Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

…. అలా ఈనాడుపై ఉదయం, ఆంధ్రజ్యోతి ‘పగ తీర్చుకున్నాయి’…

December 17, 2025 by M S R

.

Bhavanarayana Thota …. ఎన్టీఆర్ దీక్ష: రిపోర్టర్ల మధ్య పగ

1991 లో రాజీవ్ గాంధీ హత్య జరిగింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. రాజీవ్ హత్యతో ఎన్టీఆర్ కి సంబంధం లేకపోయినా కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు ఆయన ఆస్తుల్ని ధ్వంసం చేశాయి. ఈ నష్టానికి పరిహారం ఇవ్వాలన్న ఆయన డిమాండ్ ను ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఆయన నిరసన తెలియజేయాలనుకున్నారు. ముందురోజు పత్రికా సమావేశం పెట్టి మరీ చెప్పారు.

Ads

చెప్పిన టైమ్ కి అందరూ అబిడ్స్ నివాసానికి చేరుకున్నారు. ఎర్రటి పంచె కట్టికొని ఎర్రటి కండువా కప్పుకున్న ఎన్టీఆర్ కారెక్కారు. దాని వెనుక సెక్యూరిటీ వాళ్ళ కారు. ఆ వెనుక రెండు వాహనాల్లో పత్రికలవాళ్ళున్నారు. కొంతమంది పార్టీ నాయకుల కార్లు, ఆ వెనుక టెంట్ సామగ్రితో మరో మినీ లారీ… వరుసగా బయలుదేరాయి.

ఎక్కడికి వెళుతున్నదీ చెప్పనేలేదు. ఆయన కాన్వాయ్ ఎటువెళితే అటు వెళ్ళటమేగా అనుకున్న పత్రికలవాళ్ళు మారుమాట్లాడకుండా కూర్చున్నారు. అబిడ్స్ లో బయలుదేరిన వాహనాలు నాంపల్లి వైపు తిరిగాయి.

అసెంబ్లీ దగ్గర కూర్చుంటారని అప్పటికి అంచనావేసుకున్నారు గాని చూస్తుండగానే వాహనశ్రేణి అసెంబ్లీ దాటి దూసుకుపోతోంది. అయితే కచ్చితంగా సెక్రటేరియట్ దగ్గరే అయి ఉంటుందనుకున్నారు. కానీ అక్కడ కూడా ఆగకుండా టాంక్ బండ్ వైపు వెళుతూ ఉంటే అర్థం కాక అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ అయోమయంలో పడ్డారు.

tdp

అలా టాంక్ బండ్ మీద వెళుతూ ఉండగా ఒక్కసారిగా ఎన్టీఆర్ కారు ఆగింది. ఆయన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహం పక్కనే ఒక కండువా పరచుకొని కూర్చున్నారు. అందరూ అవాక్కై చూస్తుండగానే వెనుక వచ్చిన టెంట్ సామాను వాళ్ళు చుట్టూ గోడలు కట్టేశారు. పత్రికలవాళ్లకు తెలియదుగాని, పార్టీ వాళ్ళకు ఆ ఏర్పాటు ముందే తెలుసని అప్పుడర్థమైంది.

ఎన్టీఆర్ ఒక స్వామీజీలాగా కూర్చోవటం, పార్టీ అభిమానులు, కార్యకర్తలు బారులు తీరి ఆయనకు నమస్కరించి వెళ్ళటం మొదలైంది. నిరవధిక నిరాహార దీక్ష అనటంతో హడావిడి చాలా ఎక్కువగానే మొదలైంది. మరుసటి రోజునుంచీ ఎమ్మెల్యేలు ఊళ్ళ నుంచి టూరిస్టు బస్సులు ఏర్పాటు చేసి మరీ అభిమానుల్ని రప్పించారు. మరీ ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

వచ్చినవాళ్ళకు మొదట్లో నారింజ పండ్లు ఇస్తూ వచ్చారు. ఆ తరువాత కుంకుమ భరిణెల పంపిణీ మొదలైంది. మొత్తానికి టాంక్ బండ్ మీద ఒక జాతర వాతావరణం ఏర్పడింది. ఆ విధంగా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఈ నిరసన దీక్షకు మరికాస్త నాటకీయత జోడించింది.

