.
ఛ, మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అన్నారు, ఏవీ 42 శాతం రిజర్వేషన్లు, ఢాం ఢూం అంటూ కేటీయార్ ఎగిరాడు… సహజం… ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, పాలకపక్షం ఏం చేసినా బొక్కలు వెతకాలనే ధోరణి…
నాన్సెన్స్, అబ్సర్డ్… 42 శాతం రిజర్వేషన్ల బంతిని కేంద్రం కోర్టులోకి పంపించేసి, చేతులు దులుపుకున్నాడు రేవంతుడు… కామారెడ్డి డిక్లరేషన్‌కు పాతర అని నమస్తే తెలంగాణ రెండు టన్నుల విషాన్ని కుమ్మేసింది… సహజం… యథా బీఆర్ఎస్, తథా నమస్తే…
Ads
అసలు ఈ కులగణనే పెద్ద ఫార్స్, తప్పుడు లెక్కలు, అప్పట్లో కేసీయార్ చేయించిన సర్వేతో పోలిస్తే బీసీల జనాభా ఎలా తగ్గుతుంది అని బీసీ సంఘాలు కస్సుమంటున్నాయి… మీటింగులు పెట్టి మరీ రెడ్లను బూతులతో ఎడాపెడా తిడుతున్న ఓ ఎమ్మెల్సీ ఆ కులగణన రిపోర్టులనే చింపి పడేస్తున్నాడు…
సరే, అప్పట్లో రాహుల్ గాంధీయే మన్మోహన్ తీసుకొచ్చిన ఓ ఆర్డినెన్స్‌ను మీడియా మీట్‌లోనే చింపిపారేశాడు.,.. కాంగ్రెస్ పార్టీలో కావల్సినంత స్వేచ్ఛ… పైన అధ్యక్షుడి దగ్గర నుంచి దిగువన కార్యకర్త దాకా, తమ అభిప్రాయాల్ని వ్యక్తీకరించొచ్చు…
మరోవైపు ఎస్సీ వర్గీకరణ… మూడు గ్రూపులు… ఇది అమల్లోకి వస్తే మాదిగల సుదీర్ఘ పోరాటానికి అది విక్టరీ పాయింట్ అవుతుంది… సహజంగానే మాల నేతలు (అందులో కాంగ్రెస్ వాళ్లు కూడా) దీన్ని వ్యతిరేకిస్తున్నారు… ఎన్నాళ్లుగానో వాళ్లు ఎంఆర్‌పీఎస్ పోరాటాలను ప్రతిఘటిస్తున్నారు కాబట్టి… వాళ్లకూ ఓ వాదన ఉంటుంది కదా…
ఆ రణగొణ ధ్వనులు ఎలా ఉన్నా… రేవంత్ ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలానికి… వరుసగా అనేక రకాల వ్యతిరేకతల్ని మూటగట్టుకుంటున్న స్థితిలో… రెండు విశేష నిర్ణయాల్ని తీసుకుని, తెలంగాణ పాలనపై తమ ముద్రను వేశారు మొదటిసారి… సూపర్ సిక్స్ అమలులో పల్టీలు, అనుభవ రాహిత్య పాలన వల్ల జనంలో కొన్నాళ్లుగా వేగంగా పలుచన అవుతున్న రేవంత్ రెడ్డికి ఈ రెండు నిర్ణయాలూ ప్లస్సా మైనసా కాలం చెబుతుంది కానీ… తన ముద్ర మాత్రం వేశాడు…
కావచ్చు, ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో ఎన్నాళ్లుగానో రాష్ట్రంలో అలాంటిదే మరో సమస్యకు, డిమాండ్లకు బలం చేకూరవచ్చు… అది ఆదివాసీ, బంజారాల రిజర్వేషన్ల వివాదం… ఈ రెండు నిర్ణయాలతో మాలలు, బీసీలు హఠాత్తుగా కాంగ్రెస్ పల్లకీని కిందపడేసి, బీఆర్ఎస్ వైపో, బీజేపీ వైపో మళ్లుతారనీ అనుకోలేం… బీజేపీకి ఎలాగూ తెలంగాణలో ఓ దశ లేదు, ఓ దిశ లేదు…
