బాలీవుడ్ తలకాయలు పదే పదే సౌత్ ఇండియా సినిమాల మీద పడి ఏడుస్తుంటారు… అవి హిందీలోకి డబ్ అయిపోయి, మాకు రావల్సిన సొమ్మంతా దోచుకుపోతున్నాయి అన్నట్టుగా మాట్లాడతారు… కానీ వాళ్లకు అర్థం కానిదేమిటంటే… సౌత్ సినిమా ఇండస్ట్రీ కాంగ్రెస్ పార్టీలాంటిది… బుట్టలో పీతలు… ఒకరు పైకి పోతుంటే ఇంకొకరు కిందకు లాగుతూ ఉంటారు… పొన్నియిన్ సెల్వన్, కాంతార తాజా ఉదాహరణలు…
సినిమా ప్రముఖ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ఓ ట్వీట్ కొట్టాడు ఈరోజు… కాంతార 400 కోట్ల వసూళ్ల మైలురాయిని దాటిందని..! మొదటి నుంచీ సినిమా పట్ల పాజిటివ్‌గా ఉన్న నార్త్ సినీ జర్నలిస్టుల్లో ఈయన కూడా ఉన్నాడు… ఒక చిన్న సినిమా సాధిస్తున్న అపూర్వ విజయాన్ని ఆసక్తిగా, అబ్బురంగా పరిశీలిస్తూ… మనస్పూర్తిగా స్వాగతిస్తున్నవాళ్లు బోలెడు మంది… ఈరోజు ఇండస్ట్రీ అవసరం… చౌక సినిమాలు, క్రియేటివ్ కంటెంటు… అంతేతప్ప వందల కోట్ల భారీ ప్రాజెక్టులు కాదు…
ఎస్, హొంబలె ఫిలిమ్స్ వాళ్లు అనుకున్నట్టు 400 కోట్ల మార్క్ దాటేశారు కాబట్టి… ఇక ఓటీటీ డేట్ కూడా ఫైనల్ చేసి, ప్రసారం చేస్తారేమో… ఇప్పటివరకూ అమెజాన్ ప్రైమ్ వాడు ఆగడమే ఓ విశేషం… ఈ 400 కోట్లు వరల్డ్ వైడ్ కలెక్షన్లు… నెట్ షేర్ దాదాపు 300 కోట్లకు పైచిలుకు ఉంటుంది… థియేటరేతర రెవిన్యూ అదనం… సరే, ఆ లెక్కల్లోకి వెళ్లకుండా ఇక్కడే ఆగిపోదాం…
Ads
జాగ్రత్తగా గమనించండి… ఈ 400 కోట్లలో 168 కోట్లు కర్నాటకలో వచ్చినవే… ఒరిజినల్‌గా కన్నడ సినిమా కావడంతో ఈ వాటాను అర్థం చేసుకోవచ్చు. కన్నడిగులు బలంగా ఓన్ చేసుకున్నారు కాబట్టి 168 అనే ఫిగర్ కూడా పెద్ద ఆశ్చర్యం కలిగించదు… కన్నడ సినిమా చరిత్రలోనే, kgf ను కూడా దాటేసి వసూళ్లలో, టికెట్లలో నంబర్ వన్ అయిపోయింది… ఇది చిన్న విజయం కాదు…
తెలుగు ప్రేక్షకులు 60 కోట్లు ఇచ్చారు… మనకు నచ్చాలే గానీ ఉగాండా, రుమేనియా భాషల్లో సినిమాలకైనా బ్రహ్మరథం పడతాం కాబట్టి, బలమైన మౌత్ టాక్ ఉన్న కాంతారకు ఈమేరకు ఫాయిదా తెలుగులో రావడం కూడా ఆశ్చర్యం కలిగించదు…
ఓవర్‌సీస్ 44 కోట్లు… హిందీలో 96 కోట్లు… అంటే 100 కోట్లకు దగ్గర… హిందీ ప్రేక్షకులకు ఎందుకంత నచ్చిందనే చర్చను కూడా వదిలేస్తే… తమిళ, మలయాళ వసూళ్లూ చూడండి… పెద్ద మార్కెట్ అనిపించని కేరళలో 19 కోట్లు వస్తే అంతటి తమిళనాడులో వచ్చింది కేవలం 12.7 కోట్లు… అదీ కర్నాటక బోర్డర్‌లోని ప్రాంతాల్లోనే వచ్చి ఉంటుంది… అంటే స్థూలంగా తమిళ ప్రేక్షకులు కాంతారను తిరస్కరించారు… ఎందుకు..?
పొన్నియిన్ సెల్వన్‌ను కన్నడ ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు… వాళ్లే కాదు, తెలుగు ప్రేక్షకులు కూడా…! ఇక హిందీ వాళ్ల గురించి చెప్పనక్కర్లేదు… జుత్తు పీక్కున్నారు… ఐశ్వర్యా రాయి ఉంటేనేమ్, ఇంకేదో రప్ప ఉంటేనేమ్ అనుకున్నారు… ఎందుకంటే..? ఆ కథ, పాత్రల పేర్లు ఇతర భాషల ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు… అది తమిళ రాజుల చరిత్ర… ఆ కథను వాళ్లు ప్రైడ్‌గా భావిస్తారు… అంతటి మణిరత్నంకే పాత్రల్ని పరిచయం చేయడానికి గంటసేపు పట్టింది… అయినా తెలుగు, కన్నడ ప్రేక్షకులకు అస్సలు ఎక్కలేదు…
అరగంటకే థియేటర్ నుంచి పారిపోయిన వాళ్లు బోలెడు మంది… కానీ తమిళ ప్రేక్షకులు ఇదంతా కావాలనే తమ జాతి చరిత్ర పట్ల చేస్తున్న అవమానంగా భావించారు… ప్రత్యేకించి కన్నడిగులతో జాతివైరం ఎప్పుడూ ఏదో అంశం మీద రగులుతూనే ఉంటుంది కదా… ఆ కోపమంతా కాంతార మీద చూపించారు… దేశంలో ఎక్కడో ఏ మూలనో కూడా కాంతార క్లైమాక్స్‌కు థియేటర్‌లో ప్రేక్షకులు లేచి చప్పట్లు కొడుతుంటే మరి తమిళనాడు ప్రేక్షకులకు నచ్చకపోవడం ఏమిటి..? ఇదుగో ఇదే…!
Share this Article