  • అదే సమయంలో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే జంట పత్రికలు ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్ వ్యతిరేక వార్తలు కూడా రాస్తూ వచ్చాయి. ఎన్టీఆర్ తన పక్కనే పెట్టుకున్న మట్టికుండలో నీళ్ళు తాగుతున్నారని, అవి మామూలు నీళ్ళు కావని, ఖర్జూరాలు నానబెట్టిన నీళ్ళని, అవి తాగితే ఆకలి కాదని రాశాయి. ఇలా దాదాపు వారంపాటు ఎన్టీఆర్ దీక్ష కొనసాగింది.

ఎన్టీయర్ ది కేవలం నిరాహారదీక్ష కాదు. అది మౌన దీక్ష కూడా. అందుకే ఆయన నోరు విప్పేవారు కాదు. ఏదైనా చెప్పాల్సి వస్తే ఒక కాగితం మీద రాసిచ్చేవారు. ఆయనను కలుసుకోవటానికి ఎంతోమంది జాతీయ నాయకులు.. ముఖ్యంగా కాంగ్రెసేతర నాయకులు కూడా వచ్చేవారు.

ఒకరోజు మాజీ ప్రధాని వీపీ సింగ్ అలాగే వచ్చి ఎన్టీఆర్ కి సంఘీభావం తెలియజేశారు. అలా వచ్చిన వీపీ సింగ్ కు కూడా ఎన్టీఆర్ ఒక కాగితం మీద ఏదో రాసి ఇచ్చారు. బహుశా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసి ఉండవచ్చు. అప్పుడు రిపోర్టర్లు ఆ కాగితం ఒకసారి చూపించమని వీపీ సింగ్ ను అడిగారు. “సారీ.. ఇది నాకు చాలా విలువైన జ్ఞాపిక” అంటూ ఇవ్వటానికి ఒప్పుకోలేదు.

*****
ఇక్కడ కొంత బ్రేక్ ఇచ్చి.. అంతకు కొద్ది రోజుల ముందు జరిగిన మరో ఘటన గుర్తు చేయాల్సి ఉంది.
*****
ఆ రోజుల్లో పరీక్ష ఫలితాలు ఫ్లాపీల్లో విడుదల చేసేవారు. విడుదల చేసిన వెంటనే ఆ ఫ్లాపీలను రిపోర్టర్లు అత్యంత వేగంగా ఆఫీసులకు చేర్చటం, వెంటనే ముద్రణకు సిద్ధం చేసి ప్రతులను మార్కెట్లోకి పంపటం ఒక సవాలుగా ఉండేది.

కొంతమంది రిపోర్టర్లు రిజల్ట్ రిలీజ్ అయ్యే చోటు నుంచి ఏ రూట్ లో ఆఫీస్ కి వెళితే ఎంత సేపట్లో చేరుకోగలరో రెక్కీ చేసి మరీ సిద్ధమయ్యేవాళ్ళు. అలా వీళ్ళు తీసుకెళ్లాక ప్రింటింగ్ పూర్తయి రోడ్డు మీదకొచ్చిన పత్రికలు చూసి రిజల్ట్ తెలుసుకోవటానికి విద్యార్థులు తహతహలాడేవారు.

eenadu
ఆ సంవత్సరం ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యే రోజు అన్ని ప్రధాన పత్రికల రిపోర్టర్లూ అంటే అప్రమత్తంగా ఉన్నారు. లోపల పత్రికాసమావేశంలో ఒక రిపోర్టర్ ఉంటే, ఇంకొకరు బయట బైక్ మీద సిద్ధంగా ఉండేవారు. రిజల్ట్ ఫ్లాపీతో లోపలి రిపోర్టర్ బయటికి పరుగు తీయటమే ఆలస్యం .. బైక్ రయ్యిన దూసుకుపోయేది.
ఆ రోజు కూడా అంతా అలాగే జరిగింది.

