచుతున్న డబ్బు ఎట్సెట్రా జగన్‌కు ప్లస్ పాయింట్స్… రాజధాని, పోలవరం వంటి మైనసులూ బోలెడు… ఆర్థిక క్రమశిక్షణ లేదు, కార్పొరేషన్ల పదవులు, సలహాదారుల పదవులైతే ఓ అరాచకం… ఇదీ నా విజయం అని చెప్పుకునే ఓ పెద్ద ప్రాజెక్టో, ఓ పెద్ద పరిశ్రమో లేదు…
సేమ్, కేసీయార్‌లాగే జగన్ జనాన్ని కూడా కలవడం లేదు… ఎన్నికలకు ముందు జగన్‌కూ ముఖ్యమంత్రి జగన్‌కూ బోలెడంత తేడా… మొన్న భారీ వర్ష నష్టాల్ని అంచనా వేయడం కోసం వెళ్లి, పొలం గట్ల మీద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి తను పరిశీలిస్తున్న సీన్లు ఆ పార్టీ సానుభూతిపరులకే చిరాకెత్తించాయి… జగన్ వ్యక్తిగత వ్యవహారధోరణిలో హ్యూమన్ టచ్ పోయింది ఎప్పుడో… ఐతే ఖాతాల్లోకి వచ్చిపడుతున్న డబ్బు ఆ ప్రభావం లేకుండా చేస్తోంది కొంత…
ఈరోజుకూ ఎవరు సీఎం కావాలని అడిగితే 58 శాతం మంది జగన్‌కే జై అంటున్నారు… చంద్రబాబుకు జస్ట్, 29 శాతమే… పవన్ కల్యాణ్ పట్ల 7 శాతం సానుకూలత… వైసీపీకి ఎస్సీల్లో, బీసీల్లో, ఎస్టీల్లో, ముస్లింల్లో, మహిళల్లో మంచి హోల్డ్ కనిపిస్తుండగా… ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల్లో, యువతరంలో, కాపుల్లో టీడీపీ- జనసేన పట్ల సానుకూలత కనిపిస్తోంది… ముందే చెప్పుకున్నట్టు… ఇది వర్తమానం… రాబోయే రోజుల్లో ఏమిటనేది ఇప్పుడే చెప్పలేం..!! జగన్‌కు గెలుపు తప్పనిసరి… లేకపోతే ఇన్నాళ్లూ వెన్నుదన్నుగా ఉన్న బీజేపీ కూడా ‘‘వదిలేస్తుంది’’… అందుకే ‘‘దిద్దుబాటు’’కు పూనుకున్నాడు అర్జెంటుగా…!!
Share this Article