కొన్ని వార్తలు నమ్మలేకుండా ఉంటయ్… ఇదీ అలాంటిదే… కరోనా విజృంభణ సీజన్‌లో ఒక్కొక్క ఫార్మా కంపెనీ ఎన్ని ఆస్తుల్ని పోగేసుకున్నదో లెక్కేలేదు… ప్రతి ప్రైవేటు హాస్పిటల్ ఎంత దోచుకున్నదో లెక్కలకు అందదు… లక్షల కుటుంబాలు దెబ్బతిన్నయ్… వేల కుటుంబాలు దివాలా తీశాయ్… ఆస్తులు అమ్మి, అప్పులు చేసి బిల్లులు కట్టినవాళ్లు లక్షల్లో… ఒకడు తక్కువ కాదు, ఒకడు ఎక్కువ కాదు… ఎవడూ శుద్ధపూస కాదు… ఎవడికి దొరికినకాడికి వాడు కుమ్మేశాడు…
సహజంగానే ప్రభుత్వాలు ఏమీ చేయవు కదా… పైగా అడ్డగోలు బిల్లులు ప్రైవేటు హాస్పిటల్స్‌లో కామన్ కదా… పెద్ద ఫార్మా కంపెనీలు, బడా కార్పొరేటు హాస్పిటళ్లతో నాయకులకూ బంధాలు ఉంటాయి కదా… కానీ హైకోర్టు కొరడా తీసింది, అడిగింది… గత ఏడాది జూన్‌లో తెలంగాణ వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ మేం 3 కోట్ల మేరకు రోగులకు వాపస్ ఇప్పించామని తెలిపాడు… అసలు హాస్పిటల్స్ రేట్లకు గరిష్ట పరిమితి ఎందుకు పెట్టలేదని కూడా కోర్టు ప్రశ్నించింది…
సికింద్రాబాద్ ఆర్టీఐ కార్యకర్త రాబిన్ ద్వారా దిన్యూస్‌మినట్ సైట్ కొంత అధికారిక సమాచారం సంపాదించింది… దాన్ని బట్టి 1.61 కోట్ల సొమ్మును ప్రైవేటు హాస్పిటళ్లు రోగులకు వాపస్ ఇచ్చాయట… అంటే అడ్డగోలు బిల్లులు వేశామని పరోక్షంగా అంగీకరించినట్టే కదా… నిజానికి ఒకసారి ప్రైవేటు హాస్పిటల్‌కు బిల్లు కడితే ఇక ఆ సొమ్ము ‘గోడకు వేసిన సున్నం, వెలయాలికి ఇచ్చిన సొమ్ము, అధికారికి ఇచ్చిన లంచం, లీడర్‌కు కట్టిన సుపారీ’ అన్నమాటే కదా… ఐనాసరే, ఈ 1.61 కోట్ల సొమ్ము వాపస్ ఇవ్వడం అనేదే విశేష వార్త…
Ads
ప్రభుత్వానికి 174 ఫిర్యాదులు మాత్రమే వచ్చాయట… 139 షోకాజ్ నోటీసులు ఇచ్చారట… అందులో 87 ఫిర్యాదులకు సంబంధించిన రికవరీ మాత్రమే ఆర్టీఐ సమాధానంలో ఇచ్చారట… 44 హాస్పిటల్స్ నుంచే రిఫండ్ ఇప్పించారట… అలాగే 22 హాస్పిటళ్ల అనుమతులు రద్దు చేశారట… వాటి పేర్లు, వివరాలు మాత్రం రహస్యంగా ఉంచుతున్నారు… అదేమిటో మరి…
10 లక్షలకు మించి నాలుగు హాస్పిటళ్లు రిఫండ్ ఇచ్చాయి… టాప్ ఏమిటో తెలుసా..? కూకట్‌పల్లిలోని ఓమ్ని… 27.41 లక్షల్ని వాపస్ చేసింది… అంటే ఏ రేంజులో అది ఓవర్ చార్జింగ్ చేస్తుందో అర్థం చేసుకోవాలి… పైన ఉన్న లిస్టు ఓసారి పరిశీలించండి… అవేకాదు… ఓసారి దిగువన లిస్టు పరిశీలిస్తే… పేద్ద పేద్ద పేరున్న హాస్పిటళ్లు కూడా ఈ ఓవర్ చార్జింగ్ దందాలో ఉన్నట్టు తేలతెల్లమవుతుంది… సో, ఏతావాతా తేలేది ఏమిటయ్యా అంటే… ఎవరూ శుద్ధపూస కాదు… ప్రైవేటు కోరల నుంచి ప్రజల్ని రక్షించడం ప్రభుత్వాల వల్ల కాదు అని…! వాళ్లు రిఫండ్ ఇప్పించిన సొమ్ము ‘‘సముద్రంలో కాకిరెట్ట అంత’’ అనే నిజం ప్రభుత్వ ముఖ్యులకూ తెలుసు కదా…!!
Share this Article