ఆంధ్రజ్యోతి, ఉదయం రిపోర్టర్లు అలా వేగంగా దూసుకుపోయి రొప్పుతూ ఆఫీసులో అడుగు పెట్టేసరికి వాళ్ళ న్యూస్ ఎడిటర్లు చాలా కోపంగా ఉన్నారు. “ ఏం సాధించారు? ఈనాడు ఇప్పటికే రిజల్ట్ పేపర్ మార్కెట్లోకి పంపింది!” అనే సరికి వాళ్ళకి నోట మాట రాలేదు. ఉదయం ఆఫీసులోనూ, ఆంధ్రజ్యోతి ఆఫీసులోనూ ఇదే పరిస్థితి. పొరపాటు ఎక్కడ జరిగిందో అర్థం కాలేదు.

అప్పట్లో ఈ రెండూ కాంగ్రెస్ అనుకూల పత్రికలుగా పేరుబడ్డాయి. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. అయినా సరే, రిజల్ట్ ఫ్లాపీ సంపాదించలేకపోవటం, పోటీ పత్రిక ఈనాడు ముందుగానే సంపాదించటం ఆ రెండు పత్రికల రిపోర్టర్లకూ తలకొట్టేసి నట్టయింది. దీంతో ఈనాడు మీద పగ తీర్చుకోవటానికి ఉదయం, ఆంధ్రజ్యోతి రిపోర్టర్లు సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.

ntr
*****
ఎన్టీఆర్ దీక్షా శిబిరం దగ్గరకు జనం పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉండటంతో రిపోర్టర్లకు రోజూ అక్కడ డ్యూటీ పడుతోంది. రాత్రి 9-10 గంటల దాకా అక్కడే ఉండి ఏయే ప్రముఖులు వచ్చారు, ఊళ్ళ నుంచి వచ్చిన జనం ఏమంటున్నారు అనే విశేషాలు రిపోర్ట్ చేస్తూ ఉండేవారు.

అప్పటికే దాదాపు వారం రోజులుగా జరుగుతున్న ఈ దీక్షకు ఆ రోజు పొద్దుపోయాక ముగింపు పలకాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. పోలీసులకు ఆదేశాలు వెళ్ళాయి. ఈ విషయం ఆంధ్రజ్యోతి, ఉదయం రిపోర్టర్లకు తెలిసింది. ఇదే తగిన సమయమనుకున్నారు. ఈనాడు మీద పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఫోటోగ్రాఫర్లను, ఇద్దరు రిపోర్టర్లను వెంటబెట్టుకు వచ్చి కాస్త దూరంగా ఉండమన్నారు.

రోజూ కవర్ చేసే ఆంధ్రజ్యోతి, ఉదయం రిపోర్టర్లు అక్కడున్న ఈనాడు రిపోర్టర్ కు ఏ మాత్రం అనుమానం రాకుండా టీకి వెళదామని బాగా దూరం నడుస్తూ వెళ్లారు. ఎలాగూ రోజులాగానే ఉంటుంది కదా అని ఈనాడు రిపోర్టర్ కూడా ఎంత మాత్రమూ అనుమానించలేదు. వీళ్ళు అలా టీ పేరుతో పక్కకు వెళ్ళిన కాసేపటికే పోలీసులు రావటం, ఎన్టీఆర్ ను శిబిరం నుంచి లిఫ్ట్ చేసి నిమ్స్ కు తరలించటం, ఆ శిబిరం ఆనవాళ్లను కూడా పూర్తిగా తొలగించటం.. అంతా పదే నిమిషాల్లో పూర్తయింది.