బీసీలకు, ఎస్సీలకు జనాభా ఆధారిత ప్రయోజనాల పట్ల బీఆర్ఎస్ నేత కేసీయార్ ఎప్పుడూ సిన్సియారిటీని చూపించలేదు, ఇప్పుడు కొత్తగా ఆ పార్టీ ఏం చెప్పినా సరే జనం ఇంకా నమ్మే సిట్యుయేషన్ రాలేదు… కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌కు పాతర అంటున్నారు, కానీ కాంగ్రెస్ తన విధాన నిర్ణయంగా భావిస్తోంది, ఆ దిశగా ఓ ప్రయత్నం చేస్తోంది… బీఆర్ఎస్‌కు అది కూడా చేతకాలేదు కదా…
కాకపోతే కేసీయార్ మీద, బీఆర్ఎస్ మీద విపరీతమైన కోపంతో మాత్రమే జనం తమను గెలిపించారనీ, తమ పట్ల నమ్మకంతో కాదనీ కాంగ్రెస్ నేతలకు అర్థమైనట్టు లేదు… హైడ్రా అంతు చూస్తా, జైలుకైనా పోతా, నా ఇంట్లో రేవంత్ ఫోటోకు స్థానం లేదు అని దానం ఉరుముతున్నాడు… ఇంకొకాయన కూడా అంతే, కేసీయార్ ఫోటో చాలు అంటాడు…
ఒకాయన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అంటాడు, మరొకాయన పది మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు మీటింగ్ పెడతాడు… అధికార యంత్రాంగం ఇంకా బీఆర్ఎస్ కనుసన్నల్లోనే ఉంది… వాళ్ల పనులే అవుతున్నాయి, మరి మేమెందుకు గెలిచినట్టు అని ఉక్రోషం… ప్రత్యేకించి ఓ సీనియర్ మంత్రి వైఖరి మీద రుసరుసలు…
ఇంకోవైపు పార్టీ జంపర్ల మీద సుప్రీం రుసరుస… నోటీసులు… ఇదెక్కడి వరకూ పోతుందో తెలియదు… నిజంగానే శాసనసభ స్వతంత్రతను కాపాడే దిశలో ఫైట్ చేస్తారా..? వదిలేస్తారా..? అసలు పార్టీ జంపింగులపై అతి పెద్ద కల్‌ప్రిట్ బీఆర్ఎస్ పార్టీయే… పదేళ్ల కాలంలో ఎన్ని ఫిరాయింపులు, ఎన్ని ఎపిసోడ్లు…!
చివరకు ఇవన్నీ ఒకదానితో ఒకటి కలిసి… అరె, వీళ్లకు అనవసరంగా వోటేశామా అని జనమే విసుగు చెందేవరకూ ఇలాగే… అవును, కాంగ్రెస్ ఎప్పుడూ అంతే… మారితే కాంగ్రెస్ ఎందుకవుతుంది..? ఈ కొత్త నేతలకన్నా ఆ పాత, బాగా తెలిసిన ఆ పెద్ద భూతమే నయం అని గనుక జనం ఫిక్సయితే… నిజంగానే ఆ పెద్ద మనిషి కేసీయార్ ‘నేను కొడితే వట్టిగ ఉండదు’ అంటున్నాడు కదా…
ప్రస్తుతానికి అంత సీన్ లేదు గానీ… ఏమో, కాంగ్రెస్ కుమ్ములాటలు, క్రమశిక్షణా రాహిత్యాలు, ప్రతిపక్షాల్ని కౌంటర్ చేయలేని దౌర్భాగ్యాలు కలిసి… ఊతకర్ర అవసరం లేకుండానే కేసీయార్ ఉరుకులు తీసే పరిస్థితిని క్రియేట్ చేస్తాయేమో…!!
Share this Article