కాజల్ అగర్వాల్ కొడుకు పేరు ఏమిటి..? శ్రియ మొగుడి ఇంటి పేరు రాయండి..? కరీనాకపూర్ కొడుకుల పేర్ల వివాదం వివరించండి..? ప్రముఖ దర్శకుడు రాంగోపాలవర్మ మియా మల్కోవాతో తీసిన సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు..? థమన్ ఎంతవరకూ చదువుకున్నాడు..? నయనతార మొత్తం అఫైర్లు, బ్రేకప్పులను సంక్షిప్తంగా రాయండి… వనిత విజయకుమార్ నాలుగు పెళ్లిళ్లూ ఎందుకు చెడిపోయాయి..? సమంత, నాగచైతన్య విడాకులకు కారణాలు ఏమై ఉంటాయో ఊహించండి…
రేప్పొద్దున మీ పిల్లల ఇంటర్ లేదా డిగ్రీ పరీక్ష పత్రాల్లో ఇలాంటి ప్రశ్నలు కనిపిస్తే ఏమాత్రం ఆశ్చర్యపోవద్దు… ఆహా.., పాపులర్, ప్రజెంట్, ఇంట్రస్టింగ్, క్రియేటివ్ ఎబిలిటీ టెస్టు అని చప్పట్లు కొట్టేవాళ్లు కూడా ఉంటారు… అలాంటి ప్రశ్నలకే ఇంకా రాను రాను పదును పెట్టి… అమ్మడూ లెట్స్ డు కుమ్ముడూ పాటకు డాన్స్ కంపోజర్ ఎవరు వంటి ప్రశ్నలూ ఇవ్వవచ్చు…
మిత్రుడు Prabhakar Jaini చెప్పినట్టు… ‘‘’ఖైదీ నెం 150′ అనే దృశ్యకావ్యం లోని రత్తాలూరత్తాలూ నిను చూస్తే నిలబడనంటాయి నా చొక్కా బొత్తాలూ అనే గాన చిత్రీకరణపై సవివరంగా, అంటే ఎంత మంది మహిళా నృత్యకళాకారిణులు ఏయే రంగులలో దుస్తులు ధరించారో, భాషలోని విశేషణాలతో సహా, రాస్తూ ఆ పాట తెలుగు భాషాభివృద్ధికి ఏ విధంగా తోడ్పడిందో 300 లైన్లలో రాయగలరు అని కూడా రావచ్చును… సన్నీ లియోని అనే సాధ్వి జీవనంపైనా ప్రశ్నలు అడగవచ్చును…’’
Ads
ఇంతకీ తాజా వివాదం ఏమిటంటే..? ఒక్కసారి ఇది చూడండి…
ఇంటర్ ఇంగ్లిష్ పరీక్షల్లో జూనియర్ ఎన్టీయార్ మీద వచ్చిన ప్రశ్నట ఇది… నెట్‌లో వైరల్ అవుతోంది… ఒక పాపులర్ టీవీ చానెల్ రిపోర్టర్‌గా జూనియర్ ఎన్టీయార్‌ను ట్రిపుల్ ఆర్ సినిమాకు సంబంధించి ఇంటర్వ్యూ చేసే చాన్స్ వస్తే, ఆ ఇంటర్వ్యూ ఎలా సాగుతుందో ఊహించి రాయండి… ఇదీ ప్రశ్న… అందులో ఏముండాలట అంటే..? మూవీ స్వభావం (బహుశా జానర్..?), ఫిలిమ్ డైరెక్టర్‌తో సంబంధాలు, మూవీ స్క్రిప్టు, సినిమాలో హీరో జోక్యం, ప్రేక్షకులపై ప్రభావం ఎట్సెట్రా అంశాలుండాలట…
ఇదా ఓ విద్యార్థి క్రియేటివ్ ఎబిలిటీకి ప్రశ్న..? ఇదా పరీక్ష..? ఐనా ఎన్టీయార్ పాత్ర పేరు కుమ్రం భీమ్ అని ఈ పరీక్ష పత్రం సెట్ చేసిన పెద్దమనిషికి ఎవరు చెప్పారు..? పైగా ట్రెమెండస్ సక్సెస్ అని ఆ ప్రశ్నలో సర్టిఫికెట్ దేనికి..? ఆ నాసిరకం ప్రశ్నలు కొత్తగా ఫిలిమ్ జర్నలిజంలో చేరిన కుర్ర రిపోర్టర్లు కూడా అడగరు కదా, మరి అలాంటివి పిల్లల మీద రుద్దుడు దేనికి..? ఇవన్నీ కాసేపు వదిలేద్దాం…
అసలు జాతికి ఖ్యాతి తెచ్చిపెట్టిన ఎందరు ప్రముఖులు లేరు..? మరీ సినిమా హీరోలే దొరికారా..? గొప్ప సాహితీవేత్తలు, పరిశోధకులు, చరిత్రకారులు, క్రీడాకారులు, అనేకానేక సక్సెస్ స్టోరీల హీరోలు ఎందరు లేరు..? అసలే మన చదువులు, సిలబస్ నాసిరకం స్థాయి మీద బోలెడు విమర్శలున్నాయి… దానికితోడు ఈ పరీక్ష పత్రాల్ని మరీ తెలుగు పత్రికల సినిమా పేజీల్లాగా మార్చేస్తే… రాను రాను ఇంకా ఏ స్థాయికి తీసుకుపోతారు..?
ఇక్కడ జూనియర్ ఎన్టీయార్ మీద ప్రశ్న అనేది సమస్య కాదు… ఏ హీరో అయినా ఒకటే… కానీ సినిమా నటుల పట్ల ఆరాధన పెరుగుతూ ఉన్న తీరు మీద ఇప్పటికే ఆందోళన ఉంది… ఇంకా దాన్ని పెంచవా ఇలాంటి అకడమిక్ ధోరణులు..? అన్నట్టు… ప్రశ్న వేశారు సరే, మరి ఆ సినిమా చూడనివారు ఏం రాయాలి..? ప్రశ్న సెట్ చేసిన పెద్ద మనిషికి ఈ సోయి లేదెందుకు..?!
Share this Article