దీనికోసమే కాస్త దూరంగా ఎదురుచూస్తున్న ఆంధ్రజ్యోతి, ఉదయం రిపోర్టర్లు, ఫోటోగ్రాఫర్లు ఆ వార్త సేకరించుకొని ఆఫీసులకు పరుగుతీశారు. అంతా జరిగిపోయిన అరగంటకు గాని టీ బాచ్ మళ్ళీ అక్కడికి రాలేదు.

ntr

ఈనాడు రిపోర్టర్ అక్కడి ఖాళీ శిబిరం చూసి కంగారు పడుతూ ఉంటే వీళ్ళిద్దరు కూడా కాసేపు కంగారు నటించారు. అలా మరికాస్త ఆలస్యమైంది. ఈనాడు రిపోర్టర్ పరుగు పరుగున ఆఫీసుకు వెళ్ళి అక్కడి నుంచి ఫోన్ లో సమాచారం కొంత సేకరించగలిగినా ఫోటోలు లేవు. చివరికి సిటీ ఎడిషన్ కు చిన్న వార్త మాత్రమే ఇవ్వగలిగాడు.

ఈ వార్త విషయంలో ఈనాడు ఫెయిలైనట్టు లెక్క. ఈనాడు యాజమాన్యం ఆ రిపోర్టర్ మీద చర్య తీసుకుంది. ఇంటర్ రిజల్ట్ ఫ్లాపీ సంపాదించటానికి ప్రోత్సహించిన యాజమాన్యమే ఈ వార్త విషయంలో నిర్లక్ష్యానికి శిక్షించింది. రెండు సందర్భాలలో రిపోర్టర్లు వేరు వేరు. యాజమాన్యాలు అలాగే వ్యవహరిస్తాయి.

ఉదయం, ఆంధ్రజ్యోతి రిపోర్టర్లు రిజల్ట్ ఫ్లాపీ సంపాదించలేకపోవటం అనేది ఘోరమైన నేరమేమీ కాదు. ఒక్కోసారి ఒక్కొక్కరికి పరిస్థితి అనుకూలించవచ్చు. ఆఫీసులో ఎదురైన సూటిపోటి మాటలతో ఇగో దెబ్బతిన్న మాట నిజం.

ఆ ఓటమిని వ్యక్తిగతంగా తీసుకున్న ఫలితంగా మరో జర్నలిస్ట్ ఇబ్బందుల్లో పడ్డాడు. వార్తల సేకరణలో పోటీ సహజమే అయినా, మరీ ఇంతగా అవతలి వాళ్లను దెబ్బతీసే స్థాయిలో పోటీ పడటం మంచిది కాదని గుర్తు చేయటానికే ఈ సంఘటన….. తోట భావనారాయణ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • యూదులు ఎక్కడున్నా ప్రాణభయమే…! అసలు ఏమిటీ హనుఖ్క..!?
  • …. అలా ఈనాడుపై ఉదయం, ఆంధ్రజ్యోతి ‘పగ తీర్చుకున్నాయి’…
  • సీఎం జనంలో ఉంటే… అపహసించే ప్రతిపక్షం చరిత్రలో ఇదే తొలిసారి…
  • కీలక డాక్యుమెంట్… సాయుధ పోరాట దుస్థితిపై ఐదేళ్లుగా అంతర్గత చర్చ..!!
  • వావ్… తొలిసారిగా ఓ ‘ప్రెస్‌’టీజియస్ పోస్టులోకి లేడీ జర్నలిస్ట్..!
  • స్క్రిప్టెడ్ లవ్‌ట్రాక్ కాదు… సైలెంటుగా చిగురించి పెనవేసుకున్న బంధం..!
  • జుహీ చావ్లా తొలి తెలుగు సినిమా… అదీ సూపర్ స్టార్ డైరెక్షన్‌లో…
  • మెస్సీ పట్ల ఈ ‘ఫస్ట్ లేడీ’ అమర్యాదకర ప్రవర్తన..! నెటిజనం తిట్టిపోతలు..!!
  • ఎవరూ అడుగుమోపని… ఆ మార్మిక కైలాస పర్వతం ఎక్కిన ఏకైక వ్యక్తి..!!
  • 55 ఏళ్ల క్రితం గల్లంతు..! ఆ అణు పరికరం కథ తెలిస్తే నేటికీ వణుకే..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions