మనం వేస్టనవసరంగా తెలుగు సినిమాల్ని, తమిళ సినిమాల్ని.., మన క్షుద్ర హీరోల పిచ్చి చేష్టల్ని, సూపర్ మ్యాన్ ఫైట్లని, తలతిక్క గెంతుల్ని, దిక్కుమాలిన కథల్ని, తోలుబొమ్మల హీరోయిన్లను, చెత్తచెత్త పాటల్ని చూసేస్తూ… తెగతిట్టేసుకుంటున్నాం, జుట్లు పీకేసుకుంటున్నాం… వీళ్లెప్పుడు మారతారో కదా అని తెగకన్నీళ్లు కార్చేస్తున్నాం గానీ…….. ది గ్రేట్ సల్మాన్ ఖాన్ నటించినట్టనిపించేసిన, ది గ్రేటర్ ప్రభుదేవా దర్శకత్వించిన, ది గ్రేటెస్ట్ జీగ్రూపు విడుదలించిన రాధే అనే సినిమా చూస్తే మన బాధ ఇట్టే మాయమైపోతుంది… మన తెలుగు స్టార్ సినిమాల్నీ ఆఫ్టరాల్ ఈ రాధే ముందు చిన్నగీతలు మాత్రమే అనే నగ్నసత్యం అర్థమైపోయి, మనవాళ్లే నయమని తేలిపోయి….. మన సౌతిండియా సూపర్ స్టార్లు, మెగాస్టార్లు, సుప్రీంస్టార్లు, పవర్ స్టార్లు, మెగాపవర్సుప్రీంసూపర్ స్టార్లు గట్రా అందరూ బెటరే అని ఫిక్సయిపోతాం… థాంక్స్ ప్రభుదేవా… నువ్వు అప్పుడెప్పుడో తీసిన వాంటెడ్ సినిమా దగ్గరే ఆగిపోయి, అకస్మాత్తుగా కళ్లుతెరిచి, ఇంకా లోకం నీలాగే అక్కడే ఆగిపోయి, పడుకుని ఉందని భ్రమపడి, అలాగే సినిమా తీయబోయావ్ చూడు… చాలామంది కళ్లు తెరిపించావ్… ప్రస్తుత కాలంలో సినిమా ఎలా ఉండకూడదో, ఎలా చేతులు, మూతులు, జేబులు కాల్చుకోకూడదో తెలియజెప్పావ్….
ఫోటో మరోసారి చూడండి… మన బోయపాటి సినిమా సీన్ కానేకాదు, ఆ కారుపై నుంచి హెలికాప్టర్ పైకి గాలిలోనే దూకుతున్నది బాలయ్య కూడా కాదు… నో, నో, వినయవిధేయ రామచరణుడు అసలే కాదు… రాధేలోని ఓ సీను… నిజానికి ఈ తరం పదే పదే చెప్పుకుని నవ్వే సీన్లలో బాహుబలి-2లోని తాటిచెట్ల స్ప్రింగులు, కోటలోకి గుంపులుగుంపులుగా ఎగిరిపోయే సీన్ ప్రథమం… తరువాత వినయవిధేయలో హీరో ఎయిర్ పోర్ట్ అద్దాన్ని బద్దలుగొట్టుకుని, ఓ బ్రిడ్జి మీద నుంచి రైలు మీదకు దూకేసి, విశాఖ నుంచో, గుజరాత్ నుంచో నేపాల్ బోర్డర్‌కు వెళ్తాడు… ఈ రేంజులో తీశాడు రాధేలోని ఈ సీన్… ఓ కారును అమాంతం గాలిలోకి లేపి, సూటిగా హెలికాప్టర్ దగ్గర దాకా డ్రైవ్ చేసి, దాని పైకి ఎక్కి, ఒడుపుగా ఛాపర్ బాడీ బద్దలు కొట్టుకుని లోపలకు డ్యాషింగ్ ఎంట్రీ ఇస్తాడు… సూపర్… ఇప్పట్లో మళ్లీ ఎవడూ ఈ రేంజ్ యాక్షన్ సీన్ తీయలేడు… అసలు ఈ సినిమాను సల్మాన్ ఎలా ఒప్పుకున్నాడో… పైగా నిర్మాతగా డబ్బు ఎందుకు పెట్టాడో తనకే తెలియాలి… అన్నట్టు, ఇప్పటి యాక్షన్ సీన్ చూస్తారా..? ఇదుగో…
