ఆంధ్రప్రభలో కనిపించింది వార్త… మరి ఇతర పచ్చ ప్రధాన పత్రికల్లో కనిపించినట్టు లేదు గానీ… పదే పదే కుటుంబ పార్టీగా ముద్రలు పడినా సరే, నష్టమేమీ లేదు, అలాగే కనిపిద్దాం పర్లేదనే చంద్రబాబు ధోరణి మరోసారి స్పష్టంగా కనిపించింది… అది ఏపీలో అయినా సరే, తెలంగాణలో అయినా సరే, రేప్పొద్దున జాతీయ స్థాయికి పెరిగినా సరే…
అవును, ఇప్పటికీ తమది జాతీయ పార్టీ అనే చెప్పుకుంటుంది కదా తెలుగుదేశం పార్టీ… సరే, ప్రభ వార్తను బట్టి… తను ఎన్టీయార్ భవన్‌లో కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ ఇలా ఉద్బోధించాడట…
‘‘టార్గెట్ 2028, ఈసారి మనదే అధికారం, నేను వేసిన పునాదిపైనే అభివృద్ధి, వారంలో ఒకరోజు దృష్టి పెడతా, మరోరోజు లోకేష్ అందుబాటులో ఉంటాడు, వీలుంటే భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా… బాలయ్య అండగా ఉంటాడు…’’
Ads
ఇదే ఆ వార్త… తను, లోకేష్, లేకపోతే భువనేశ్వరి, బ్రాహ్మణి… తోడుగా మాత్రమే బాలయ్య, అంతే… కొన్నాళ్లు ఆగండి, దేవాంశు కూడా అందుబాటులోకి వస్తాడు అని మాత్రం చెప్పలేదు, అక్కడికి సంతోషం… తాము మాత్రమే, తమ కుటుంబం మాత్రమే, ఇంకెవరినీ నమ్మడానికి లేదు, రానివ్వడు… టీడీపీ అంటే, అది కూడా ఓ హెరిటేజ్‌లాగా కుటుంబ సంస్థ… నడుమ నడుమ జూనియర్ వంటి వాళ్లు అవసరానికి వస్తారు, అక్కర తీరగానే వెళ్లిపోతారు, ఎవరూ తిష్ఠ వేయడానికి వీల్లేదు…
సేమ్, బీఆర్ఎస్ చూడండి… కేసీయార్, కేటీయార్, హరీష్… అంతే… జైలులో ఉంది గానీ, లేకపోతే కవిత… వీళ్లే… తెరపై వీళ్లే కనిపిస్తుంటారు, వీళ్లదే పార్టీపరంగా నిర్ణయాధికాారం… పార్టీ విధాన నిర్ణయాలపైనే వీళ్లే మాట్లాడాలి… ఇంకెవరికీ చాన్స్ లేదు… నాలుగు రోజులు ఆగితే హిమాంశు అందుబాటులోకి వస్తాడు… అవసరమైతే హరీష్ పక్కకు వెళ్లిపోతాడు… జస్ట్, వారసత్వం ఫర్ కేసీయార్ బ్లడ్ ఓన్లీ…
ఆ పార్టీలు అంతే… అదే కాదు, దాదాపు ప్రతి ప్రాంతీయ పార్టీ కుటుంబ పార్టీయే… తాత లేకపోతే తండ్రి, కాకపోతే మనమడు… ఆస్తిపై పితృస్వామ్య వారసత్వంలాగా… తమిళనాడులో కరుణానిధి, స్టాలిన్, రేప్పొద్దున ఉదయనిధి… కనిమొళి సహా ఇంకెవరికీ ఏ చాన్స్ రానివ్వరు, రాదు… కర్నాటకలో దేవెగౌడ, కుమారస్వామి… బీజేపీలోనూ యడ్యూరప్ప, ఇప్పుడు కొడుకు విజయేంద్ర… ఎగువకు వెళ్తే శిబూ సోరెన్, హేమంత్ సోరెన్…
బీహార్, ఒడిశా కొంత బెటర్… నితిశ్‌కు రాజకీయ రక్తవారసులు లేరు… నవీన్ పట్నాయక్‌కు కూడా అంతే… మహారాష్ట్రలో బాల్‌థాకరే కొడుకు ఉద్దవ్ థాకరే, రేప్పొద్దున ఆదిత్య థాకరే… ఎన్సీపీ శరద్ పవార్‌కు తప్పడం లేదు, అజిత్ పవార్ పార్టీని వదిలేశాక ఇక సుప్రియా సూలే వారసురాలు… ఎగువకు వెళ్లే కొద్దీ అంతే… ములాయం సింగ్, అఖిలేష్… మమత బెనర్జీ, తన మేనల్లుడు (ఎవరూ లేరు, తప్పలేదు కాబట్టి)…
మాయావతికీ మేనల్లుడే వారసుడు… శిరోమణి అకాలీదళ్ కుటుంబ పార్టీయే… ప్రాంతీయ పార్టీలు, కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు, అప్రజాస్వామిక పార్టీలు… ఏ పేర్లు పెట్టుకున్నా భారతీయ రాజకీయాల కేరక్టరే ఇది… చివరకు కాంగ్రెస్ కూడా అంతే కదా… కొద్దోగొప్పో పూర్తి లెఫ్ట్, పూర్తి రైట్, అంటే బీజేపీ నయం… ఒక కుటుంబం పెత్తనం అనేది ఉండదు… మధ్యేవాద, లేక మిథ్యావాద పార్టీలన్నీ ఈ దుర్వాసనలతో ఉన్నవే..!!
Share this Article