బ్యాంకుల విజాతీయం!
——————–
బ్యాంక్ అనే ఇంగ్లీషు మాటకు సమానమయిన తెలుగు పదం లేనే లేదు. కొన్ని అంతే. ఇప్పుడు దిగులు పడి మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు. అందుకే ఆ మాటను యథాతథంగా డు ము వు లు ప్రథమావిభక్తి సూత్రం కలిపి బ్యాంకు అంటున్నాం. చివర ఉ కలిసి బ్యాంకు, కారు, సోపు, పెన్ను అనడం సిగ్గుచేటు కాబట్టి- ఆ ఉన్న ఉ కు కూడా మంగళం పాడి- అసలు సిసలు ఇంగ్లీషు దొరల్లా బ్యాంక్, కార్, సోప్, పెన్ అని అందంగా మనమాటలు మనకే ముద్దొచ్చేలా అంటున్నాం.
బ్యాంక్
బ్యాంకు
బేంక్
బాంక్
బ్యేఙ్క్
ఇలా ఎలా రాసినా దాన్ని బ్యాంక్ అనే చదువుకోవాల్సిన బాధ్యత పాఠకుడి మీదే ఉంటుంది. నౌన్ గా, వెర్బ్ గా బ్యాంక్ మాట వాడుకలో ఉన్న విషయం తెలిసిందే. నౌన్ అయితే ఆర్థిక వ్యవహారాల బ్యాంక్. వెర్బ్ అయితే ఆధారపడు అనే అర్థంలో వాడుతున్నాం.
Ads
ఇక బ్యాంక్ లకు ఆ అర్థం ఉండదు. వెర్బ్ గా కూడా బ్యాంకుల మీద ఆధారపడడం కుదరదు. డెబ్బయ్ ఏళ్లుగా మనం ఆధారపడ్డ లేదా మనమీద ఆధారపడ్డ బ్యాంకులు రాత్రికి రాత్రి నిరాదరణవల్ల నిరాధారమై మాయమైపోవచ్చు. బ్యాంక్ బ్యాంకుగా బతకాలని అనుకున్నా వేల కోట్ల అప్పులు తీసుకున్న ఉద్దేశపూర్వక ఎగవేతదారు బిరుదాంకిత పెద్దలు వాటిని ముంచేయవచ్చు. బ్యాంకులో నోట్లు రాత్రికి రాత్రి చెల్లకుండా చిల్లులుపడి పోవచ్చు. మన డబ్బే అయినా అనివార్య, మానవాతీత, సాంకేతికతల వల్ల మనం డ్రా చేసుకోవడానికి అడుక్కుతినేవారిలా బొచ్చె పట్టుకుని క్యూలో నిల్చోవాల్సి రావచ్చు. సంకల్పిత శాస్త్రీయ నోట్ల రద్దుల వల్ల ఏ నోటు ఎప్పుడు చెల్లదో చెప్పడం కష్టం కావచ్చు. మొత్తంగా బ్యాంకులను జనం నమ్మని రోజులు రావచ్చు. యథా రాజా తథా ప్రజా.
ఇందిరా గాంధీ అప్పుడెప్పుడో బ్యాంకులను జాతీయం చేస్తే- అది భాషలో ఒక జాతీయంగా స్థిరపడింది. తాజాగా నాలుగు జాతీయ బ్యాంకులను ప్రయివేటుపరం చేయడానికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించి, నువ్వులు నీళ్లు వదలడానికి చక చక ఏర్పాట్లు చేస్తోంది. ప్రయివేటు బ్యాంకులను ప్రభుత్వపరం చేయడాన్ని భాషాపరంగా జాతీయం అన్నాం. ప్రభుత్వ బ్యాంకులను ప్రయివేటుపరం చేయడాన్ని భాషాపరంగా బ్యాంకుల విజాతీయం అనవచ్చేమో- భాషా పండితులు కూర్చుని తేల్చాలి. తెలుగులో బ్యాంక్ అన్న మాటే లేదు కాబట్టి బ్యాంకుల ప్రయివేటీకరణ అని ఈకరణ కలిపి సింపుల్ గా చెప్పవచ్చు. ఇది ఆత్మ నిర్భర స్వయం సమృద్ధ స్వదేశీ స్వయం చాలిత స్వకపోల ఆర్థిక వైదగ్ధ్య ప్రభుత్వ నిస్సహాయ ఉపసంహరణోద్భూత నిధి విచలిత విధి విషాద సహజ ప్రహసన పరిణామ సిద్ధాంతం!……….. By…. -పమిడికాల్వ మధుసూదన్
Share this Article