Ads
ఆశ్చర్యమేస్తుంది… ఈమాత్రం సినిమా కథకు ది ఔట్ లాస్ అనబడే కొరియన్ కథను ఎందుకు తీసుకున్నారో తెలియదు, అదే ఔట్ డేటెడ్ లాస్ కదా… ఇక్కడ లాస్ అనగా చట్టాలు ప్లస్ నష్టాలు అని అర్థం… పోనీ, దాన్ని ఇండియనీకరించారా అంటే అదీ సరిగ్గా లేదు, పూర్తిగా సల్మానీకరించారు… అంతే… అబ్బే, ఇప్పుడు హీరో నవ్వగానే, కనిపించగానే, కండలు చూపించగానే, నాలుగు పిచ్చి గెంతులు వేయగానే, హీరోయిన్ పట్టుకుని నడుంలు ఊపగానే జనం విజిళ్లు వేస్తూ సినిమా చూసే రోజులు పోయాయి… పైగా ఇలాంటి పిచ్చి కథ ఆఫ్టరాల్ తెలుగులోని ఏ దిక్కుమాలిన సీరియల్ రైటర్‌ను రాసివ్వమని చెప్పినా… ఒక్క పెగ్గు అయిపోయేలోపు పూర్తిచేసి చేతికిస్తాడు… ఈ సిక్సున్నర ప్యాకులు, బాడీ బిల్డప్పులు, హీరో ఇమేజీలు చూసి ప్రేక్షకులు సై అనడం లేదబ్బా ప్రభుదేవా… అలాగైతే మా పవన్ కల్యాణ్ తీసిన అజ్ఞాతవాసి ఏమైందో చెప్పు… అంతటి త్రివిక్రముడే నాలుగు రోజులు లోకానికి మొహం చూపించలేదు…
కొత్తతరం దర్శకులు వస్తున్నారు, ఎంతోకొంత ప్రయోగాలు చేస్తున్నారు, జనం చూస్తున్నారు… ఇంకా ఆ ఓల్డ్ ఫార్ములా, ఇమేజీ బిల్డప్పు బాపతు ఉప్మా కథల్ని చీదరించుకుంటున్నారు… జనానికిప్పుడు కొత్తదనం కావాలి… ఈ 55 ఏళ్ల హీరో బాడీ… మరో అరవయ్యేళ్ల జాకీ ష్రాఫ్ బాడీ విత్ అండర్ వేర్… ఆయన కోడల్లాంటి దిశ పటానీకి సోదరపాత్ర ఏమిటో… అసలు ఆ పాత్ర ఎందుకున్నదో… ఆ పటానీ పాత్ర ఏమిటో ఏమీ అర్థం కాదు మనకు… అఫ్ కోర్స్, సినిమా అంతా అలాగే అనుకొండి… ఇలాంటి ఏ సినిమాలైనా సరే, ఓ పెద్ద స్మగ్లింగ్ విలన్, అడ్డొచ్చిన వాళ్లను కసకసా నరికేసే కేరక్టర్… ఎడాపెడా ఎన్కౌంటర్లు చేసేస్తూ, సస్పెండ్ అవుతూ, సాగుతూ ఉండే సూపర్ హీరో… బాబ్బాబు, నువ్వు తప్ప వేరే దిక్కులేదోయ్ అని పోలీసోళ్లు వేలాదిగా మూకుమ్మడిగా హీరో కాళ్ల మీద పడిపోతే, తను దయతో తెగకష్టపడి, తన మానవాతీత శక్తుల్ని ఉపయోగించి నరకాసురవధ చేసేయడం… ఇదీ అంతే… ఈమాత్రం దానికి 250 (సారీ, బాటా చెప్పుల ధర 249) రూపాయలు పెట్టాలట… ఇంకా నయం, ఓటీటీలో పెట్టారు… థియేటర్లు ఓపెన్ ఉండి ఉంటే, ఎన్ని పర్సులు ఎంత కన్నీరు కార్చేవో… ఓటీటీ కాబట్టి, మనం ఇష్టారీతిన కదిలిస్తూ, సినిమాను చప్పున ముగించేసి… సల్మాన్, ప్రభుదేవాలను తలుచుకుని, మనసులోనే ఓ పేద్ద దండం పెట్టేసుకుని, జాలిపడి, కోప్పడి, తరువాత ఓ యాస్పిరిన్ వేసుకుని….. దుప్పటి తన్నేయడమే…!!
Share this Article