.
( — ప్రసేన్ బెల్లంకొండ ) ది ఓల్డెస్ట్ కోట్… ‘ ఈ ప్రజలు బ్రెడ్ లేదు బ్రెడ్ లేదు అని గొడవ చేస్తారెందుకు? బ్రెడ్ లేకపోతే కేక్ లు తినొచ్చు కదా ‘ …..అందట ఎలిజబెత్ రాణి!!…
అన్వయం కుదురుతుందో లేదో గానీ నాకైతే పుష్ప – 2 టికెట్ రేట్ల గురించిన రభస చూస్తుంటే ఏలిజబెత్ రాణీమతల్లే గుర్తుకొస్తోంది!!
Ads
అవునూ పుష్ప 2 సినిమా యేమన్నా జీవ జలమా చూడకపోతే గొంతెండి చావడానికి ?…. If not పుష్ప 2 సినిమా యేమైనా గుక్కెడు బువ్వా తినకపోతే కడుపు నకనకలాడి టపా కట్టడానికి ?
వెయ్యి రూకలు లేకపోతే చూడకండి!
కొంపలేం మునగవు!
లాఠీ దెబ్బలు తినే ఓపిక లేకపోతే క్యూలో నిలబడకండి!
భూగోళమేమీ బద్దలైపోదు!
పుష్ప – 2 చూసి తీరవల్సిందే అని మిమ్మల్నెవరైనా పాయింట్ బ్లాంక్ గా బెదిరిస్తున్నారా…
పుష్ప – 2 చూడకపోతే మీ ఇంటి నల్లా కనెక్శన్ కట్ అని జీవో యేమన్నా జారీ అయిందా…
శ్రీవల్లి వైపు కన్నెత్తయినా చూడకండి, మీ వెయ్యో, రెండు వేలో, మూడు వేలో మీ జేబీలోనే భద్రంగా వుంటాయి. యెంచక్కా పచారీ సరుకులు కొనేసుకోవచ్చు.. సతుల్ సుతుల్ యెల్లరూ హాపీస్!!
విషాదమేంటంటే మనమే మార్కెట్ సృష్టించి, దాని కొమ్ములకు మనమే పదును పెట్టి, ఇప్పుడు కుమ్మేస్తునాయి బాబోయ్ అని గుండెలు బాదుకోవడం… మనం కన్నెత్తయినా చూడనందుచేత యెన్ని మంచి సినిమాలు మట్టి కొట్టుకు పోలేదు?
మన మట్టి మెదళ్ళకు కనీసంగా అర్ధం కాక యెన్ని గొప్ప సినిమాలు నేలకరవ లేదు!! ఇవాళ గగ్గోలు పెడుతున్న నోళ్లన్నీ ఆ ఇన్నొసెంట్ నిర్మాతలకు రాయితీలిచ్చాయా… కనీసం జాలి కన్నీళ్ళయినా కార్చాయా?
వంద కోట్లతో అల్లిన సినిమాకు వెయ్యి నోటు పెట్టడానికి కలిగిన బాధ వీర బాధే గానీ మరి పది కోట్లతో వాడెవడో నెత్తురొడ్డి తీసిన సినిమాను చెన్నయి సైట్ నుంచి ఉత్తి పుణ్యానికి కన్నం వేసి దోచేసినప్పుడు చౌర్యం ధర్మంగానే వుంది కదా!
పెద్ద సినిమాల పేరుతో మొదటి రోజు టికెట్ రేట్ రెండు నూర్లు వుండొచ్చని మెగా సూపర్ పవర్ తారలు రాజముద్రల జీవోలు తెచ్చుకున్నపుడు ఈ గగ్గోలీయులంతా యేడ నక్కినారో గందా!!
ఫ్రాంక్లీ స్పీకింగ్ నిజానికి సినిమా చూడడం అయితే గీతే అభిరుచి… కాకుంటే వ్యసనం!
అభిరుచైనా వెయ్యి వదులుకోండి…
వ్యసనమైనా వెయ్యి గురించి ఆలోచించకండి..ఈ రెండూ కాకపోతే రెండువారాలాగండి, సరసమైన ధరకే చూడొచ్చు . లేదా కన్నం వెయ్యడానికి మన చెన్నయి సైట్ మనకెలాగూ వుంది.
చివరగా ఓ మాట… పుష్ప ఎర్రచందనమైనా నరేంద్ర మోదీయం అయినా ఇది మార్కెట్! ఇక్కడ కొనేవాడు కూడా సరుకే.. వుండేదల్లా బార్టర్ సిస్టమే బ్రదర్… శవుటింగ్ డజంట్ సవుండ్ హియర్.
….
……… ఇది నేను 2015 లో పెట్టిన post…. ఇప్పుడు కేవలం ఆ post లో బాహుబలి అని ఉన్నచోట పుష్ప అని మార్చాను… అంతే. అయినా ప్రేక్షకుడు మారలేదు, ఆతని కాంక్ష తీరలేదు…….
Share this Article