నిజానికి జో బిడెన్‌కు అధ్యక్ష పోటీ నుంచి విరమించుకోవాలని లేదు… వృద్ధాప్య సమస్యలు చుట్టు ముట్టాయి, వయస్సు 81 దాటింది… మాట తడబడుతోంది, మెదడు కూడా సహకరించడం లేదు… ఐనా మరోసారి ఎన్నికవ్వాలనే ఆశ మాత్రం బలంగానే ఉంది…
అందుకే పార్టీకి విరాళాలిచ్చేవాళ్లు, సీనియర్లు, ఇతర నాయకుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా సరే, తను పోటీలో ఉంటాననే చెబుతూ వచ్చాడు… ట్రంపు మీద గెలవాలంటే తనకే సాధ్యం అనీ నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు… నిజానికి పార్టీ డెలిగేట్స్ నుంచి మొదట్లో భారీ సంఖ్యలో తన అభ్యర్థిత్వానికి మద్దతు లభించింది…
కానీ వాదనల్లో వెనుకబడటం, తడబాట్లు, పొరపాట్లు… దీనికితోడు ట్రంపుపై షూటింగ్ తరువాత ట్రంపుకి హఠాత్తుగా ఆదరణ పెరగడంతో… బిడెన్ పార్టీలో వ్యతిరేకత పెరగసాగింది… చేతిలోని కాగడాను తరువాత తరానికి అందించి, తప్పుకోవాలనే డిమాండ్లు బాగా పెరిగాయి… ఈలోపు కరోనా వైరస్ అంటుకుంది…
Ads
వైట్ హౌజులో ఓ గదిలో కూర్చుని ప్రస్తుతం పార్టీ, తన అభ్యర్థిత్వంపై ఓ పోల్ డేటాను తెప్పించుకున్నాడు… 48 గంటలపాటు అధ్యయనం చేశాడు… పార్టీలో అంతర్గతంగా తనపట్ల పెరుగుతున్న వ్యతిరేకతను కూడా పరిగణనలోకి తీసుకుని, ఇక పోటీలో ఉండటం సరికాదని ఓ దృఢనిర్ణయం తీసుకున్నాడు…
కుటుంబసభ్యులతో భేటీ అయ్యాడు… తన నిర్ణయాన్ని చెప్పాడు… పలుసార్లు కమలా హారిస్‌తో మాట్లాడాడు… ఆ తరువాత తన సహాయకులను పిలిచి ఏం మాట్లాడాలో, జనానికి, పార్టీకి ఏం చెప్పాలో ఓ డ్రాఫ్ట్ తయారు చేయాల్సిందిగా పురమాయించాడు… మరోసారి దాన్ని సరిచూసుకుని అనౌన్స్ చేశాడు, కమలా హారిస్ అభ్యర్థిత్వాన్ని కూడా ప్రతిపాదించాడు…
ఐతే ఆయన చెప్పగానే కమలా హారిస్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అయిపోదు… ఒకరిద్దరు బలంగా పోటీకి వచ్చేట్టున్నారు… మళ్లీ పార్టీ డెలిగేట్ల వోట్ల సేకరణ జరుగుతుంది… మెజారిటీ మద్దతును ఆమె కూడగట్టుకోవాల్సి ఉంటుంది… దీనికి మళ్లీ ఓ బలమైన లాబీయింగ్ అవసరం… మళ్లీ అదొక ప్రయాస…
ఇంతా చేస్తే, ఇప్పుడున్న పోల్ సర్వేలను బట్టి ఆమె పార్టీకి గెలుపు అవకాశాలు తక్కువ… ట్రంపు దూసుకుపోతున్నాడు… ఏమో, చెప్పలేం… నిజంగానే ఆమె అధ్యక్ష అభ్యర్థిగా నిలబడితే, గెలిస్తే… ఓ ఘనత… మహిళలకు ఓటు హక్కు ఇవ్వడానికే గింజుకున్న అమెరికా సమాజం పాలనపగ్గాల్ని ఓ మహిళ… అదీ ఇండియన్- జమైకన్ రూట్స్ ఉన్న మహిళ చేపట్టే టైమ్ వస్తే… ఖచ్చితంగా ఓ చరిత్రే అవుతుంది…!!
మరి ఆమె నిజంగానే అధ్యక్షురాలు అయితే ఇండియాతో అమెరికా సంబంధాలు ఎలా ఉంటాయి..? ఇండియన్ రూట్స్ ఉండవచ్చుగాక, ఆమె అమెరికన్… తన పార్టీ పాలసీలు, అమెరికన్ సమాజం అవసరాలు, ప్రయోజనాల కోణంలో మాత్రమే ఆమె అడుగులు ఉంటాయి… వంద శాతం అదే నిజం..!!
మన దేశంలో కొన్ని పిచ్చి గొంతులు ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కాగానే… ఆమెను రాష్ట్రపత్ని అనాలా అనే వెకిలి కూతలకు దిగాయి… అమెరికాకు కమలా హారిస్ ప్రెసిడెంట్ అయితే ఏమని పిలుస్తారు, లేడీ ప్రెసిడెంట్ అంటారా అనడిగాడు ఒకాయన సోషల్ మీడియాలో… ప్రెసిడెంట్ అనే అంటారు..!! అదొక పోస్టు… లింగభేదాలు దానికి వర్తించవు..!!
Share this Article